తొలి టీకా నేనే వేసుకుంటా : ఈటల

10 Jan, 2021 14:09 IST|Sakshi

వ్యాక్సిన్‌పై అనుమానాలు, అపోహలు తొలగించేందుకే..

సాక్షి, హైదరాబాద్‌ : కోవిడ్‌ టీకాపై అనుమానాలు, అపోహలను తొలగించి, ప్రజల్లో నమ్మకం పెంచేందుకు తానే తొలి టీకాను తీసుకుంటానని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. కరోనా కొత్త స్ట్రెయిన్‌తో భయం లేదని, బర్డ్‌ ఫ్లూతో ఇప్పటివరకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన స్పష్టం చేశారు. సామాజిక బాధ్యతలో భాగంగా మేఘా సంస్థ నిమ్స్‌ ఆస్పత్రిలో రూ.18 కోట్లతో నిర్మించిన ‘ఆంకాలజీ బ్లాక్‌’ను మంత్రి శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...కోవిడ్‌ వ్యాక్సిన్‌ వందశాతం సురక్షితమైందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రోజుకు పది లక్షల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. 

సామాజిక బాధ్యతలో ముందుంటాం 
సామాజిక బాధ్యతలో మేఘా సంస్థ ఎప్పుడూ ముందుటుంది. కార్పొరేట్‌ ఆస్పత్రికి దీటుగా నిమ్స్‌ క్యాన్సర్‌ వార్డును నిర్మించాం. ఇక్కడి ఆర్థోపెడిక్‌ విభాగంతో పాటు దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ ఆస్పత్రిని కూడా త్వరలో ఆధునీకరిస్తాం.  –పి.పి.రెడ్డి, మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ చైర్మన్‌ 

450 కోట్లతో అధునాతన భవనాలు
అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన ప్రతి రోగికి వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు నిమ్స్‌లో రూ.450 కోట్లతో అత్యాధునిక భవనాలు, మౌలిక వసతులు సమకూర్చనున్నట్లు ఈటల తెలిపారు. ప్రభుత్వం ప్రజా వైద్యానికి ఏటా రూ.7,500 కోట్లు ఖర్చు చేస్తే..అందులో ఆరోగ్యశ్రీ,, ఈహెచ్‌ఎస్‌ పథకాలకే ఏటా రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. పేద, మధ్య తరగతి వర్గాలకు పూర్తిగా ఉచిత వైద్యం అందించే స్థాయికి రాష్ట్రం ఎదగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌ మాట్లాడుతూ..కేన్సర్‌ రోగులకు నిమ్స్‌ ఆంకాలజీ బ్లాక్‌ ఓ వరమని, బయట ఆస్పత్రుల్లో రూ. 20 లక్షలు ఖర్చయ్యే వైద్యాన్ని నిమ్స్‌ కేవలం రూ. 2 లక్షలతోనే చేస్తుందని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో కేన్సర్‌ వార్డులను పునఃనిర్మించిన మేఘా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ డైరెక్టర్‌ పి. సుధారెడ్డి, ఆంకాలజీ విభాగా« ధిపతి డాక్టర్‌ సదాశివుడు, మెడికల్‌ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ నిమ్మ సత్యనారాయణ, డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌. కేవీ కృష్ణారెడ్డి, అసిస్టెంట్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మీభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు