సిటీ పొల్యూషన్‌కి మంచి సొల్యూషన్‌ ‘లివింగ్‌ ల్యాబ్‌’ 

12 Oct, 2021 01:32 IST|Sakshi

సాక్షి, రాయదుర్గం(హైదరాబాద్‌): హైదరాబాద్‌ మహానగరమైంది. అభివృద్ధి మంచిదే. కానీ అభివృద్ధితోపాటు వృద్ధి చెం దుతున్న కాలుష్యం నగర జీవితాలను ఆందోళనలోకి నెట్టేస్తుంది. నగరాల్లోని గాలి నాణ్యత అక్కడి ప్రజల జీవన నాణ్యతను తెలియజేస్తుందంటారు. ఢిల్లీ లాంటి మహా నగరాలలాగా కాదు.. హైదరాబాద్‌ గాలిలో విషపూరిత వాయువులు అధికమయ్యాయి. వీటి నంచి బయటపడేందుకు గాలితోపాటు నీరు, విద్యుత్‌ను కాపాడుకోవడాకి హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీ ఓ వినూత్న ఆలోచన చేసింది.

అదే క్యాంపస్‌ లో స్మార్ట్‌ సిటీ లివింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు.  2019 నుంచి ఈ లివింగ్‌ ల్యాబ్‌ పర్యవేక్షణలో ఉన్నది ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌. యూరోపియన్‌ బిజినెస్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌(ఈబీటీసీ), ఆమ్‌స్టర్‌డామ్‌ ఇన్నోవేషన్‌ ఎరీనా (ఏఐఏ), అలాగే ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, తెలం గాణ ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్‌ ప్రయోగాలు అద్భుతమైన ఫలితాలిస్తున్నవి.  

లివింగ్‌ ల్యాబ్‌ ఎలా పనిచేస్తుందంటే..  
► గాలి నాణ్యత మాత్రమే కాదు... నీటి నిర్వహణ, విద్యుత్‌ వినియోగం ఎలా ఉంది? వాతావరణ పరిస్థితులు ఎలా మారుతున్నాయనే అన్ని అంశాలను ఈ లివింగ్‌ ల్యాబ్‌ పర్యవేక్షిస్తున్నది.  

ప్రతి 15 సెకన్లకు గాలి నాణ్యత అంచనా... 
► ప్రతి పదిహేను సెకన్లకు ఓసారి గాలి నాణ్యతను లెక్కించి సర్వర్‌కి పంపిస్తుంది ట్రిపుల్‌ ఐటీలోని ల్యాబ్‌. వాయి వేగాన్ని, దిశను, గాలిలోని ఉష్ణోగ్రతలు, తేమను సైతం తెలుపుతుంది.  

నీరు వృథా కాకుండా...  
 ప్రతి 4 గంటలకోసారి నీటిలోని లవణాలు, గాఢత స్థాయిలను లెక్కిస్తుంది. నీటి వృథాని నివారించడం కోసం, దుర్వినియోగం చేయకుం డా ఉండటం కోసం ఏర్పాటు చేసిన నియత్రణ పరికరాలు నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. వాతావరణంలో వస్తున్న మార్పులను, వర్షపా తం సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంది. 

విద్యుత్‌ వినియోగంపైనా ఓ కన్ను...  
► మానవ జీవితంలో మరో నిత్యావసరం విద్యుత్‌. ఎంత కాపాడుకుంటే అంత మంచిది. బల్బులు, ఫ్యానులు, ఇతర పరికరాల విద్యుత్‌ వినియోగాన్ని, సోలార్‌ విద్యుత్‌ వినియోగ డాటాని ల్యాబ్‌లోని నోడ్స్‌ ప్రతి పదిహేను నిమిషాలకోసారి అందిస్తుంది. దీని ద్వారా విద్యుత్‌ను ఆదా చేయడానికి వీలవుతుంది.  

ఉల్లంఘనలను పసిగడుతుంది...  
► సహజవనరులను కాపాడుకోవడమే కాదు... మహమ్మారుల నుంచి రక్షించడానికీ కొన్ని పద్ధతులున్నాయి. కరోనా పాండమిక్‌ పరిస్థితుల్లో మాస్కు లేకుండా తిరిగినా, ఎక్కువమంది గుమిగూడినా, భౌతికదూరం పాటించకపోయినా.. ఎక్కడెక్కడ ఉల్లంఘనలు జరుగుతున్నాయో సెక్యూరిటీ కెమెరాల ద్వారా ఈ లివింగ్‌ ల్యాబ్‌ కనిపెట్టేస్తోంది.  ఇలా అన్ని విభాగాల నుంచి సమాచారం ఒకే దగ్గరకు రావడంతో... అన్ని సమస్యలకు వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ చెక్‌ పెడుతున్నది. హైదరాబాద్‌ను రక్షించడానికి, నగర మౌలిక సదుపాయాలు, సేవలను మెరుగుపర్చుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.  

శక్తి వినియోగంపై నిరంతర పర్యవేక్షణ అవసరం: లీడ్‌ ఆర్కిటెక్ట్‌ అనురాధ
ఈ లివింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు వల్ల గాలి, నీరు నాణ్యత, విద్యుత్‌ వినియోగం మాత్రమే కాదు... కోవిడ్‌ నిబంధలను ఉల్లంఘించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవడం ద్వారా క్యాంపస్‌లో కోవిడ్‌–19 వ్యాప్తిని అదుపులో ఉంచగలిగాం. లివింగ్‌ ల్యాబ్‌ ప్రాజెక్టులో అంతర్జాతీయ విలువలు కలిగిన ఓఎం2ఎం ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తున్నాం.  

ఐయూడీఎక్స్‌తో కలిసి బలమైన ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు: పరిశోధక విద్యార్థులు 
ఇది జాతీయ, ప్రపంచవ్యాప్త వినియోగంలో ఉన్న ప్లాట్‌పామ్‌. ఒక్క క్యాంపస్‌లోనే కాదు.. నగరపాలన, పౌరుల రోజువారీ సమస్యలకు ఓ చక్కని పరిష్కారం ఇది. 

మరిన్ని వార్తలు