Hyderabad: ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు యూఎస్‌ కాన్సులేట్‌

26 Oct, 2022 14:12 IST|Sakshi

కాన్సులర్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌

14 ఏళ్లుగా సేవలందించిన పైగా ప్యాలెస్‌

బేగంపేటలో ఘనంగా కాన్సులేట్‌ చివరి వార్షికోత్సవం

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌–అమెరికా దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను పర్యవేక్షించే యూఎస్‌ కాన్సులేట్‌ కార్యాలయ వార్షికోత్సవాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. 2008 వరకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికైనా అమెరికా వీసా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ఇంటర్వ్యూ కోసం వ్యయ ప్రయాసలకు ఓర్చి చెన్నై వెళ్లేవారు. చెన్నై కాన్సులేట్ లోని మొత్తం ఇంటర్వ్యూల్లో తెలుగు రాష్ట్రాల వారే 40% కంటే ఎక్కువ కావడంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్ రాజశేఖరరెడ్డి దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు.

2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా వైఎస్సార్.. ఆయన్ను ఒప్పించడంతో తెలుగు ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో సౌకర్యం ఏర్పడింది. జార్జి బుష్ అమెరికా వెళ్లగానే వైఎస్సార్ కోరిక మేరకు హైదరాబాద్ కాన్సులేట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. ఇటు వైఎస్సార్ కూడా వేగంగా స్పందించి బేగంపేటలో ఉన్న పైగా ప్యాలెస్‌ను కేటాయించారు. ఈ భవనంలోనే కాన్సులేట్ కార్యాలయాన్ని.. 2008 అక్టోబర్‌ 24న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను చూసుకున్న ఈ భవనానికి ఇదే చివరి వార్షికోత్సవం. అందులో భాగంగా 14 ఏళ్ల పాటు సేవలందించిన కార్యాలయం పైన చివరిసారిగా అమెరికా జెండాను ఎగుర వేశారు. 


300 మిలియన్‌ డాలర్లతో నూతన కాన్సులేట్‌.. 

నగరంలోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వేదికగా 300 మిలియన్‌ డాలర్ల వ్యయంతో అత్యాధునిక, సాంకేతిక సదుపాయాలతో నిర్మించిన నూతన భవనంలోకి ఈ కాన్సులేట్‌ మారనుంది. అనుకోకుండా కాన్సులేట్‌ ప్రారంభించిన రోజునే ఈ కార్యాలయం చివరి రోజు కావడం, దీపావళి పండుగ కలిసి రావడంతో సిబ్బంది వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వీడియోను కాన్సులేట్‌ జనరల్‌ జెన్సిఫర్‌ లార్సన్‌ విడుదల చేశారు.  (క్లిక్: నాగోలు ఫ్లై ఓవర్‌.. ఎల్‌బీనగర్‌– సికింద్రాబాద్‌ మధ్య ఇక రయ్‌రయ్‌)

భారత్‌లో మొదటి శాశ్వత భవన అమెరికా దౌత్య కార్యాలయం.. 
ఈ సందర్భంగా జెన్నిఫర్‌ లార్సన్‌ మాట్లాడుతూ.. భారత్‌–అమెరికా మధ్య సంబంధాలను మరింత ఉన్నతంగా మార్చడానికి హైదరాబాద్‌ అనువైన వేదిక అనే ఉద్దేశంతో యూఎస్‌ కాన్సులేట్‌ను ప్రారంభించామని అన్నారు. స్వాతంత్య్రం పొందిన తరువాత భారత్‌లో నిర్మించిన మొదటి అమెరికా దౌత్యపరమైన శాశ్వత భవన కార్యాలయం ఇదేనని పేర్కొన్నారు. ఈ కార్యాలయం తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా రాష్ట్రాల వ్యవహారాలను పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు