Hydrogel Tablet: ట్యాబ్లెట్‌తో బ్యాక్టీరియా ఖతం.. నీరు ఫిల్టర్‌

10 Oct, 2021 04:46 IST|Sakshi

ఫిల్టర్‌ లేకుండానే స్వచ్ఛమైన నీళ్లు

బయటికి వెళ్లినప్పుడు మంచి నీళ్లు కావాలంటే.. వెంటనే ఓ బాటిల్‌ కొంటారు. మరి బాటిల్స్‌ అందుబాటులో లేని ప్రాంతాలకు వెళ్తే? కంటి ముందు నీటి ప్రవాహాలున్నా... తాగడానికి అనువుగా లేకపోతే? మనిషికి ఎంత కష్టం కదా! ఇక ఆ బాధ అక్కర్లేదు. మీరు అడవుల్లో ఉన్నా, గుట్టలపై ట్రెక్కింగ్‌ చేస్తున్నా... ముందు నీటి కాలువ ఉంటే చాలు. ఆ నీటిని ఫిల్టర్‌చేసే ట్యాబ్లెట్‌ వచ్చేసింది.

అదే హైడ్రోజెల్‌. కలుషితమైన నీటిని గంటలోపే స్వచ్ఛమైన తాగునీరుగా మార్చేస్తుంది. టెక్సాస్‌ యూనివర్సిటీకి చెందిన కెమికల్‌ ఇంజనీర్లు దీనిని కనిపెట్టారు. అక్కడి విద్యార్థి యోహాంగ్‌ గుయో సూర్యకాంతితో నీటిని శుద్ధి చేసే ప్రయోగం చేస్తుండగా అనుకోకుండా హైడ్రోజెల్‌ ఆలోచన వచ్చింది.  

నీటి కొరత తీరొచ్చు... 
ప్రపంచ జనాభాలో మూడోవంతు ప్రజానీకానికి స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదు. నీటిని తాగాలంటే మరగబెట్టడమో, శుద్ధీకరణో చేయాల్సిందే. ఆ రెండు పద్ధతులకు విద్యుత్‌ అవసరం. అంతేకాదు... అధిక సమయం, శ్రమ కూడా. కానీ ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అందుకు తగిన వనరులు లేవు. కానీ హైడ్రోజెల్‌ ఒక్క ట్యాబ్లెట్‌ ఉంటే... ఇవేవీ అక్కర్లేవు. హైడ్రోజెల్‌లో ఉన్న హైడ్రోజెన్‌ పెరాక్సై డ్‌... నీటిలోని బ్యాక్టీరియాను చంపేస్తుంది.

ఇందుకు విద్యుత్‌ అవసరం లేదు. ఇందులో ఎలాంటి హానికారకాలు లేవు. సూర్యకాంతితో నీరు ఆవిరయి అందులోని కాలుష్యాన్ని వేరు చేసినట్టుగానే... హైడ్రోజెల్‌ తనంతట తానే నీటిని శుద్ధి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాగునీటి కొరతను తీర్చడంలో హైడ్రోజెల్‌ గొప్పగా సహాయపడుతుందని టెక్సాస్‌ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ గుహియాయు తెలిపారు. 

మరిన్ని వార్తలు