ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు

26 Sep, 2020 09:37 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల‌: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఐడీ (గుర్తింపు కార్డులు) కార్డులు ఇచ్చేందుకు చర్యలు వేగవంతం చేశారు. అందులో భాగంగా ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డులను ఇచ్చేందుకు రాష్ట్ర సమగ్ర శిక్ష కసరత్తు చేస్తోంది. కార్పొరేట్‌ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల మాదిరిగానే ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు అందనున్నాయి. ఈప్రక్రియలో భాగంగా ఉపాధ్యాయులు సమగ్ర వివరాలను నివేదిస్తున్నారు. జిల్లాలోని 732 పాఠశాలల్లో 2763 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో 2646 మంది ఉపాధ్యాయులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయగా 117 మంది వివరాలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది.

వివరాల నమోదుకు అవకాశం
2019–20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులు సమాచారం సేకరించగా డేటాఎంట్రీ ఆపరేటర్లు ఎంఐఎస్‌ కోఆర్డినేటర్ల ద్వారా యూడైస్‌ (యునిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌) నమూనాల్లో పొందుపరిచారు. ఉపాధ్యాయుల బ్లడ్‌గ్రూపు, నివాస సమాచారం జతచేయడంతో పాటు వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏమైనా తేడాలు ఉంటే వెబ్‌సైట్‌ ద్వారా వివరాలు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటికే ఉపాధ్యాయులు వెబ్‌సైట్‌లో నమోదు పూర్తి చేయాల్సి ఉన్నా అలసత్వం చూపుతున్నారని తెలుస్తోంది. ఉపాధ్యాయుల వివరాల నమోదులో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే జిల్లా చివరి స్థానంలో నిలిచినట్లు సమాచారం. కొన్ని జిల్లాలు వందశాతం నమోదు కాగా మంచిర్యాల జిల్లాలో 92.8శాతం మాత్రమే పూర్తయ్యింది. 

గుర్తింపుకార్డులో..
ఉపాధ్యాయులకు అందించే గుర్తింపుకార్డులో పూర్తి వివరాలు ఉండనున్నాయి. వారు ప్రధానంగా పనిచేస్తున్న జిల్లా, మండలం, పాఠశాల డైస్‌కోడ్, హోదా, మొబైల్‌ నంబర్, ఎ క్కడ విధులు నిర్వర్తిస్తున్నారు, నివాసం, ఉపాధ్యాయుడి కోడ్, పుట్టినతేదీ, రక్తం గ్రూపు, ఫొటో, తదితర వివరాలు గుర్తింపుకార్డులో పొందుపరుస్తారు. ఇదివరకు గుర్తింపు కార్డులను సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు ఇచ్చేవారు. కానీ ఈసారి ప్రభుత్వం మొదటి సారి గా గుర్తింపుకార్డులు అందించేందుకు సన్నద్ధమవుతోంది. 

ఆరు మండలాల్లో వందశాతం పూర్తి
మంచిర్యాల జిల్లాలో 732 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో 2763 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. జన్నారం మండలంలో 65 పాఠశాలల్లో 245 మంది ఉపాధ్యాయులకు గాను 245 మంది వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసి వందశాతం పూర్తి చేశారు. దండేపల్లి మండలంలోని 56 పాఠశాలల్లో 232 మంది, భీమినిలో 29 పాఠశాలల్లో 88 మంది, కన్నెపల్లిలో 36 పాఠశాలల్లో 107 మంది, వేమనపల్లిలో 32 పాఠశాలల్లో 85 మంది, నెన్నెలలో 33 పాఠశాలల్లో 141 మంది ఉపాధ్యాయులు వందశాతం తమ వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. భీమారం, చెన్నూర్, మందమర్రి, మంచిర్యాల, హజీపూర్, లక్టెట్టిపేట్‌ మండలాల్లో పదిమందికి పైగా ఉపాధ్యాయులు వివరాలు నమోదు చేయాల్సి ఉంది. రెండు రోజుల్లో ఉపాధ్యాయులు వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సెక్టోరల్‌ అధికారి సప్థర్‌అలీ సూచించారు.

మరిన్ని వార్తలు