ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత 

28 Jul, 2020 03:51 IST|Sakshi

ఇబ్రహీంపట్నం: రంగారెడి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత మస్కు నర్సింహ(52) అనారోగ్యంతో మృతి చెందారు. ఘగర్, బీపీ లెవల్స్‌ పెరగడంతో పది రోజుల క్రితం ఆయన నిమ్స్‌లో చేరారు. గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతోపాటు ఉపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్‌కు గురికావడంతో నర్సింహ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ ఆదివారం అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. యాచారం మండలం చింతుల్ల గ్రామానికి చెందిన నర్సింహకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

విద్యార్థి దశ నుంచి రాజకీయల్లో ఆయన చురుకైన పాత్ర పోషించారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. కాగా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సీతారాములు నిమ్స్‌ వద్ద నర్సింహ భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి నివాళులు అర్పించారు.  నర్సింహ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రజాసేవలో నిమగ్నమైన దళిత నేత చిన్నవయసులోనే మరణించడం బాధాకరమని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విచారం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు