సంక్రాంతికి సొంతూరెళ్లాలంటే కష్టాలే!.. వెయిటింగ్‌ లిస్ట్‌ కాదు ఏకంగా రిగ్రేట్‌!

13 Oct, 2022 08:51 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

అన్ని ప్రధాన రైళ్లలో భారీగా డిమాండ్‌ 150 నుంచి 250 వరకు వెయిటింగ్‌ కొన్ని రైళ్లలో ‘రిగ్రేట్‌’.. ఏపీకి వెళ్లేందుకు ఎదురు చూపులే?

సాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి పండగకు సొంతూరు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్న నగరవాసులకు వెయిటింగ్‌ లిస్ట్‌ నిరాశకు గురి చేస్తోంది. సాధారణంగా రైళ్లలో మూడు నెలల ముందే రిజర్వేషన్‌ చేసుకొనే సదుపాయం ఉంటుంది. కానీ.. హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే అన్ని ప్రధాన రైళ్లల్లో జనవరి నెలాఖరు వరకు ఇప్పటికే రిజర్వేషన్లు బుక్‌ అయ్యాయి.

సికింద్రాబాద్‌ నుంచి విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో 150 నుంచి  250 వరకు వెయిటింగ్‌ లిస్టు దర్శనమిస్తుండగా, కొన్ని రైళ్లు ‘రిగ్రేట్‌’  అంటూ చేతులెత్తేస్తున్నాయి. దీంతో సంక్రాంతికి సొంత ఊరుకు వెళ్లేందుకు ఈసారి ఇబ్బందులు తప్పేలాలేవు!. మరోవైపు  జనవరి నెలలోనే ఎక్కువ మంది అయ్యప్ప భక్తులు శబరికి వెళ్లనున్నారు. దీంతో రైళ్ల కొరత సవాల్‌గా మారింది. డిమాండ్‌ మేరకు రైళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్‌ వాహనాలు, ప్రైవేట్‌  బస్సులను  ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.  

భారీగా పెరిగిన ప్రయాణాలు.. 
కోవిడ్‌ అనంతరం  ప్రయాణాలు భారీగా పెరిగాయి. అన్ని రైళ్లలో  పర్యాటకుల రద్దీ గణనీయంగా పెరిగింది. రెండు, మూడేళ్ల పాటు  ప్రయాణాలను వాయిదా వేసుకున్న నగరవాసులు ఈ ఏడాది విరివిగా రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో సహజంగానే రైళ్లకు డిమాండ్‌ పెరిగింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి సాధారణ రోజుల్లో  సుమారు 2.2 లక్షల మంది రాకపోకలు సాగిస్తే  వరుస సెలవులు, పండుగలు వంటి  ప్రత్యేక సందర్భాల్లో 2.5 లక్షల మందికిపైగా బయలుదేరుతున్నారు. ఏపీతో పాటు ఉత్తరాది రైళ్లకు సైతం డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి ప్రతి రోజు  85కుపైగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. మరో 100 ప్యాసింజర్‌ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ  వెయిటింగ్‌ లిస్ట్‌ మాత్రం తగ్గకపోవడం గమనార్హం.  

ప్రయాణం కష్టమే... 
సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో  జనవరి  వరకు అన్ని బెర్తులు బుక్‌ అయ్యాయి. థర్డ్‌ ఏసీలో బుకింగ్‌కు అవకాశం కూడా లేకుండా రిగ్రేట్‌ దర్శనమిస్తోంది. ఈస్ట్‌కోస్ట్, విశాఖ, గోదావరి, కోణార్క్, తదితర అన్ని రైళ్లలోనూ వెయిటింగ్‌ లిస్ట్‌ 150పైనే కనిపించడం గమనార్హం. ఉత్తరాది వైపు వెళ్లే దానాపూర్, పట్నా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోనూ నిరీక్షణ జాబితా వందల్లోకి చేరింది.

ఇదీ చదవండి: మునుగోడు.. 10 వేలకు పైగా ఓటరు దరఖాస్తుల తిరస్కరణ

మరిన్ని వార్తలు