కరోనాతో భర్త మృతి.. భార్యకు పాజిటివ్‌.. తీవ్ర వేదనతో..

28 Apr, 2021 13:26 IST|Sakshi

చిలకలగూడ: ఆనంద కాపురంలో కరోనా విషాదాన్ని నింపింది. వారం రోజుల వ్యవధిలో దంపతులను బలిగొంది. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది. హృదయ విదారకమైన ఈ ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలోని వారాసిగూడలో జరిగింది.

మృతురాలి సోదరుడు అరవింద్, చిలకలగూడ సీఐ నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ వారాసిగూడలోని బజరంగ్‌ అపార్ట్‌మెంట్‌లో నివస్తున్న విశ్వనాథ లక్ష్మీనారాయణ (46) బీఎస్‌ఎన్‌ఎల్‌లో జూనియర్‌ టెలికాం ఆఫీసర్‌ (జేటీఓ)గా విధులు నిర్వర్తించేవారు. ఆయనకు భార్య రూపాదేవి (37), కుమారుడు కార్తీక్‌ (13), కుమార్తె శృతి (11) ఉన్నారు. స్వల్ప అస్వస్థతకు గురైన లక్ష్మీనారాయణకు వైద్యపరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడటంతో ఈ నెల 20న గాంధీ ఆస్పత్రిలో అడ్మిటయ్యారు. చికిత్స పొందుతూ ఆయన అదే రోజు మృతి చెందారు. 

భర్త మృతితో తీవ్ర మానసిక వేదన.. 
భర్త మరణవార్తతో రూపాదేవి తీవ్రంగా కలత చెందారు. ఆమెకు స్వల్పంగా జ్వరం రావడంతో ఈ నెల 25న టెస్ట్‌ చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో మరింత మానసిక వేదనకు గురయ్యారు. మంగళవారం ఆమె సోదరుడు అరవింద్‌ సోదరి ఇంటికి వచ్చి గది తలుపులు ఎంత కొట్టినా తెరవలేదు. తలుపులు బద్ధలు కొట్టి చూడగా రూపాదేవి సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని విగతజీవిగా కనిపించింది. తీవ్రమైన మానసిక వేదనతోనే తన సోదరి ఆత్మహత్యకు పాల్పడినట్లు సోదరుడు అరవింద్‌ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో వారాసిగూడలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

( చదవండి: కరోనా విషాదం: టెస్టు ఫలితం రాకముందే.. )   

మరిన్ని వార్తలు