అడ్డదారులకు అడ్డా! ప్రతి దానికీ కోడ్‌ భాష.. ‘ట్రిప్‌కు వెళదాం’ అంటే కథ వేరే అని!

9 Feb, 2023 08:31 IST|Sakshi

సోషల్‌ మీడియా వేదికగా యువత అసాంఘిక కార్యకలాపాలు

పెడతోవ పట్టిస్తున్న సామాజిక సంబంధాల గ్రూపులు 

యువతీయువకులకు, విద్యార్థులకు ఎర 

డ్రగ్స్‌కు, అశ్లీల వీడియోల వీక్షణకు బానిసలుగా, నేరస్తులుగా మారుతున్న వైనం 

ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌ల్లో  డ్రగ్స్‌ ఆర్డర్లు..టెలిగ్రామ్‌లో అశ్లీల వీడియోల లింక్‌లు  

మహిళా భద్రత విభాగం ఆన్‌లైన్‌ పెట్రోలింగ్‌లో గుర్తింపు

సాక్షి, హైదరాబాద్‌: ఓ అగ్గిపుల్లతో ఇంట్లో కొవ్వొత్తిని వెలిగించొచ్చు. అదే అగ్గిపుల్లతో ఇంటినీ తగులబెట్టొచ్చు. ఓ కత్తితో కూరగాయలు కోయొచ్చు. అదే కత్తితో ప్రాణం కూడా తీయొచ్చు. ఏ వస్తువునైనా వాడే విధానాన్ని బట్టి దాని ప్రయోజనం ఉంటుంది. సోషల్‌ మీడియా వేదికలకు కూడా ఇప్పుడదే సూత్రం వర్తిస్తోంది.

సామాజిక సంబంధాలు మెరుగు పరుచుకోవడానికి, సమాచారం ఇచ్చి పుచ్చుకోవడానికి ఉపయోగించుకోవాల్సిన సోషల్‌ మీడియా వేదికలను కొందరు తమ అడ్డదారులకు అడ్డాలుగా వాడుకుంటున్నారు. నేరగాళ్లు వీటిని ఆధారంగా చేసుకుని మోసాలకు పాల్పడుతోంటే.. వీటిని విరివిగా ఉపయోగించే యువత డ్రగ్స్‌కు బానిసలుగా అవుతున్నారు. కొందరు నేరస్తులుగా మారుతూ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు.    

గుంపులు కట్టి..పెడతోవ పట్టి.. 
యుక్త వయస్సులో దూకుడుగా వ్యవహరించే కొందరు యువతకు సోషల్‌ మీడియా యాప్‌లు మంచి అడ్డాలుగా మారాయి. ముఖ్యంగా జీవితంలో ఏమీ సాధించకుండానే పోకిరీలుగా మారి జల్సాలు చేసే యువత ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్, గూగుల్‌ గ్రూప్స్, రెడ్డిట్‌ వంటి సోషల్‌ మీడియా యాప్స్‌ను దురి్వనియోగం చేస్తున్నారు.

ప్రత్యేక గ్రూప్‌లుగా ఏర్పడి, వీటి ద్వారా మత్తుపదార్థాల వినియోగం, సరఫరా, కొనుగోలు, ఇతరత్రా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు పోలీస్, ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. ఇటీవల పట్టుబడిన చాలా కేసుల్లో నిందితులు ఈ గ్రూపులను డ్రగ్స్‌ సరఫరాకు, కొనుగోలుకు వాడుకున్నట్టు వారు వెల్లడించారు. డ్రగ్స్‌ ముఠాలు సైతం యుతను లక్ష్యంగా చేసుకుని ఈ సోషల్‌  మీడియా గ్రూపుల్లో డ్రగ్స్, అక్రమ ఆయుధాల విక్రయం వంటి వాటిపై ప్రకటనలు ఇస్తున్నాయి. ఆకర్షితులైన యువతను తమ గ్రూపుల్లోకి చేర్చుకుని పెడతోవ పట్టిస్తున్నాయి.  

పరిచయం పెంచుకుని పుట్టి ముంచుతారు 
తొలుత కొన్నాళ్లు వారితో చాటింగ్‌ చేస్తూ పరిచయాలు పెంచుకుంటుఆరు. నమ్మకం కుదిరిన తర్వాత మెల్లగా వారిని డ్రగ్స్‌ వైపు ఆకర్షితుల్ని చేస్తారు. తర్వాత వాటిని కొనుగోలు చేసేలా వాడేలా ప్రేరేపిస్తారు. వాళ్లు డ్రగ్స్‌ కొనడం మొదలుపెట్టి, క్రమంగా వాటికి అలవాటు పడిన తర్వాత వారి తోటి విద్యార్థులు, స్నేహితులకు వాటిని అలవాటు చేసేలా చేస్తారు. ఇలా ఒకరి నుంచి ఒకరికి ఈ మత్తుపదార్థాల అలవాటు వ్యాపింపజేస్తారు. యువతను డ్రగ్స్‌కు బానిసలుగా మార్చడంతో పాటు వారి దగ్గర డబ్బులు దండుకోవడం, డ్రగ్స్‌ పెడ్లర్లుగా మార్చడం వంటివి చేస్తున్నట్టు పోలీసు అధికారుల దర్యాప్తులో వెలుగులోకి వచి్చంది.  

ప్రతి దానికీ కోడ్‌ భాష..
గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, అక్రమ ఆయుధాలు ఇలా ప్రతిదానికీ ఆన్‌లైన్‌లోని ముఠాలు మారుపేర్లు పెట్టుకుంటున్నట్టు ఓ పోలీస్‌ అధికారి తెలిపారు. గంజాయిని పాట్, ఎల్‌ఎస్‌డీని పేపర్, ఎక్సటసీ డ్రగ్స్‌ను పిల్‌ (వీటిని పార్టీ డ్రగ్స్‌ అంటారు)గా పిలుస్తారు. స్నేహితులతో డ్రగ్స్‌ తీసుకునేందుకు వెళ్లాలనుకుంటే ‘ట్రిప్‌కు వెళదాం’ అంటారు. ఇలా ప్రతి దానికీ ఓ కోడ్‌ భాష ఉంటుందని ఆ అధికారి వివరించారు.  

అమ్మకానికి అశ్లీల వీడియోలు..
సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే యువతలో చాలామంది అశ్లీల వీడియోలను చూసేందుకు అమితాసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా యుక్త వయసులోని పాఠశాల, కళాశాలల విద్యార్థులు అశ్లీల వీడియోల వీక్షణకు బానిసలుగా మారుతున్నట్టు రాష్ట్ర మహిళా భద్రత విభాగం అధికారుల ఆన్‌లైన్‌ పెట్రోలింగ్‌లో వెల్లడైంది. టెలిగ్రామ్‌లో ఈ తరహా వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్నట్టు పోలీస్‌ అధికారులు ఇప్పటికే గుర్తించారు. రూ.50 నుంచి రూ.100 ఇస్తే చాలు 50 నుంచి 100 పోర్న్‌ వీడియోల లింకులను కొన్ని ము­ఠాలు యువతకు చేరవేస్తున్న సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

విద్యార్థుల వయస్సు, ప్రొఫైల్స్‌ వారి అభిరుచులను ఆధారంగా చేసుకుని కొన్ని ముఠాలు సోషల్‌మీడియా యాప్స్‌లోని కొన్ని గ్రూప్‌ల ద్వారా వారికి రిక్వెస్ట్‌లు పెడుతున్నాయి. వారు ఆ గ్రూప్‌లలో చేరిన తర్వాత వారితో సెక్స్‌ గురించి చాటింగ్‌ చేసి..ఉద్రేకపరచడం ద్వారా వా­రిని పోర్న్‌ వీడియోలకు బానిసలుగా మారుస్తున్న­ట్టు ఓ అధికారి తెలిపారు. ఇలా బానిసలుగా మా­రిన వారు పాకెట్‌మనీ ఖర్చుపెట్టి పోర్న్‌ వీడి­యోలు చూడడంతో పాటు కొన్ని సందర్భాల్లో ఇంట్లో  డబ్బులు కాజేసి వాటిని అశ్లీల వీడియోలు వీక్షించేందుకు ఖర్చు చేస్తున్నట్టు ఆ అధికారి వివరించారు.  

అవగాహన కల్పన, అప్రమత్తతే కీలకం  
సాంకేతిక యుగంలో టెక్నాలజీని వాడకుండా ఉండడం అనేది కుదరని పని.  సోషల్‌ మీడియా యాప్స్‌కు దూరంగా ఉండాలని పిల్లలకు  చెప్పే పరిస్థితి  కూడా లేదు. మంచితో పాటు చెడుకు అవకాశం ఉన్న ఈ సోషల్‌ మీడియా యాప్స్‌ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై పిల్లలకు స్పష్టమైన అవగాహన కలి్పంచాలి.

అపరిచితులతో ఆన్‌లైన్‌లో స్నేహాలు సరికాదన్న విషయాన్ని వాళ్లకి అర్థం అయ్యేలా చెప్పాలి. అదే సమయంలో ఇంటర్నెట్‌లో వాళ్ళు ఏ ఏ అంశాలు సెర్చ్‌ చేస్తున్నారు.. సోషల్‌ మీడియాలో ఎవరెవరితో స్నేహం చేస్తున్నారు అనేది గమనిస్తూ ఉండాలి. పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. ఇంట్లో ఉన్న కంప్యూటర్‌ వీలైనంత వరకు కామన్‌ ఏరియాలో ఉండేలా చూసుకోవడం ఉత్తమం. పిల్లలు కంప్యూటర్లు, ఫోన్లలో గంటల తరబడి గడుపుతుంటే..వారిపై ఓ కన్ను వేయాల్సిందే. 
– సీనియర్‌ పోలీస్‌ అధికారి  

మరిన్ని వార్తలు