హైదరాబాదీ రికార్డు.. ఏడాదిలో రూ.6 లక్షల ఇడ్లీలు!  

31 Mar, 2023 08:16 IST|Sakshi

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌తో హైదరాబాదీ రికార్డు 

దేశవ్యాప్తంగా 3.3 కోట్ల ప్లేట్లు పంపిణీ చేసిన స్విగ్గీ 

బ్రేక్‌ఫాస్ట్‌ ఐటమ్స్‌లో మసాలా దోశ తర్వాత ఇడ్లీయే.. 

ఏడాదిలో రూ.6 లక్షల ఇడ్లీలు!  

సాక్షి, హైదరాబాద్‌: అల్పాహారాల్లో ఇడ్లీకున్న క్రేజే వేరు. ఆ క్రేజే ఓ రికార్డును సృష్టించింది. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి ఈ రికార్డు సృష్టించినట్లు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. ఆయన ఇడ్లీపై తన ఇష్టాన్ని ఓ రేంజ్‌లో చూపించాడు. గత ఏడాది కాలంలో రూ.6 లక్షలు కేవలం ఇడ్లీల కోసమే ఖర్చు చేశాడు. 

తన కోసం, స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం.. ఏడాది మొత్తంలో 8,428 ప్లేట్ల ఇడ్లీలను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేశాడు. తాను ప్రయాణించిన వివిధ ప్రదేశాల్లో కూడా ఆయన ఇడ్లీ జపమే చేసినట్లు స్విగ్గీ తన నివేదికలో వెల్లడించింది. ఇడ్లీ క్రేజ్‌కు సంబంధించిన ఇలాంటి విశేషాలెన్నో స్విగ్గీ వివరించింది. ఇటీవల ప్రపంచ ఇడ్లీ దినోత్సవం పురస్కరించుకుని ఇడ్లీ ఆర్డర్లపై నిర్వహించిన అధ్యయనంతో ఓ నివేదికను సంస్థ విడుదల చేసింది. 

చాలాచోట్ల డిన్నర్‌గా కూడా.. 
గత 12 నెలల్లో దేశవ్యాప్తంగా 3.3 కోట్ల ప్లేట్లను పంపిణీ చేసినట్టు నివేదిక తెలిపింది. వినియోగదారుల్లో ఈ వంటకానికి ఇప్పటికీ ఉన్న విపరీతమైన క్రేజ్‌కు ఇది సూచికగా పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. అత్యధిక ఇడ్లీలను ఆర్డర్‌ చేసిన మొదటి మూడు నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఉన్నాయి. కొల్‌కొతా, కొచ్చి, ముంబై, కోయంబత్తూర్, పుణే, వైజాగ్, ఢిల్లీ నగరాలు ఆ తర్వాత ఉన్నాయి. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోయంబత్తూర్, ముంబై వాసులు డిన్నర్‌గానూ ఇడ్లీని ఇష్టపడుతున్నారని నివేదిక వెల్లడించింది. 

కారం, నెయ్యి ఇడ్లీకి హైదరాబాద్‌ జై 
బెంగళూరు వాసులు రవ్వ ఇడ్లీలు, చెన్నై వాసులు నెయ్యి, పొడి ఇడ్లీలు ఇష్టపడుతుండగా.. హైదరాబాదీలు కారం పొడి, నెయ్యితో కూడిన ఇడ్లీని ఇష్టపడుతున్నారని తేలింది. ఇక ముంబయి వాసులు ఇడ్లీ..వడ కాంబినేషన్‌కు జై కొడుతున్నారు. అయితే అల్పాహారాల ఆర్డర్స్‌లో మసాలా దోశ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలవగా ఇడ్లీ రెండోస్థానంలో ఉంది.    

మరిన్ని వార్తలు