సారూ.. ఇదేం తీరు 

3 Feb, 2023 10:31 IST|Sakshi
అచ్చంపేటలోని సివిల్‌ ఆస్పత్రి, బాలింత బంధువు వద్ద వివరాలు సేకరిస్తున్న ప్రైవేటు ల్యాబు నిర్వాహకుడు

సాక్షి నాగర్‌ కర్నూల్‌/అచ్చంపేట రూరల్‌: ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బంది తీరు మారడం లేదు. ఎన్నిసార్లు సస్పెండ్లు చేసినా.. శాఖాపరమైన చర్యలు తీసుకున్నా.. తమ పద్ధతి మాత్రం మార్చుకోవడం లేదు. తాజాగా గురువారం అచ్చంపేట ప్రభుత్వ సివిల్‌ ఆస్పత్రిలోని సురక్షిత మాతృత్వ ఆశ్వాసన్‌ సెంటర్‌లోకి ఓ ప్రైవేటు ల్యాబ్‌ నిర్వాహకుడు శిశువుల రక్త నమూనాలు తీసుకెళ్లడానికి వచ్చాడు. శిశువుల నుంచి రక్త నమూనాలు తీసుకుని వారి బంధువుల వద్ద ఒక్కొక్కరి దగ్గర రూ.500 చొప్పున వసూలు చేశాడు.

ఆస్పత్రిలోని ఓ నర్సు టీఎస్‌బీ, సీపీపీ, బీజీఎఫ్‌ పరీక్షల కోసం ఆస్పత్రి పేరు మీద ఉన్న చీటీలు రాసిచ్చారు. ఆస్పత్రిలో ఈ పరీక్షలు చేయడానికి వీల్లేదని, ఓ ల్యాబ్‌ నుంచి వ్యక్తి వచ్చి పరీక్షలు చేస్తారని చెప్పారని బల్మూర్‌ మండలం చెన్నారం గ్రామానికి చెందిన బాలింత జ్యోతి భర్త సాయిబాబు తెలిపారు. ప్రైవేటు ల్యాబ్‌ నిర్వాహకుడు దర్జాగా ఆస్పత్రిలోకి వచ్చి శిశువుల వద్ద రక్తం సేకరించాడు. ఆస్పత్రి ఆవరణలో ఉన్న సెక్యూరిటీ గార్డు గమనించి ఫార్మాసిస్టు రాజేష్‌కు విషయం చెప్పడంతో వెంటనే ఆయన వచ్చి నిలదీశాడు. ఆస్పత్రి లోపలికి వచ్చి శిశువుల వద్ద రక్తం తీసుకోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారని, ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని రాజేష్‌ తెలిపారు.

కాగా ఓ బాలింతకు చెందిన బంధువులు ఆస్పత్రిలోని ఓ నర్సు చెప్పడంతో తామంతా రక్త పరీక్షలు చేసుకోవడానికి ముందుకొచ్చామని, రూ.500 ఇచ్చామని ఆరోపించారు. ఆస్పత్రిలో అన్ని వసతులు సమకూర్చుతున్నామని, అన్ని రకాల పరీక్షలు చేస్తున్నామని ఫార్మాసిస్టు చెప్పారు. ఇటీవలి కాలంలోనే ఉన్నతాధికారులు పరీక్షల నిమిత్తం ఓ నూతన యంత్రాన్ని పంపించారని వివరించారు. కాగా బయటి నుంచి ప్రైవేటు ల్యాబ్‌ వ్యక్తులు ఆస్పత్రిలోకి వచ్చి శిశువుల వద్ద రక్తం తీసుకెళ్తున్నా పర్యవేక్షణ కరువైందని, శిశువులకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. కొందరు నర్సులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, డిమాండ్‌గా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 

బయటకు పంపడం సరికాదు 
అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నిరకాల వసతులు సమకూరుతున్నా కొందరు సిబ్బంది తీరు మారడం లేదు. పరీక్షల కోసం రోగులు, బాలింతలు, చిన్నారులను బయటకు పంపడం సరికాదు. ప్రైవేటు వ్యక్తి వచ్చి ఆస్పత్రిలో చిన్నారుల వద్ద రక్త నమూనాలు తీసుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదు. విధుల పట్ల నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. 
– మల్లేష్, సీపీఎం నాయకుడు, అచ్చంపేట  

సొంత క్లినిక్‌లకు రెఫర్‌ 
స్థానికులుగా ఉన్న వైద్యులే తరుచుగా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారని, వారే స్థానికంగా ప్రైవేటు ఆస్పత్రులు నిర్వహిస్తూ ఇక్కడి రోగులపై నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులను తమ క్లినిక్‌లకు రెఫర్‌ చేసుకుంటున్నారని, ఈ మేరకు ఆస్పత్రిలోని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ ఆస్పత్రిలో విధులు నిర్వర్తించిన వైద్యులు, సిబ్బందిపై పలుమార్లు చర్యలు తీసుకున్నా.. సస్పెండ్‌ అయినా కొన్ని రోజులకే మళ్లీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తించడంతో వైద్యశాఖ ఉన్నతాధికారుల  పనితీరు బహిర్గతమవుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఆస్పత్రిలో వైద్యుడు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందడం, అంతకు ముందు కరోనా సమయంలో ఓ చెంచు మహిళకు కరోనా ఉందని కాన్పు చేయకపోవడంతో వైద్యులను, సిబ్బందిని  సస్పెండ్‌  చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కృష్ణను వివరణ కోరడానికి ప్రయత్నం చేయగా ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. 

(చదవండి: పంటలకు ‘కట్‌’కట!)

మరిన్ని వార్తలు