రైట్.. రైట్.. గచ్చిబౌలి టు శంషాబాద్‌

21 Aug, 2021 09:27 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఔటర్‌ రింగురోడ్డుపై మినీ బస్సులు పరుగులు తీస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ మేరకు గచ్చిబౌలి–శంషాబాద్‌ మార్గంలో తొలిసారిగా వీటిని ప్రవేశపెట్టారు.  డిమాండ్‌కనుగుణంగా ఇతర మార్గాల్లోనూ బస్సుల విస్తరణకు గ్రేటర్‌ ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది. కొంతకాలంగా నగరంలో మెట్రో  రైళ్ల నుంచి ఎదురవుతున్న పోటీ, కోవిడ్‌ దృష్ట్యా ప్రజా  రవాణా రంగంలో నెలకొన్న స్తబ్దత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల డిమాండ్‌ ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. 

నష్టాల బాటలో.. 
నగర శివారు ప్రాంతాల అవసరాల మేరకు మార్గాలను ఎంపిక చేసుకొని బస్సులను నడుపుతున్నారు. దశలవారీగా సుమారు ఏడాది పాటు సిటీ బస్సులు నిలిచిపోవడంతో తీవ్రమైన నష్టాలను ఎదుర్కోవాల్సివచ్చింది. సాధారణంగా రోజుకు రూ.3.5 కోట్ల ఆదాయం లభించాల్సిన గ్రేటర్‌ ఆర్టీసీకి కోవిడ్‌ కాలంలో రోజుకు రూ.50 లక్షలు కూడా లభించలేదు. నష్టాలను అధిగమించేందుకు ప్రయాణికులకు చేరువయ్యేలా ప్రణాళికలను సిద్ధం చేశారు.  

ప్రయాణికుల చెంతకే..  
ఔటర్‌పై ప్రైవేట్‌ వాహనాల రాకపోకలు ఎక్కువ. దీంతో  వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించే  ప్రయాణికులు కూడా ఈ వాహనాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వరకు తాజాగా మినీ బస్సులను ప్రవేశపెట్టింది. 30 సీట్ల సామర్ధ్యం ఉన్న ఈ బస్సులు రోజుకు 76 ట్రిప్పులు తిరుగుతాయి. ప్రతిరోజూ సుమారు 5 వేల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయం లభించనుంది. ఉదయం 7.30 నుంచి  సాయంత్రం 7.45 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి. గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వరకు రూ.35 టికెట్‌ చార్జీ. ఈ బస్సుల్లో ఎలాంటి పాస్‌లను అనుమతించబోమని ఆర్‌ఎం వెంకన్న తెలిపారు.

మరిన్ని వార్తలు