ఇబ్రహీంపట్నం కు.ని. ఘటన.. నాలుగు కుటుంబాల్లో తీవ్ర విషాదం.. తల్లడిల్లిన పసిమొగ్గలు

1 Sep, 2022 13:42 IST|Sakshi

మౌలిక సదుపాయాల లేమి, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వెరసి అనేక మంది తల్లీపిల్లలకు తీరని కడుపుకోతను మిగుల్చుతోంది. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు పొందవచ్చని భావించి ఎంతో ఆశతో ఆస్పత్రులకు చేరుకుంటున్న గర్భిణులు, బాలింతలను మృత్యుపాశాలు వెంటాడుతున్నాయి. ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో కు.ని చికిత్సలు వికటించి రెండు రోజుల్లో నలుగురు తల్లులు మృత్యువాతపడటం యావత్‌ రాష్ట్రాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. రోగుల నిష్పత్తికి సరిపడా మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పట్టానట్టుగా వ్యవహరించడమే ఇందుకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

సాక్షి, ఇబ్రహీంపట్నం: కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ వికటించడంతో మృత్యువుతో పోరాడి ప్రాణాలొదిలిన అవుతపురం లావణ్య (22) అంత్యక్రియలు సీతారాంపేటలో ప్రశాంతంగా ముగిశాయి. లావణ్యకు ఇద్దరు కుమార్తెలు అక్షర (6), భావన (4) కుమారుడు యశ్వంత్‌ (ఏడు నెలలు) ఉన్నారు. చివరి చూపుల సందర్భంగా అత్తమామలు,, బంధువుల రోదనలతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. ఏమి జరిగిందో తెలియని పసిమొగ్గలను చూసి వారు కన్నీటి పర్యంతమయ్యారు. బరువెక్కిన హృదయంతో ఓదార్చారు.

అసలు ఏం జరిగిందో తెలియక పసిమొగ్గలు దీనంగా చూస్తుండటాన్ని అందరినీ కదిలించింది. తమ తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయిందని, ఇక తాము చూడ లేమని తెలియని ఆ చిన్నారులను చూసి చలించి పోయారు. భర్త లింగస్వామి ఓ రైతు వద్ద జీతం చేస్తూ అతని వ్యవసాయ పనులు చేస్తుంటాడు. సొంత ఇల్లు కూడలేని దీనస్థితి ఆ కుటుంబానిది. ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.  

తలకొరివి పెట్టిన మామ  
కట్టుకున్న భర్త, కన్న కుమారుడు ఉన్నప్పటికీ అర్ధంతరంగా తనువు చాలించడంతో లావణ్య మామ యాదయ్య అంత్యక్రియల ప్రక్రియ నిర్వహించారు. ఏడు నెలల బాబు చేతిని ముట్టించి దహన సంస్కారాల కార్యక్రమంలో మామ యాదయ్య ముందు నడిచాడు. ఏ జన్మలో రుణపడి ఉన్నానో నంటూ కో డలి మృతదేహం చుట్టూ తిరిగి దహన సంస్కా రాలు చేయడం అక్కడున్న వారిని కదిలించింది.  


సుష్మ కూతురు శాన్వి, కుమారుడు శ్రేయన్‌ను ఓదార్చుతున్న జెడ్పీటీసీ సభ్యురాలు నిత్యారెడ్డి 

లింగంపల్లిలో సుష్మ అంత్యక్రియలు 
మంచాల: కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ వికటించి మృతి చెందిన మైలారం సుష్మ స్వగ్రామం లింగంపల్లిలో మంగళవారం విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె అంత్యక్రియలకు వివిధ గ్రామాల నుంచి ప్రజా ప్రతినిధులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. సుష్మ కూతురు శాన్వి, కుమారుడు శ్రేయన్‌ అమ్మ కావాలని ఏడవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టిస్తోంది. మంచాల జెడ్పీటీసీ మర్రి నిత్యారెడ్డి.. సుష్మ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం సుష్మ భర్త ఈశ్వర్, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కొంత ఆర్ధిక సాయం చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యమే కారణమని జెడ్పీటీసీ ఆరోపించారు. ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆమె వెంట సర్పంచ్‌ వినోద మూర్తి, ఎంపీటీసీ జయనందం తదితరులు పాల్గొన్నారు. 


మౌనిక పిల్లలు

పిల్లల ఆమయాక చూపులు
అదే విధంగా మాడ్గుల మండలం కొలుకుల పల్లి పంజాయతీ పరిధిలోని రాజీవ్‌ తండాకు చెందిన మౌనికకు నాలుగేళ్ల కిందట శ్రీనివాస్‌ నాయక్‌తో పెళ్లి జరిగింది. వీరికి మాను శ్రీ(3), గౌతమ్‌(15 నెలలు) ఇద్దరు పిల్లలు. శ్రీనివాస్‌ నాయక్‌ వ్యవసాయం, కూలీ పనులు చేస్తుంటాడు. మౌనిక భర్తతో కలిసి పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. అయితే మౌనిక  తల్లి తిరిగిరాదని లోకాలకు వెళ్లిందని తెలియక పిల్లలు అమాయక చూపులు చూస్తున్నారు. భర్త శ్రీనివాస్‌ నాయక్‌ సైతం కన్నీటి పర్యంతమవుతున్నాడు.


మమత, ఇద్దరు పిల్లలు

భర్తకు చేదోడువాదోడు
ఇక ఇదే మండలం నర్సాయపల్లికి చెందిన మమత, మల్లేష్‌ గౌడ్‌లకు అయిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్‌. వర్షిత్‌(4), విహాన్‌(2). పేద కుటుంబానికి చెందిన మల్లేష్‌ గౌడ్‌ వ్యవసాయం చేసుకుంటూ డీసీఎం వ్యాన్‌ నడుపుకుంటున్నాడు. వ్యవసాయంలో భర్తకు చేదుడో వాదోడుగా ఉండే మమత ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో పిల్లలు,  భర్త భోరున విలపిస్తున్నారు.

మరిన్ని వార్తలు