మోదీ రాక.. ట్విట్టర్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ కాక

6 Feb, 2022 01:31 IST|Sakshi
తెలంగాణపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ ట్యాంక్‌బండ్‌పై భారీ బ్యానర్‌ను ప్రదర్శిస్తున్న యువకులు 

రాష్ట్రం పట్ల కేంద్రానిది నిర్లక్ష్య వైఖరంటూ టీఆర్‌ఎస్‌ నిరసన 

ట్విట్టర్‌లో ‘ఈక్వాలిటీ ఫర్‌ తెలంగాణ’ట్రెండింగ్‌  

‘షేమ్‌ ఆన్‌ యూ కేసీఆర్‌’తో బీజేపీ ప్రతి దాడి 

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో శనివారం ట్విట్టర్‌ వేదికగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య వార్‌ నడిచింది. తొలు త టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు విమర్శలు మొదలుపెట్టగా ప్రతిగా బీజేపీ తరఫున ప్రతి విమర్శలను కొనసాగించారు. ఈక్వాలిటీ ఫర్‌ తెలంగాణ హ్యాష్‌ ట్యాగ్‌తో టీఆర్‌ఎస్‌ నేతలు.. షేమ్‌ ఆన్‌ యూ కేసీఆర్‌ హ్యాష్‌ట్యాగ్‌తో బీజేపీ నేతలు వేడి పుట్టించారు.  

తెలంగాణపై కేంద్రం పక్షపాత ధోరణి: టీఆర్‌ఎస్‌ 
రాష్ట్రం పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని, నిధుల విడుదలలో పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు ట్విట్టర్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో నిరసన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ట్విట్టర్‌ వేదికగా కేంద్రం వైఖరిని ప్రశ్నించారు. 20 వేలకు పైగా ట్వీట్లతో ‘ఈక్వాలిటీ ఫర్‌ తెలంగాణ’ హ్యాష్‌ ట్యాగ్‌ ట్విట్టర్‌లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ట్రెండ్‌ అయింది.

కర్ణాటకలోని అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వట్లేదని నేతలు ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి మంత్రులు కేంద్రానికి పంపిన లేఖలపై ఎందుకు స్పందించట్లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కేంద్రాన్ని నిలదీశారు. రాష్ట్ర వ్యవసాయ, పారిశ్రామిక రంగాలపై కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని మంత్రి నిరంజన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించకపోవడంపై మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రశ్నించారు. అద్భుతమైన కార్యక్రమాలతో పురోగమిస్తున్న రాష్ట్రాన్ని కేంద్రం ఎందుకు నిలువరించే ప్రయత్నం చేస్తోందని ఎంపీ రంజిత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. రాష్ట్రంపై కేంద్రవివక్షను ఎండగట్టేలా వివిధ అంశాలతో ట్యాంక్‌బండ్‌పై భారీ ఫ్లెక్సీని పలువురు యువకులు ప్రదర్శించారు.  

ఎదుర్కోలేక ముఖం చాటేశారా?: బీజేపీ 
టీఆర్‌ఎస్‌ ట్వీట్లకు బీజేపీ దీటుగా బదులిచ్చింది. ప్రధానికి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్‌ రాకపోవడంపై విమర్శలు గుప్పించింది. ప్రధాని మోదీ ని ముఖాముఖి ఎదుర్కోలేక కేసీఆర్‌ ముఖం చాటేశారా?.. జ్వరం, స్వల్ప అస్వస్థత అంటూ ప్రధాని ప్రొటోకాల్‌ను కాదంటారా అని నేతలు ప్రశ్నిం చారు. కుంటిసాకులతో ప్రధానికి స్వాగతం పలకకపోవడం రాష్ట్రానికే అవమానం, నిజాంలాగా అహంకారంతో వ్యవహరిస్తే ఎలాగని నిలదీశారు. షేమ్‌ ఆన్‌ యూ కేసీఆర్‌ హాష్‌ ట్యాగ్‌తో సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ తీరుపై వరుస ట్వీట్లతో విమర్శల వర్షం కురిపించారు.  

మరిన్ని వార్తలు