హైదరాబాద్‌కు మరో కలికితురాయి

10 Nov, 2020 11:54 IST|Sakshi

దక్షిణ భారతదేశంలోనే మొదటిది

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర చరిత్రలో మరో కలికితురాయి చేరింది. చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ మంగళవారం ప్రారంభమయింది. దక్షిణ భారతదేశంలోనే చెత్తనుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న తొలి ప్లాంట్‌ ఇదే. జవహర్‌నగర్‌లోని ఈ ప్లాంట్‌ మొదటి దశ పనులు ప్రయోగాత్మకంగా ఇప్పటికే ప్రారంభం కాగా, మునిసిపల్‌ మంత్రి  కె.తారకరామారావు లాంఛనంగా నేడు ప్రారంభోత్సవం చేశారు. కార్మిక శాఖ మంత్రి చామకర మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్లాంట్‌లోని రెండు బాయిలర్లకు గాను ప్రస్తుతం ఒకదాని ద్వారా రోజుకు 10 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. ఇంటిగ్రేటెడ్‌ మునిసిపల్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఎంఎస్‌డబ్లు్యఎం) ప్రాజెక్ట్‌గా వ్యవహరిస్తున్న దీని ద్వారా రోజుకు 1000 నుంచి 1200 మెట్రిక్‌టన్నుల ఆర్డీఎఫ్‌ చెత్తతో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తారు. మలిదశలో మరో 28.2 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి కూడా చర్యలు ప్రారంభమయ్యాయి. రెండు దశలు పూర్తయితే జవహర్‌నగర్‌కు తరలిస్తున్న చెత్తనుంచి 48 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుంది. ఈ ప్లాంట్‌లో పర్యావరణహిత థర్మల్‌ కంబషన్‌ టెక్నాలజీతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇలాంటివి ఢిల్లీ, జబల్‌పూర్‌లలో మాత్రమే ఉన్నాయి. ఈ ప్లాంట్‌ వల్ల చెత్త నుంచి విద్యుత్‌తో చెత్త సమస్యకు పరిష్కారంతోపాటు పరిసరాల్లోని ప్రజలకు కాలుష్యం తగ్గుతుంది. చెత్త నుంచి ఆదాయం లభిస్తుంది. ఇప్పటి వరకు 1.34 కోట్ల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగింది. రోజుకు సగటున 2.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి జరుగుతోంది.  

చదవండి: ‘చెత్త’ నుంచి వెలుగులు..

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు