Basara IIIT: కుళ్లిన గుడ్లు.. పాడైన కూరగాయలు.. మాకు పెడుతున్న భోజనం నాసిరకం

17 Jul, 2022 03:02 IST|Sakshi
నాసిరకం వస్తువులతో విద్యార్థుల ఆందోళన

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ఆవేదన

పరిపాలనా కార్యాలయం వద్ద ఆందోళన

బాధ్యులపై తక్షణ చర్యలకు డిమాండ్‌

రెండు మెస్‌లపై కేసులు నమోదు

60మందిలో 21మంది డిశ్చార్జ్‌ అయ్యారన్న ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ

నిర్మల్‌/బాసర: కుళ్లిన గుడ్లు, పాడైన కూరగాయలు, కాలం చెల్లిన నూనెలు, వస్తుసామగ్రి వాడుతూ మెస్‌ల నిర్వాహకులు తమకు నాసిరకం భోజనం అందిస్తున్నారని బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) విద్యార్థులు ఆరోపించారు. ఇలాంటి భోజనం అందిస్తున్నందుకే వందలాది మందికి ఫుడ్‌ పాయిజన్‌ జరిగిందంటూ విద్యార్థులు మళ్లీ ఆందోళన బాట పట్టారు.

నాసిరకం వస్తుసామగ్రిని చూపుతూ శనివారం స్థానిక అడ్మినిస్ట్రేటివ్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఫుడ్‌ పాయిజన్‌ ఘటన నేపథ్యంలో శుక్రవారం రాత్రే నిజామాబాద్‌ ఆస్పత్రికి చేరుకున్న ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్‌ వెంకటరమణ శనివారం క్యాంపస్‌కు రావడంతో తమకు ఎలాంటి తిండి పెడుతున్నారో చూడండి అంటూ సగం పగిలిన పప్పు, శుభ్రంగా లేని సామగ్రి, నాసిరకం వంటనూనెలు, కాలంచెల్లిన ఇతర వస్తువులను వెంకటరమణతోపాటు ఆర్జీయూకేటీ డైరెక్టర్‌ సతీశ్‌కుమార్‌కు చూపించారు.

ఏప్రిల్‌లో ఎస్‌ఎస్‌ కేటరర్స్‌లో కాలంచెల్లిన శనగపిండి, ఉప్మారవ్వ, గోధుమ పిండి ఉపయోగిస్తున్నట్లు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వేల మంది విద్యార్థుల సంక్షేమం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలంటూ స్టూడెంట్‌ గవర్నింగ్‌ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అధికారులకు ఓ లేఖను అందించారు. మెస్‌లు, సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకొనే దాకా ఆందోళన కొనసాగిస్తామన్నారు. దీంతో డైరెక్టర్‌ సతీశ్‌కుమార్‌ రెండు మెస్‌లపై కేసులు పెట్టినట్లు పత్రాలను చూపారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు డిమాండ్లను అధికారుల ముందు ఉంచారు.
►మెస్‌ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలి.
►రాజకీయ ప్రభావం లేకుండా మెస్‌ టెండర్లు ఉండాలి.
►ఐఐటీ, నిట్‌లలో కనీసం పదేళ్లు అనుభవం ఉన్నవారినే టెండర్లకు అనుమతించాలి.
►ఘటనకు కారకులైన సంబంధిత అధికారులను తొలగించాలి.
►మాపై ప్రభావం చూపే ప్రతి విషయంలోనూ మా అభిప్రాయం తీసుకోవాలి.
►గత నెల చేపట్టిన ఆందోళన సందర్భంగా ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లన్నింటినీ తక్షణమే నెరవేర్చాలి.

హెల్ప్‌లైన్‌ కేంద్రం, హెల్త్‌ క్యాంపులు పెడతాం
►ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ వెల్లడి
నిర్మల్‌ చైన్‌గేట్‌: ట్రిపుల్‌ ఐటీలో సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ వెంకటరమణ తెలిపారు. నిర్మల్‌ కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ ముషారఫ్‌ అలీతో కలసి ఆయన మాట్లాడారు. కొన్ని అజాగ్రత్తల వల్లే విద్యార్థులు అనారోగ్యం పాలైనట్లు తెలిసిందన్నారు. విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. సమర్థులైన ఫ్యాకల్టీని నియమించి సోమవారం నుంచి పాలనాపరమైన మార్పులు చేస్తామన్నారు. ప్రతి హాస్టల్‌కు ఒక వార్డెన్, ఫిర్యాదుల విభాగం, విద్యార్థులకు హెల్ప్‌లైన్‌ సెంటర్, అమ్మాయిల కోసం హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తామని వివరించారు. నెలకోసారి ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తామని తెలిపారు. 60 మంది విద్యార్థినులకు పుడ్‌పాయిజన్‌ అయిందని, 21 మంది విద్యార్థినులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది డిచ్చార్జి అయ్యారని తెలిపారు.

మంత్రి సబితను బర్తరఫ్‌ చేయాలి
►బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌
నిజామాబాద్‌ నాగారం: నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థినులను శనివారం వివిధ పార్టీల నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఫుడ్‌పాయిజన్‌ ఘటనకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బాధ్యురాలిని చేస్తూ ఆమెను తక్షణమే మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులు మరణిస్తే కానీ సీఎం ట్రిపుల్‌ ఐటీని సందర్శించరా అని మండిపడ్డారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ యూనివర్సిటీలు పాకిస్తాన్‌ ఉగ్రవాద క్యాంపులు కాదని, వాటిల్లోకి ఎవరినీ అనుమతించకపోవడం దారుణమన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించలేకపోతున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం వారికి నాణ్యమైన ఆహారం కూడా అందించకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌కు సంబంధించిన కాంట్రాక్టర్‌ కావడంతోనే మెస్‌ నిర్వాహకుడు విద్యార్థులకు నాసిరకమైన భోజనం పెడుతున్నాడని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు