సీటు బెల్ట్‌ ధరించండి.. బహుమతులు గెల్చుకోండి!

7 Mar, 2021 08:29 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్‌ రూల్స్‌పై వాహనదారులకు అవగాహన పెంచాలన్న లక్ష్యంతో ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ యాప్‌ బేస్డ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌(ఐఎఫ్‌ఏటీ) సంస్థ ‘సెల్ఫీ విత్‌ సీట్‌ బెల్ట్‌’ ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టింది. సీటు బెల్ట్‌ ధరించినప్పుడు సెల్ఫీ తీసుకుని ఆ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే బహుమతులు అందిస్తోంది. కారు డ్రైవర్‌ సీట్‌ బెల్ట్‌ ధరించి, ఫొటో దిగి హ్యాష్‌ట్యాగ్‌తో  ‘సెల్ఫీ విత్‌ సీట్‌ బెల్ట్‌’ అని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే ‘ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ యాప్‌ బేస్డ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌’ (ఐఎఫ్‌ఏటీ) బహుమతితో పాటు 5 లీటర్ల డీజిల్‌ను అందిస్తోంది.  

భద్రత కోసమే ప్రచారం.. 
ప్రమాద సమయంలో ప్రాణాలను రక్షించగల సీట్‌ బెల్ట్‌  విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని, వాహనదారులు తప్పకుండా సీటు బెల్టు ధరించాలని 2016 నుంచి ఐఎఫ్‌ఏటీ ప్రచారాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా క్యాబ్‌ డ్రైవర్లు సీటు బెల్టు తప్పకుండా ధరించేలా ప్రోత్సహిస్తోంది.  

సురక్షితం 
ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఎయిర్‌ బ్యాగ్‌ విచ్చుకోవటం అనేది సీట్‌ బెల్ట్‌తో లింక్‌ అయి ఉంటుంది. ప్రమాద సమయంలో ఇది విచ్చుకున్నప్పుడు సీట్‌ బెల్టు ఆటోమేటిక్‌గా టైట్‌ అవుతుంది.  

  • చాలా వరకు రోడ్డు ప్రమాదాల్లో సీట్‌ బెల్ట్‌ ధరించకపోవటం వల్లే ప్రాణాలు కోల్పోతున్నట్లు పలు సర్వేల్లో వెల్లడైంది. 
  • సీటు బెల్ట్‌ విషయంలో వాహన చోదకులు చూపుతున్న చిన్న నిర్లక్ష్యం ప్రాణాలను హరిస్తోంది.  
  • ప్రపంచ వ్యాప్తంగా తేలికపాటి వాహనాలకు జరుగుతున్న ప్రతి మూడు ప్రమాదాల్లో రెండు సీటు బెల్ట్‌ ధరించకపోవడం వల్లేనని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.  

ఆదర్శంగా.... 
‘సెల్ఫీ విత్‌ సీట్‌ బెల్ట్‌’ ఛాలెంజ్‌ హైదరాబాద్‌లోనే కాకుండా దేశంలోని వివిధ నగరాల్లో సైతం ట్రెండింగ్‌గా మారినట్లు ఐఎఫ్‌ఏటీ జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్‌ సలావుద్దీన్‌ తెలిపారు. నగరంలోని వందలాది మంది క్యాబ్‌ డ్రైవర్లు,  ప్రయాణికులు ఇలా ఫొటోలు దిగి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసి బహుమతులు అందుకునట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు