వరంగల్ జిల్లాతో అవినాభావ సంబంధం ఉంది

11 Dec, 2020 16:06 IST|Sakshi

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

సాక్షి, వరంగల్‌ : వరంగల్‌ నగరాన్ని అభివృద్ధి చేయడానికి భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన తరువాత కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశానని, పార్లమెంట్‌లో ఆర్టికల్‌ 370 లాంటి ముఖ్యమైన బిల్లులు, కరోనా వైరస్‌ వల్ల వరంగల్‌కి రావడం ఆలస్యమైందని చెప్పారు. గురువారం హన్మకొండ సర్క్యూట్ గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వరంగల్ నగరంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో జరుగుతున్న పనులను పరిశీలించి, వాటిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించానన్నారు.

వరంగల్‌.. హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరం, చారిత్రక నగరం, రాజకీయ చైతన్యం ఉన్న నగరం, రజకారులను తరిమికొట్టిన చరిత్ర ఉన్న నగరమని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ దేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలు అవుతోంది కానీ, సీఎం కేసీఆర్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల తెలంగాణలో అమలు కావడం లేదని చెప్పారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు ఆరోగ్య భీమా రాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. వరంగల్ నగరానికి ప్రతి ఇంటికి మంచినీరు, భద్రకాళి చెరువు, వెయ్యిస్తంబాల దేవాలయం, నగరంలోని కూడళ్లు, ఎంజీఎం హాస్పిటల్ వద్ద మురుగు శుద్ధి కేంద్రం, లైబ్రరీల కోసం 5 కోట్ల రూపాయలు కేటాయించామని వెల్లడించారు. కాజిపేట దర్గా కోసం కోటి రూపాయాలతో అభివృద్ధి పనులు చేపడితే.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. దేశంలోనే మొదటిసారి జాతీయ రహదారి రోడ్లను సిమెంట్‌తో నిర్మాణం చేపట్టామని, అది అతిత్వరలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ప్రారంభిస్తామని చెప్పారు. ( దివ్యాంగ జవాన్లు సైబర్‌ వారియర్స్‌ )

మమునూరు ఎయిర్ పోర్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతతో పని చేస్తుందని అన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతగా వరంగల్‌ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లాతో తనకు 1996 నుండి అవినాభావ సంబంధం ఉందని, ఇక్కడ తనకు అణువణువు తెలుసునన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ వరద వచ్చినా 10 వేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో ఆదరాబాదరాగా ఎన్నికలు పెట్టి బీజేపీని బలహీన పరచడానికి చూశారని, కానీ.. టీఆర్ఎస్ బొక్కబోర్లా పడిందని అన్నారు. వరంగల్‌లో కూడా వరదలు వచ్చాయని, ఇక్కడ కూడా పదివేల రూపాయల వరద సాయం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు