-

Texas Shooting: తల్లి దండ్రులతో అవే చివరి మాటలు.. అయ్యో ఐశ్వర్య! పుట్టిన రోజు చేసుకోకుండానే

10 May, 2023 08:45 IST|Sakshi

నల్గొండ: మరో పది రోజుల్లో పుట్టిన రోజు చేసుకోవాల్సిన ఐశ్వర్యను అంతలోనే మృత్యువు కబలించింది. పుట్టిన రోజు వేడుక సన్నాహాల్లో భాగంగా షాపింగ్‌కు వెళ్లిన ఐశ్వర్య దుండగుడి తూటాలకు బలికావడం ఆమె కుటుంబ సభ్యులను కలిచివేసింది. ఐశ్వర్య ఈ నెల 18న పుట్టిన రోజు వేడుకలను స్నేహితుల నడుమ జరుపుకోవాలని భావించింది.

అమెరికాలోని టెక్సాస్‌ లోని ఎలెన్‌ సూపర్‌ మార్కెట్‌కు షాపింగ్‌ కోసం వెళ్లగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. చలాకీగా, సరదాగా ఉండే ఐశ్వర్య ఇక లేదని తెలుసుకున్న బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఆమె చదువు పూర్తి కాగానే అక్కడే ఫర్‌ఫెక్ట్‌ జనరల్‌ కాంటాక్టర్స్‌ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తోంది. 

ఇంకో నెల రోజుల్లో అదే కంపెనీకి సీఈవోగా నియమించేందుకు కంపెనీ ప్రతినిధులు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు.  ఉద్యోగోన్నతి పొందకుండానే ఆమె కానరాని లోకాలకు వెళ్లిపో యింది. ఆమెకు వివాహం చేసేందుకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 3:40 గంటలకు తల్లిదండ్రులు తాటికొండ నర్సిరెడ్డి–అరుణతో తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా షాపింగ్‌కు వెళ్తున్న విషయాన్ని ఫోన్‌ చేసి చెప్పింది. తల్లి దండ్రులతో అవే చివరి మాటలు. కాగా, ఐశ్వర్య భౌతికకాయం బుధవారం రాత్రికి హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
ఎమ్మెల్యేల పరామర్శ

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో దుండుగల తూటాలకు బలైన నేరేడుచర్ల మున్సిపాలిటీలోని పాత నేరేడుచర్లకు చెందిన ఐశ్వర్య కుటుంబ సభ్యులను హైదరాబాద్‌లోని వారి నివాసంలో మంగళవారం హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ పరామర్శించారు. ఐశ్వర్య భౌతికకాయాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. 

మరిన్ని వార్తలు