Hyderabad: వినాయక చవితి ఉత్సవాలు, ఊరేగింపు.. ఈ నియమాలు తప్పనిసరి!

29 Aug, 2022 11:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పల్లె, పట్నం, చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఎదురు చూస్తున్న వినాయక చవివి రానే వచ్చింది. ఆగస్టు 31 నుంచి  చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.భక్తులు మండపాల ఏర్పాటు, విగ్రహాల కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. మండపాలు ఏర్పాటు, పూజలు, ఊరేగింపు, నిమజ్జనం తదితర అంశాల్లో జాగ్రత్తలు పాటిస్తే నవరాత్రులు విజయవంతమైనట్లే, విఘ్నేశ్వరుడి ఆశీస్సులు లభించినట్లే. ఈ నేపథ్యంలో  ఉత్సవాల్లో పాటించాల్సిన అంశాలపై ప్రత్యేక కథనం.

రాకపోకలకు భంగం కలిగించొద్దు... 
వినాయక మండపాలు ఏర్పాటు చేసే సమయంలో సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. రహదారి మధ్యలో మండపాలు నిర్మిస్తే వాహనాల రాకపోకలు, ఇతర ఇబ్బందులు ఎదురవుతాయి. ఖాళీ స్థలాల్లో మండపాలు ఏర్పాటు చేసుకోవాలి. 

విగ్రహాల పరిమాణం.. 
విగ్రహాల పరిమాణం చిన్నగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే నిమజ్జనం సమయంలో విద్యుత్‌ తీగలు తాకే ప్రమాదముంది. తరలించే సమయం, మండపాల స్థలాన్ని దృష్టిలో ఉంచుకొని చిన్న విగ్రహాలను ప్రతిష్టించాలి. 
చదవండి: తెలంగాణలో భారీగా పెరిగిన క్రైం రేటు.. దేశంలోనే నెం.1

పర్యవరణాన్ని కాపాడాలి.. 
రసాయనాలు, ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ వంటి హానికరమైన వాటితో చేసిన విగ్రహాలతో నీటి కాలుష్యం ఏర్పడుతుంది. మట్టి, పీచు, సహజ సిద్ధమైన రంగులతో తయారైన విగ్రహాలను పూజించాలి.  

డీజేలకు పోలీసుల అనుమతి తీసుకోవాలి..  
పూజా సమయంలో మాత్రమే మైకులు ఉపయోగించాలి. అనవసర సమయంలో బంద్‌ చేయాలి. భక్తి గీతాలు మాత్రమే వినిపింంచాలి. డీజేలు, భారీ స్పీకర్లకు పోలీసుల అనుమతి తీసుకోవాలి.         

వ్యయం తగ్గించాలి... 
మండపాల నిర్వాహకులు చందాలు డిమాండ్‌ చేయకుండా భక్తులు ఇచ్చింది  తీసుకోవాలి. మండపాల అలంకరణ, నిమజ్జనం రోజు భారీగా ఖర్చు చేయడం కంటే అన్నదానం, పిల్లలకు వినోద, విజ్ఞానం వచ్చే అంశాల్లో  పోటీలు నిర్వహించి బహుమతులు ఇచ్చి ప్రోత్సహించాలి. 

సాఫీగా నిమజ్జనం చేయాలి... 
నిమజ్జనం రోజున మద్యం సేవించి డ్యాన్స్‌లు చేస్తూ సమస్యలు సృష్టించవద్దు. చెరువుల వద్ద అధికారుల సూచనలు పాటించాలి. స్వామివారిని  భక్తి శ్రద్ధలతో  నిమజ్జనం చేయాలి. 

పోలీసులకు సహకరించాలి.. 
పండుగ మూలాలు తెలుసుకొని బాథ్యతగా వినాయక ఉత్సవాలను జరుపుకోవాలి. విగ్రహ ప్రతిష్ట నుంచి నిమజ్జనం వరకు ఇతరులతో పోటీ పడకుండా సాంప్రదాయాలు పాటించాలి. ప్రభుత్వ సూచనలను పాటించాలి. శాంతిభద్రతల విషయమై పోలీసులకు సహకరించాలి.   
– చంద్రబాబు, సీఐ ఘట్‌కేసర్‌

మరిన్ని వార్తలు