పార్టీ మార్పుపై ఎల్‌.రమణ కీలక వ్యాఖ్యలు

15 Jun, 2021 05:08 IST|Sakshi

పార్టీ మారితే ముందే చెబుతా..

అందరితో చర్చించే నిర్ణయం తీసుకుంటా

సోషల్‌ మీడియాలో ప్రచారం అవాస్తవం

నేను ఏ పార్టీ, ఏ నాయకునితో చర్చించలేదు

టీటీడీపీ అధ్యక్షుడు రమణ

సాక్షి, జగిత్యాల: పార్టీ మారాలని తానెప్పుడూ అనుకోలేదని, ఏదైనా ఉంటే అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లాకేంద్రంలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇప్పటివరకు పార్టీ మారే విషయంలో ఎవరూ ఎటువంటి ప్రతిపాదనలు తీసుకురాలేదని చెప్పారు. తాను పార్టీ మారతానని ఎప్పుడూ చెప్పలేదన్నారు. సోషల్‌ మీడియాను నియంత్రించే పరిస్థితి లేకపోవడంతోనే రకరకాలుగా ప్రచారం జరుగుతోందని అన్నారు. ఇలాంటి చర్యలతో నిజాయితీ, నిబద్ధత ఉన్న వ్యక్తుల మనసు బాధపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ పదవులు, పైరవీలు, ప్రాపర్టీల కోసం ఆలోచించలేదన్నారు.

సాధారణ కార్యకర్తగా ఉన్న తనకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా అవకాశం ఇచ్చిందని చెప్పారు. 27 ఏళ్లుగా టీడీపీ కార్యకర్తల రెక్కలకష్టం మీద తాను ఎదిగానని, తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ, కార్యకర్తల మనోభావాలు తెలుసుకుని ముందుకుసాగుతానని స్పష్టం చేశారు. ఏ పార్టీలోకి వెళ్లినా, వెళ్లకపోయినా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేస్తానని స్పష్టంచేశారు. తాను పార్టీ మారదల్చుకుంటే ముందుగా మీడియా ద్వారానే వెల్లడిస్తానని పేర్కొన్నారు. కాగా, మారుతున్న రాజకీయాలను గమనిస్తున్నానని రమణ అన్నారు. ఈ మార్పులను ఎప్పటికప్పుడు తమ అధినేతకు తెలియజేస్తున్నట్లు వివరించారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిత్వం తనది కాదని, అలాగే ఇంకొకరి పదవులకు అడ్డుపడే మనస్తత్వం కాదని స్పష్టంచేశారు.

మరిన్ని వార్తలు