నేడు ట్రిపుల్‌ఐటీ నోటిఫికేషన్‌ 

1 Aug, 2021 01:36 IST|Sakshi

తొలిసారి పాలిసెట్‌ ర్యాంకు ఆధారంగా సీట్ల కేటాయింపు 

భైంసా (ముధోల్‌): నిర్మల్‌ జిల్లా బాసరలోని ట్రిపుల్‌ ఐటీ 2021–22 విద్యాసంవత్సరానికి సీట్ల భర్తీ నోటిఫికేషన్‌ నేడు విడుదల కానుంది. కరోనా కారణంగా పదో తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్‌ చేయడంతో తొలిసారిగా ట్రిపుల్‌ఐటీ సీట్లను పాలిసెట్‌ ర్యాంకును పరిగణనలోకి తీసుకుని కేటాయించనున్నారు. నోటిఫికేషన్‌ వివరాలను శనివారం ట్రిపుల్‌ఐటీ ఏవో రాజేశ్వర్‌రావు వెల్లడించారు. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుకు సంబంధించి ఆగస్టు 1న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ నెల 2 నుంచి 12 వరకు ఆన్‌లైన్‌లో విద్యార్థుల దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు 14 వరకు సడలింపు ఇవ్వనున్నారు. 18న సీట్లు లభించిన విద్యార్థుల జాబితా ప్రకటిస్తారు. విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 6304893876 అందుబాటులో ఉంచారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఫోన్‌ చేసి వివరా లు తెలుసుకోవచ్చు. ఇతర సాయం కోసం admi ssions@rgukt. ac. inకు మెయిల్‌ చేయొచ్చు. www. rgukt.ac.in,  http://admissions. rgukt. ac. inలో దరఖాస్తు చేసుకోవాలి. 

విద్యార్థులకు సూచనలు.. 
విద్యార్థులకు 31–12–2021 నాటికి 18 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 21 ఏళ్ల వయసు వరకు సడలింపు ఇచ్చారు. పాలిసెట్‌ ర్యాంకు, పదో తరగతి  జీపీఏ, రిజర్వేషన్లను పాటిస్తూ సీట్లు కేటాయిస్తారు. గ్రామీణ  విద్యార్థులకు 0.4 జీపీఏను అదనంగా కలుపుతారు. రాష్ట్ర పునర్విభజన చట్టం 371/డి ప్రకారం 85 శాతం తెలంగాణ, 15 శాతం ఆంధ్ర, తెలంగాణ విద్యార్థులతో అన్‌రిజర్వ్‌డ్‌ సీట్లు భర్తీ చేస్తారు. 5 శాతం రాష్ట్రేతర విద్యార్థులు, గల్ఫ్‌ దేశాల్లోని భారతీయ సంతతి విద్యార్థులు, 2 శాతం ఎన్‌ఆర్‌ఐ, విదేశీ విద్యార్థులతో సూపర్‌ న్యూమరరీ సీట్లు భర్తీ చేస్తారు.  ఆన్‌లైన్‌లో పొందుపరిచిన ధ్రువపత్రాల కాపీలను ఆర్‌జీయూకేటీ బాసర చిరునామాకు స్పీడ్‌పోస్ట్‌ ద్వారా పంపించాలి.  

మరిన్ని వార్తలు