మౌంట్‌ ‘సందేశ్‌’

17 Jan, 2021 11:39 IST|Sakshi

ప్రపంచరికార్డు సృష్టించిన నగర యువకుడు

10 నెలల్లో నాలుగు ఖండాల్లో 4 పర్వతాల అధిరోహణ

మరిన్ని విజయాలపై కన్నేసిన తుకారాం

సాక్షి, హైదరాబాద్‌: దేశంకాని దేశాలకు అతడు సందేశాలను తీసుకెళ్తున్నాడు. వాటిని పర్వతమంత ఎత్తున సమున్నతంగా నిలుపుతున్నాడు. ఈ ఫీట్‌ సాధించడానికి పర్వతారోహణపర్వం కొనసాగిస్తున్నాడు తుకారాం. అత్యంత పిన్నవయసులోనే అత్యున్నత రికార్డులు సృష్టిస్తున్నాడు. 7 ఖండాల్లోని 7 ఎత్తయిన పర్వతాల్లో నాలుగింటిని 10 నెలల్లో అధిరోహించి వరల్డ్‌ రికార్డు స్థాపించాడు. మరిన్ని శిఖర సమాన విజయాలను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు ఈ నగర యువకుడు. దక్షిణాది నుంచి మౌంట్‌ ఎవరెస్ట్‌ని అధిరోహించినవారిలో పిన్నవయస్కుడు తుకారాం. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కళాశాలలో పొలిటికల్‌ సైన్స్‌లో పోస్టుగాడ్యుయేట్‌ చేస్తున్న తుకారాంది వ్యవసాయ కుటుంబం. తాజాగా కేంద్రమంత్రిని కలసి అభినందనలు అందుకున్న తుకారాం ‘సాక్షి’తో తన మనోభావాలు పంచుకున్నాడిలా... ఆయన మాటల్లోనే..

ధైర్యే సాహసే విజయం... 
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కెళ్లపల్లి తండా స్వస్థలం. ట్రైబల్‌ వెల్ఫే ర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో 10 వతరగతి వరకూ చదువుకున్నా. చిన్నప్పటి నుంచి సాహసోపేతమైన ఆటలంటే నాకు ఇష్టం. ఏదో సాధించాలి, ఏదో చేయాలనే కోరిక ఉండేది. కష్టం గురించి ఆలోచించేవాడిని కాదు. ఒంటికాలు మీద కబడ్డీ ఆడే లంగ్డీ ఆటలో జాతీయస్థాయి ప్లేయర్‌ని. కర్రతో జిమ్నాస్టిక్స్‌ మల్లకంబ్‌ కూడా జాతీయ స్థాయిలో ఆడాను. ఇవన్నీ స్కూల్‌ స్థాయిలోనే చేశా. కాలేజీలో చదువుతుండగా ఎన్‌సీసీ శిక్షణలో భాగంగా ఉత్తర కాశీలో మౌంట్‌ ఇంజనీరింగ్‌ చేస్తూ 3 బంగారు పతకాలు సాధించాను. అప్పటి నుంచి పర్వతారోహణ మీదే దృష్టి పెట్టాను. 

సామాజిక ప్రయోజనం ఉండాలని...
ప్రతి సాహసం నాకు లక్ష్యసిద్ధిగా మిగిలిపోకూడదని, దానికి సామాజిక ప్రయోజనం కూడా ఉండాలనే ఆలోచనతో విభిన్న సందేశాలను, సందర్భాలను జో డిస్తూ పర్వతారోహణను మరింత అర్థవంతంగా మార్చాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భాన్ని సెలబ్రేట్‌ చేస్తూ హిమాచల్‌ప్రదేశ్‌లోని నర్బు అనే పర్వతం అధిరోహించాక, తెలంగాణ రాష్ట్ర పతాకాన్ని అక్కడ ఎగరవేశాను. బతుకమ్మలను ప్రతిష్టించి ఇక్కడి సంప్రదాయాలను తెలియజెప్పాను. రోజువారీగా ఖాదీ వాడాలని పిలిపిస్తూ గంగోత్రిలోని మౌంట్‌ రుడుగారియా పర్వతారోహణను పూర్తి చేశాను. దేశభక్తిని చాటి చెబుతూ లడ్డాఖ్‌లోని మౌంట్‌ స్టాకన్‌గిరిపైకి 19 అడుగుల జాతీయ పతాకాన్ని తీసుకెళ్లి ఎగరవేశాను. పంచభూతాలను కాపాడుకోవాలంటూ సందేశమిస్తూ అత్యంత క్లిష్టమైన ఎవరెస్ట్‌ పర్వతాన్ని అధిరోహించాను. 

మరికొన్ని సందేశాలివీ... 
► ‘హెల్మెట్‌ మన కోసం కాదు.. మన కుటుంబం కోసం’అనే సందేశంతో ఆఫ్రికాలోని కిలిమంజారో ఎక్కాను. 
► డ్రగ్స్‌ నిషేధించాలంటూ రష్యాలోని ఎల్బ్రస్‌ పర్వతారోహణ పూర్తి చేశాను.  
► దేశ సర్వసత్తాక సార్వభౌమత్వానికి సూచికగా జనవరి 26న సౌత్‌ అమెరికాలోని మౌంట్‌ అకాంజాగువా అధిరోహించాను.  
► ఆస్ట్రేలియా దేశంలో కార్చిచ్చు కారణంగా ఏర్పడుతున్న బుష్‌ ఫైర్స్‌ తదనంతర సమస్యలు, బాధితుల కోసం ఆస్ట్రేలియాలోని కొజియాస్కో పర్వతాన్ని ఎక్కాను. దీనిని ఆస్ట్రేలియా మంత్రి అభినందించారు. 

ప్రోత్సాహకాలూ.. పురస్కారాలూ... 
కేవలం 10 నెలల్లో 4 విభిన్న ఖండాలలో శిఖరాలను అధిరోహించిన పిన్న వయస్కుడిగా ప్రపంచరికార్డు స్థాపించాను. రాష్ట్రపతి చేతుల మీదుగా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, తెలంగాణలో బెస్ట్‌ స్పోర్ట్స్‌మెన్‌షిప్‌ అవార్డు 2 సార్లు అందుకున్నా. జమ్మూ, కశ్మీర్‌ ప్రభుత్వం నుంచి తొలి దక్షిణాది బెస్ట్‌ ఇన్‌ టెక్నిక్‌ అవార్డ్‌ అందుకున్నా. పర్వతారోహణ అనేది ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చేసేది మాత్రమే కాదు అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నది కూడా. నాకు పురస్కారాలు మాత్రమే కాకుండా ఆర్థికంగా పలువురు స్పాన్సరర్లు లభించారు. ప్రస్తుతం చినజీయర్‌స్వామిసహా మరికొందరు నన్ను స్పాన్సర్‌ చేస్తున్నారు. ఇక నార్త్‌ అమెరికాలోని మౌంట్‌ డెనాలీ, అంటార్కిటికాలోని మౌంట్‌ విమ్సన్‌లు అధిరోహించాలనే లక్ష్యాలు మిగిలాయి. పర్వతారోహణవైపు యువతను బాగా ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను. అందుకు ప్రభుత్వ సహకారం కూడా కావాలి.

మరిన్ని వార్తలు