దేశ సంపద కార్పొరేట్‌కు ధారాదత్తం 

25 Sep, 2021 04:04 IST|Sakshi
సూర్యాపేటలో ర్యాలీ నిర్వహిస్తున్న ఐద్వా కార్యకర్తలు  

కేంద్ర ప్రభుత్వంపై ఐద్వా నేత ధావలే ధ్వజం

సూర్యాపేటలో ఐద్వా రాష్ట్ర మహాసభలు ప్రారంభం

సూర్యాపేట: కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేస్తూ కార్పొరేటీకరణకు పెద్దపీట వేస్తోందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు జరగనున్న ఐద్వా రాష్ట్ర మూడో మహాసభలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటివరకు పాలనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. మోదీ అనుసరిస్తున్న విధానాల కారణంగా ప్రజాజీవితం అస్తవ్యస్తంగా తయారవుతోందన్నారు. ఏడేళ్ల కాలంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. వంట గ్యాస్‌ధర పెంచుతూ పేదల నడ్డి విరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోనే కాక అనేక రాష్ట్రాల్లో మహిళలు, బాలికలపై హత్యలు, లైంగిక దాడులు పెరిగి పోయాయని, వాటిని నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయని అన్నారు.

రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన వల్ల పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేక ఏడు సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నా.. కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. లక్షలాది ఎకరాల భూములను ధరణి పేరుతో భూస్వాములకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సభకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆశాలత, కేంద్ర కమిటీ సభ్యురాలు టి.జ్యోతి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, ఉపాధ్యక్షురాలు బత్తుల హైమావతి తదితరులు సభలో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు