ఇకెబానా ఒహారా స్కూల్లో మినీ ఎగ్జిబిషన్‌.. ప్రత్యేక అతిథులు హాజరు

21 Sep, 2022 17:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యావత్ దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఇకెబానా (పూలు అమర్చే జపనీస్‌ కళ)ను నేర్పించే హైదరాబాద్‌లోని ఒహారా స్కూల్‌ కూడా ఈ ఏడాది తమ మొదటి ఈవెంట్‌ను దీనికే అంకితం చేసింది. ఈ సందర్భంగా ఓ మినీ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. స్కూల్ ప్రెసిడెంట్‌ శ్రీమతి నిర్మలా అగర్వాల్ నేతృత్వంలోని బృందం థీమ్‌ను రూపొందించి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులను ఆహ్వానించింది.

శత్రువులతో పోరాడుతూ కార్గిల్ యుద్ధంలో అమరులైన మేజర్ పద్మపణి ఆచార్య సతీమణి చారులత ఆచార్య ఈ మినీ ఎగ్జిబిషన్‌కు అతిథిగా హాజరయ్యారు. సైన్యంలో వైద్య సేవలందించిన లెఫ్టినెంట్ కల్నల్‌, పీడియాట్రిషన్‌ ఉమ రామచంద్రన్‌ కూడా పాల్గొన్నారు. ఆర్మీ స్కూల్స్‌లో టీచర్‌గా పనిచేసిన శ్యామల ఖన్నా అతిథిగా వచ్చారు. ఈమె 'కౌ ఇన్ కార్గిల్', 'ది లాహోర్ కనెక్షన్' వంటి పుస్తకాలు కూడా రాశారు.


చదవండి: నెహ్రూ జూపార్కులోనే ఓ చీతా ఉంది తెలుసా!

మరిన్ని వార్తలు