హంగ్‌ అనలేదు.. రాహుల్‌గాంధీ చెప్పిందే నేనూ చెప్పా: కోమటిరెడ్డి

14 Feb, 2023 18:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పొత్తు కామెంట్లు.. తెలంగాణలో పోలిటికల్‌ హీట్‌ రాజేయగా.. ఆ ఎపిసోడ్‌ వెనువెంటనే అనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. కోమటిరెడ్డి చేసిన పొత్తు వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధిష్టానం గరంగరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీలోని చోటా మోటా నేతలు సైతం కోమటిరెడ్డిపై మండిపడుతున్నారు.  ఈ తరుణంలో..

రేపు(బుధవారం) ఉదయం తనను కలవాలని కోమటిరెడ్డికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే నుంచి పిలుపు వచ్చినట్లు కథనాలు వచ్చాయి. ఈ లోపే వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఇవాళ (మంగళవారం) సాయంత్రమే ఠాక్రేతో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ దగ్గర ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 

నా వ్యాఖ్యలు వక్రీకరిస్తున్నారు.  తెలంగాణలో హంగ్‌ వస్తుందని నేను అనలేదు. బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందని కూడా నేను అనలేదు. నా వ్యాఖ్యలు అర్థం అయ్యే వాళ్లకు అర్థం అవుతాయి. మాకు ఎవరితో పొత్తు ఉండదు. రాహుల్‌ గాంధీ చెప్పిందే నేను చెప్పా. కాంగ్రెస్‌కు ఎవరితో పొత్తు ఉండదని. ఇవాళ చిన్న చిన్న నాయకులు కూడా నన్ను తిట్టారు. బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారు అని పేర్కొన్నారు కోమటిరెడ్డి. 

అనూహ్యం..
ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే తో ఎంపీ కోమటిరెడ్డి భేటీ అయ్యారు. బుధవారం కంటే ముందుగానే ఈ భేటీ జరగడం గమనార్హం.  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లాంజ్‌లో వీళ్ల భేటీ జరిగనట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి తో పాటు ఏఐసీసీ కార్యదర్సులు నదీమ్ జావీద్ , బోసురాజు , హర్కర్ వేణుగోపాల్ కూడా హాజరు కాగా..  20 నిమిషాలుగా పైగా భేటీ కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన తన వ్యాఖ్యలపై ఠాక్రేకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

వెంకట్‌రెడ్డి ఏం మాట్లాడారో చూడలేదు
ఇక ఈ పరిణామంపై అంతకు ముందు మీడియాతో  కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఠాక్రే స్పందించారు. వెంకట్‌రెడ్డి ఏం మాట్లాడారో నేను చూడలేదు. ఏం మాట్లాడారో తెలుసుకున్నాక స్పందిస్తా.  పొత్తులపై రాహుల్‌ గాంధీ వరంగల్‌ సభలో చెప్పిందే మాకు ఫైనల్‌. బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని ఆయన తేల్చేశారు. ఇలాంటి తరుణంలో.. ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన మాకు అవసరం లేదు అని ఠాక్రే మీడియా ద్వారా స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు