యాదాద్రికి  ఎంఎంటీఎస్‌ ఏదీ?

20 Sep, 2020 07:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సువర్ణ యాదాద్రి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. ఆధ్యాత్మిక  నగరంగా, అందమైన, ఆహ్లాదభరితమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా పనులు కొనసాగిస్తోంది. కానీ ఇక్కడికి రైల్వే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే 
ప్రతిష్టాత్మకమైన ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టులో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడంలేదు. యాదాద్రి పునర్మిర్మాణ పనులను ప్రారంభించడానికి ముందే ప్రభుత్వం ఈ మార్గంలో రైల్వే సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌ నుంచి వెళ్లే భక్తులు కోసం ఎంఎంటీఎస్‌ రైల్వే నెట్‌వర్క్‌ను యాదాద్రి సమీపంలోని రాయగిరి వరకు విస్తరించాలని ప్రభుత్వం అప్పట్లో ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రణాళికలను సైతం రూపొందించింది. కానీ నాలుగేళ్లుగా యాదాద్రి ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టు కాగితాల్లో ఉండిపోయింది.

టెండర్లకే పరిమితం.. 
యాదాద్రికి రోడ్డు రవాణా మార్గంతో పాటు రైల్వే సదుపాయం కూడా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతో రైల్వేబోర్డు అప్పటికప్పుడు సర్వేలు పూర్తి చేసి ప్రాజెక్టు అంచనాలను రూపొందించింది. ప్రస్తుతం ఎంఎంటీఎస్‌ రెండోదశలో భాగంగా ఘట్కేసర్‌ వరకు పనులు పూర్తి చేశారు. ఇక్కడి నుంచి నుంచి రాయగిరి 33 కిలోమీటర్ల మార్గాన్ని డబ్లింగ్‌ చేసి విద్యుదీకరించేందుకు ఎంఎంటీఎస్‌ రెండో దశలోనే భాగంగా  రూ.330 కోట్ల వరకు అంచనాలు వేశారు.  

  • 2016లో ఈ  ప్రతిపాదనలు సిద్దం చేసినప్పటికీ 2018 వరకు ఎలాంటి పురోగతి కనిపించలేదు. అప్పటికే ప్రాజెక్టు వ్యయం రూ.414 కోట్లకు చేరుకుంది. ఇదే ఏడాది  దక్షిణమధ్య టెండర్లను ఆహ్వానించింది. కొన్ని నిర్మాణ సంస్థలు ముందుకు వచ్చాయి. 
  • భూమి, ఇతర వనరులతో పాటు, ప్రాజెక్టు వ్యయంలో 59 శాతం రాష్ట్రం ఇవ్వాల్సి ఉంది. మిగతా 41 శాతాన్ని రైల్వే శాఖ భరిస్తుంది.  
  • పెరిగిన అంచనా వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వ  సమ్మతి కోసం దక్షిణమధ్య రైల్వే ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ 2019 వరకూ సమ్మతి లభించకపోవడంతో టెండర్లు రద్దయ్యాయి. 
  • ఈ ఏడాది ప్రభుత్వం నుంచి సమ్మతి లభించినప్పటికీ ద.మ రైల్వే ఆచితూచి వ్యవహరిస్తోంది. మరోసారి ఏ ప్రాతిపదికపై టెండర్లను ఆహ్వానించాలనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం ఇప్పటి వరకు రూ.50 కోట్లు కేటాయించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తాన్ని అందజేస్తే ముందుకు వెళ్లవచ్చని అధికారులు భావిస్తున్నారు.   

 
అందుబాటులోకి వస్తే..  

  • నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్, మౌలాలీ, చర్లపల్లి, ఘట్కేసర్‌ మీదుగా నేరుగా  రాయగిరి వరకు వెళ్లవచ్చు.  
  • ప్రయాణికులు ఇప్పుడు చెల్లిస్తున్న రవాణా చార్జీలు సైతం సగానికి పైగా తగ్గుతాయి. నగరంలో ప్రస్తుతం ఎంఎంటీఎస్‌ చార్జీలు కనిష్టంగా రూ.5 నుంచి  రూ.15 వరకు ఉన్నాయి. భవిష్యత్తులో చార్జీలు పెరిగే అవకాశం ఉన్నట్లు భావించినా రూ.25 నుంచి రూ.30 లోపే రాయగిరి వరకు చేరుకోవచ్చు.  
  • అక్కడి నుంచి మరో 5 కి.మీ రోడ్డు మార్గంలో వెళ్లాల్సిఉంటుంది. ఈ రూట్‌లో  రైల్వే సదుపాయాలు విస్తరించడం వల్ల  రియల్‌ఎస్టేట్‌ రంగంతో పాటు వ్యాపార కార్యకలాపాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వార్తలు