వివాహేతర సంబంధం.. అడ్డు తొలగించుకునేందుకు తోడల్లుడి పథకం.. రూ.2.30 లక్షల సుఫారీ

10 Sep, 2022 08:23 IST|Sakshi

ప్రధాన నిందితులు తోడల్లుడు, భార్య

కృష్ణానదిలో హత్య

గచ్చిబౌలి: మణికొండలో అదృశ్యమై కృష్ణా నదిలో హత్యకు పాల్పడిన కేసులో  వివాహేతర సంబంధమే కారణమని, అడ్డుతొలగించుకునేందుకు తోడల్లుడు పథకం రచించగా.. మృతుడి భార్య అంగీరించినట్లు రాయదుర్గం సీఐ  తిరుపతి తెలిపారు. కృష్ణా నదిలో గాలించినా మృతదేహం లభ్యం కాకపోయినప్పటికీ సాంకేతిక ఆధారాలతో ఐదుగురు నిందితులను శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

సీఐ తిరుపతి తెలిపిన మేరకు..  నల్గొండ జిల్లా మిర్యాలగూడ  లావుతండాకు చెందిన  ధనవత్‌ రాగ్యానాయక్‌(28) క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తూ మణికొండ గార్డెన్‌లో భార్య రోజా(29)తో కలిసి నివాసం ఉంటున్నాడు. రోజా అనారోగ్యానికి గురైంది.  భర్త సరిగ్గా పట్టించుకోకపోవడంతో అక్క భర్త అయిన పుప్పాలగూడలో ఉండే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి సభావత్‌ లక్‌పతి అలియాస్‌ లక్కీ(34) మందులు ఇప్పించి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా వివాహేతర సంబంధం ఏర్పడింది. తరచుగా రోజా కోసం ఇంటికి వస్తుండటంతో రోజా, రాగ్యానాయక్‌ మధ్య గొడవలు జరిగేవి.

కొద్ది నెలల క్రితం రాగ్యానాయక్‌కు చెందిన 25 గుంటల స్థలాన్ని రూ.15 లక్షలకు లక్‌పతి కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్‌ చేయాలని అడగగా మరో రూ.10 లక్షలు డిమాండ్‌ చేశాడు. లావు తండాలో మే 23 పండుగ కోసం వచ్చిన లక్‌పతి రోజాతో ఓ గదిలో ఉండటం గమనించిన రాగ్యానాయక్‌ బంధువుల సమక్షంలోనే గొడవకు దిగాడు. కొన్న స్థలానికి  పది లక్షలు ఎక్కువగా అడగడం, తమకు అడ్డుగా ఉన్నాడని భావించి హత్య చేసేందుకు పథకం పన్నాడు. అందుకు రోజా కూడా అంగీకరించింది. దీంతో లక్‌పతి డబ్బులు ఇస్తానని నమ్మించి ఆగస్టు 19న  షేక్‌ పేట్‌లోని భారత్‌ పెట్రోల్‌ బంక్‌ వద్దకు రావాలని రాగ్యానాయక్‌కు వేరే ఫోన్‌తో ఫోన్‌ చేశారు. 

నిద్రమాత్రలు కలిపి..
అక్కడికి రాగానే పది వేలు ఇచ్చి నాగార్జున సాగర్‌ వైజాగ్‌ కాలనీకి వెళితే మిగతా డబ్బు ఇస్తానని చెప్పాడు. బాచుపల్లిలో నివాసం ఉండె టీఎంఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో మార్కెటింగ్‌ మేనేజర్‌ చెన్నుపల్లి వెంకట శివ నాగ మల్లేశ్వర్‌ రావు(30)తో కలిసి ముగ్గురూ కారులో వెళ్లారు. అలకాపురిలోని విజేత సూపర్‌ మార్కెట్‌లో బాధం మిల్క్‌ షేక్‌ బాటిళ్లు కొనుగోలు చేశారు. ఒక బాటిల్‌లో నిద్ర మాత్రలు పొడిచేసి కలిపారు. ఇబ్రాహీంపట్నం వెళ్లిన తరువాత ఎగ్‌పఫ్‌లు కొనుగోలు చేశారు. కొద్ది దూరం వెళ్లిన తరువాత కారు ఆపి అందరూ కలిసి  తిన్నారు. నిద్ర మాత్రలు కలిపిన బాదం మిల్‌్కషేక్‌ను రాగ్యానాయక్‌కు ఇచ్చారు.  తాగిన 15 నిమిషాల లోపు అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. నల్గొండ జిల్లాకు చెందిన చేపల వ్యాపారి పత్లావత్‌ మాన్‌సింగ్‌(32), వంకునావత్‌ బాలోజీ (23)లను రెడీగా ఉండాలని చెప్పారు. అపస్మారక స్థితిలో ఉన్న రాగ్యానాయక్‌ కాళ్లు, చేతులు కట్టి, బండ రాళ్లు ఉంచి చేపల వలలో చుట్టారు.

అనంతరం పడవలో వేసుకొని కృష్ణా నది బ్యాక్‌ వాటర్‌లో దాదాపు పది కిలో మీటర్లు ప్రయాణం చేశారు. అక్కడ అందరు కలిసి రాగ్యానాయక్‌ను కృష్ణా నదిలో విసిరేశారు. షేక్‌పేట్‌లోని భారత్‌ పెట్రోల్‌బంక్‌ నుంచి బుగ్గ తండాకు వెళ్లే వరకు సీసీ పుటేజీలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. లక్‌పతి, రోజా,  చెన్నుపల్లి వెంకట శివ నాగ మల్లేశ్వర్‌ రావు, పత్లావత్‌ మాన్‌ సింగ్, వంకునావత్‌ బాలోజీలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.
చదవండి: ప్రకాష్‌ వ్యవహారంలో ‘లక్ష్మీ’ పాత్ర వివాదాస్పదం.. ట్విస్టులే ట్విస్టులు

మరిన్ని వార్తలు