HYD: ఏటీఎంలో పెట్టాల్సిన నగదుతో డ్రైవర్‌ పరారీ.. 37 లక్షలు ఉన్నప్పటికి రూ.3 లక్షలతోనే..

4 Nov, 2022 09:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కెనరా బ్యాంక్‌ ఏటీఎం కేంద్రాల్లో డబ్బును లోడ్‌ చేసేందుకు వచ్చిన డ్రైవర్‌ అదును చూసి రూ.3 లక్షలతో ఉడాయించాడు. వాహనంలో రూ. 37 లక్షలు ఉన్నప్పటికి బ్యాక్సులను మోయలేక రూ.3 లక్షల బాక్సుతో పాటు రెండు సెక్యూరిటీ గన్‌లతో పరారయ్యాడు. రాజేంద్రనగర్‌ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కెనరా బ్యాంకు ఏటీఎం సెంటర్లలో రైటర్‌ సేఫ్‌ గార్డు సంస్థ నగదును లోడ్‌ చేస్తుంది. ప్రతి రోజు వివిధ రూట్‌లలో ఈ సంస్థ ఆధ్వర్యంలో వాహనాల్లో సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు ఏటీఎం సెంటర్ల వద్దకు వెళ్లి నగదును లోడ్‌ చేస్తారు.

గురువారం సిబ్బంది అశోక్, భాస్కర్‌తో పాటు సెక్యూరిటీ గార్డులు కె.వి.రామ్, చంద్రయ్యలు రూ.72 లక్షలతో డ్రైవర్‌ ఫారూఖ్‌తో కలిసి వాహనంలో బయలుదేరారు. అహ్మద్‌నగర్, ఎన్‌ఎండీసీ, గగన్‌పహాడ్, రాజేంద్రనగర్‌ ప్రాంతాల్లోని ఏటీఎం సెంటర్లలో నగదును లోడ్‌ చేసి ఆయా కేంద్రాల్లో మిగిలిన బాక్సులను తీసుకుని వాహనంలో లోడ్‌ చేశారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో రాజేంద్రనగర్‌లోని కెనరా బ్యాంకు ఏటీఎం సెంటర్‌కు వచ్చారు. సిబ్బంది ఆశోక్, భాస్కర్‌తో పాటు సెక్యూరిటీ సిబ్బంది కె.వి.రామ్, చంద్రయ్య లోపలికి వెళ్లి షట్టర్‌ వేసుకుని నగదును లోడ్‌ చేస్తున్నారు. సెక్యూరిటీకి చెందిన రెండు ఏయిర్‌ పిస్తల్‌లను వాహనంలోనే ఉంచారు.

ఇదే అదనుగా భావించిన డ్రైవర్‌ ఫారూఖ్‌ వాహనంతో ఉడాయించాడు. రాజేంద్రనగర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహం నుంచి బుద్వేల్‌ మీదుగా కిస్మత్‌పూర్‌ బ్రిడ్జీ వద్దకు చేరుకున్నాడు. అక్కడ రోడ్డు పక్కన వాహనాన్ని పార్కు చేసి అందులో ఉన్న ఒక బాక్సు, రెండు గన్‌లను తీసుకుని పరారయ్యాడు. ఒక్కడే ఉండడం, బాక్సులు పెద్దగా ఉండడంతో నగదు మొత్తం తీసుకెళ్లేందుకు అతడికి వీలు కాకపోయి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.  ఏటీఎంలో డబ్బులు లోడ్‌చేసి బయటికి వచ్చిన సిబ్బంది చూడగా వాహనం కనిపించకపోవడంతో 100కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు.
చదవండి: Road Accident: బస్సు, టవేరా వాహనం ఢీ.. 11 మంది దుర్మరణం

ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో రాజేంద్రనగర్‌ పోలీసులు, శంషాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు బ్యాంకు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వాహనానికి జీపీఎస్‌ సౌకర్యం ఉండడంతో ఏజెన్సీ నిర్వహకుల సమాచారంతో పోలీసులు కిస్మత్‌పూర్‌ బ్రిడ్జి వద్ద వాహనాన్ని స్వాదీనం చేసుకున్నారు. వాహనంలో మిగిలిన నగదు బాక్సులు ఉండడం, ఒక్క బాక్సు మాత్రమే కనిపించకపోవడం, రెండు గన్‌లు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు నగదును లెక్కించగా రూ.3 లక్షలు బాక్సుతో డ్రైవర్‌ పారిపోయినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

సీసీ కెమెరాల పరిశీలన... 
డ్రైవర్‌ ఫారూఖ్‌ ఒక్కడే నగదును దొంగలించాడా అతడికి ఎవరైనా సహకరించారా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏటీఎం సెంటర్‌ నుంచి కిస్మత్‌పూర్‌ బ్రిడ్జీ వరకు  సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అతను ట్రంక్‌ బాక్సుతో పాటు రెండు గన్‌లను తీసుకువెళ్లడం సాధ్యం కాదని  పోలీసులు పేర్కొంటున్నారు. సెక్యూరిటీ గార్డులకు చెందిన ఈ తుపాకులు బరువుగా ఉంటాయని వాటిని తీసుకువెళ్లే సమయంలో ప్రతి ఒక్కరు గుర్తిస్తారన్నారు. స్థానికంగా వాటిని పడేసి ఉండవచ్చునని భావించిన పోలీసులు దాదాపు గంట సేపు గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు