ఇంటికి ఇంత.. ప్లాటుకు అంత.. అక్కడంతా 'రైటర్ల'రాజ్యం!

12 Apr, 2021 02:54 IST|Sakshi

రిజిస్ట్రేషన్లశాఖలో డాక్యుమెంట్‌ రైటర్ల దందా

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు సమీపంలో ‘దుకాణాలు’.. అంతా అనధికారికమే  

లైసెన్సు లేదు.. నియంత్రణ లేదు.. 

కార్యాలయ సిబ్బందితో కుమ్మక్కు!

ఆస్తుల విలువ, అవసరం ఆధారంగా వసూళ్లు

ఇబ్బందులున్నా అరగంటలో పని పూర్తి

నేరుగా ఆఫీసుకు వెళితే.. కొర్రీలతో ఆలస్యం

డాక్యుమెంట్‌ రైటర్లను ఆశ్రయిస్తున్న జనం

ఏటా వందల కోట్ల రూపాయలు జేబుల్లోకి..

రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రానికి చెందిన పి.మధుకర్‌రెడ్డి (పేరు మార్చాం) స్థానికంగా ఓ వెంచర్లో 300 గజాల ప్లాటు కొనుగోలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారం ప్లాటు విలువ రూ.1.20 లక్షలు. దాని రిజిస్ట్రేషన్‌ కోసం స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, యూజర్‌ చార్జీల రూపంలో రూ.8,800 చెల్లించాడు. అయితే రిజిస్ట్రేషన్‌ చేయించినందుకు మధ్యవర్తి (డాక్యుమెంట్‌ రైటర్‌)కి చెల్లించిన ఫీజు రూ.4,000. ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ కింద కట్టిన ఫీజుకు సగం అదనంగా మధ్యవర్తికి చెల్లించడం గమనార్హం. డాక్యుమెంట్‌ ప్రిపరేషన్, కార్యాలయంలోని వ్యవహారాన్ని చకచకా పూర్తి చేయించినందుకు ఈ మొత్తం చెల్లించాల్సి వచ్చింది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఏ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లినా ఎదురయ్యే పరిస్థితి ఇది. ఇండ్లు, ప్లాట్లు, భూముల రిజిస్ట్రేషన్లలో డాక్యు మెంట్‌ రైటర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతు న్నారు. సొమ్ము ముట్టజెపితే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సులువుగా, ఎలాంటి అవాంతరాల్లేకుండా జరిగిపోతుంది. ఏవైనా పేపర్లు లేకపోవడం, సాంకేతిక సమస్యలు, ఇతర ఇబ్బందులు ఉన్నా కూడా.. అరగంటలోనే ‘పని’ పూర్తవుతుంది.

కాకపోతే దీనికి మరికొంత ఎక్కువ చేతిలో పెట్టాల్సి వస్తుంది. అడిగినంత ఇవ్వకపోతే ఏదో ఓ కొర్రీతో రిజిస్ట్రేషన్లు ఆలస్యం కావడమో, ఒక్కోసారి మొత్తంగా ఆగిపోవడమో జరుగుతున్న పరిస్థితి ఉంది. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లోని సిబ్బందికీ ఇందులో భాగస్వామ్యం ఉందన్న ఆరోపణ లున్నాయి. దీనిపై కొనుగోలు/ అమ్మకందారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశోధన చేపట్టింది. పలు ప్రాంతాల్లోని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల వద్ద పరిస్థితిని నేరుగా పరిశీలించి.. ఏం జరుగుతోందన్నది గుర్తించింది. ఈ వివరాలతో ప్రత్యేక కథనం..

రైటర్లదే హవా!
ఎక్కడ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులకు వెళ్లినా.. అక్కడికి కొంత దూరంలో అటూఇటూ ఒకట్రెండు టేబుళ్లు, కంప్యూటర్లు పెట్టుకుని, ఐదారు కుర్చీలున్న చిన్న చిన్న షాపులు కనబడతాయి. పొద్దంతా ఏదో హడావుడి కనిపిస్తుంటుంది. చూడటానికి సింపుల్‌ గానే ఉన్నా ఇండ్లు, ఫ్లాట్లు, భూములు.. ఇలా ఏ రిజిస్ట్రేషన్లు జరగాలన్నా ఆ చిన్న దుకాణాలు, వాటిని నిర్వహించే డాక్యుమెంట్‌ రైటర్లే కీలకం.

ఒక్క మాటలో చెప్పాలంటే.. రిజిస్ట్రేషన్లు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో జరుగుతున్నా 90 శాతం పని ఈ డాక్యుమెంట్‌ రైటర్ల వద్దే అయిపోతుంది. ముందే అంతా ‘సెట్‌ రైట్‌’ అవుతుంది. ఆఫీసులోకి వెళ్లాక అంతా ఫటాఫట్‌గా పూర్తవుతుంది. నిబంధనల ప్రకారం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోకి కొనుగోలు/అమ్మకం దారులు, సాక్షులు మినహా ఇతర ప్రైవేటు వ్యక్తులు, డాక్యుమెంట్‌ రైటర్లను అనుమతించకూడదు. కానీ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్‌ సిబ్బంది కంటే.. ఈ ‘మధ్యవర్తుల’ హడావుడే ఎక్కువగా కనిపిస్తుంది.

అనధికారికంగానే అంతా..
నిజానికి డాక్యుమెంట్‌ రైటర్లకు ఎలాంటి లైసెన్సు లేదు. ఆ వ్యవస్థపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ కూడా లేదు. డాక్యుమెంట్‌ సిద్ధం చేయడం నుంచి, రిజిస్ట్రేషన్‌ పూర్తయి కాపీ బయటికి వచ్చేదాకా.. మొత్తం పని కొర్రీలు లేకుండా, త్వరగా పూర్తిచేస్తామంటూ ఈ డాక్యుమెంట్‌ రైటర్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. డాక్యుమెంట్‌ రెడీ చేసేందుకు కొంత, ఏ కొర్రీలూ రాకుండా పని అయిపోయేందుకు ఆఫీసులో ఇవ్వాల్సింది ఇంకొంత అంటూ వేలకువేలు తీసుకుంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తోన్న 141 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద సుమారు 2000 మంది వరకు డాక్యుమెంట్‌ రైటర్లు ఉన్నట్టు అంచనా. రిజిస్ట్రేషన్ల శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ అనధికార డాక్యుమెంట్‌ రైటర్ల వ్యవస్థకు స్వస్తి పలికి.. ప్రభుత్వ జవాబుదారీతనం ఉండేలా మరో వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చినా.. అది కార్యరూపంలోకి రావడం లేదు.

కరోనా తర్వాత మరింత దూకుడు
కరోనా ఎఫెక్ట్, లాక్‌డౌన్‌ తర్వాతి పరిస్థితుల్లో డాక్యుమెంట్‌ రైటర్లు వసూళ్లు మరింతగా పెంచారని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అప్పట్లో డాక్యుమెంట్‌కు ఇంత అని పక్కాగా డిమాండ్‌ చేసేవారు కాదని.. అవకాశం, అవసరం, చేయించాల్సిన పనిని బట్టి తీసుకునే వారని అంటున్నారు. ఇప్పుడు పక్కాగా డిమాండ్‌ చేసి, వసూలు చేస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ జరిగే ఆస్తుల విలువలో ఇంత శాతమని నిర్ణయించి వసూలు చేస్తున్న ఘటనలూ ఉన్నాయి.

ఏదో ఓ కొర్రీ పెడతారని..
రాష్ట్రంలోని పెద్ద సంఖ్యలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా వెళితేనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సులువుగా పూర్తవుతోందని.. ఇబ్బందులు తప్పని పరిస్థితి ఉందని ఆరోపణలున్నాయి. ఏవో సాంకేతిక సమస్యలున్నాయని, డాక్యుమెంట్లలో తప్పులున్నాయని చెబుతూ.. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల సిబ్బంది తిప్పుకుంటున్నారని అమ్మకం/కొనుగోలు దారులు చెప్తున్నారు.

డబ్బులన్నీ తామే తీసుకోవడం లేదని.. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కూడా ఇవ్వాల్సి ఉంటుందని కొందరు డాక్యుమెంట్‌ రైటర్లు బహిరంగంగానే అంటుండటం గమనార్హం. అయితే క్రయవిక్రయదారుల రూపంలో వస్తున్న సామాన్య ప్రజల విషయంలోనే రైటర్లు డాక్యుమెంట్‌ డీలింగ్‌ చేస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, వెంచర్ల నిర్వాహకులు, బడాబాబులు నేరుగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల సిబ్బందితోనే ‘మాట్లాడుకుని’ పని చక్కబెట్టుకుంటున్నారని అంటున్నారు.

కొత్త విధానం వచ్చినట్టే వచ్చి..
కరోనా తర్వాత రాష్ట్ర సర్కారు తెచ్చిన కొత్త రిజిస్ట్రేషన్‌ విధానంలో అసలు డాక్యుమెంట్‌ రైటర్ల అవసరమే లేకుండా పోయింది. కానీ కొన్ని కారణాలతో ప్రభుత్వం మళ్లీ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టింది. దీంతో రైటర్ల దందా మళ్లీ మొదలైంది. గతం కంటే ఎక్కువగా రేటు నిర్దేశించి మరీ తీసుకోవడం పెరిగింది. ఇలా వారు డిమాండ్‌ చేసి మరీ డబ్బులు తీసుకుంటున్నా.. స్థానిక సబ్‌ రిజిస్ట్రార్లు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. డాక్యుమెంట్‌ రైటర్లు వసూళ్లు చేసి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల సిబ్బందికి వాటా సొమ్ము ఇస్తున్నారని.. దీంతో రైటర్లను ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఏటా వందల కోట్లు జేబుల్లోకి..
రైటర్లు డాక్యుమెంట్‌ తయారు చేస్తామనే కారణం చూపెట్టి పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నారు. చూడటానికి ఒక్కో రిజిస్ట్రేషన్‌కు మూడు, నాలుగు వేల రూపాయలేగా అన్నట్టు ఉన్నా.. మొత్తంగా చూస్తే కోట్ల రూపాయల్లోకి వెళుతున్నాయి. ఉదాహరణకు.. ఈనెల 20న (శనివారం) రాష్ట్రవ్యాప్తంగా 5,500కుపైగా డాక్యుమెంట్లు రిజిస్టర్‌ అయ్యాయి. తక్కువలో తక్కువగా డాక్యుమెంట్‌కు రూ.1,000 చొప్పున లెక్కేసుకుంటే.. ఒక్కరోజు రైటర్లు వసూలు చేసింది రూ. 55 లక్షలు. నెలకు 15 కోట్లపైమాటే.. అదే ఏడాదికి లెక్కిస్తే రూ.180 కోట్లు. ఇది కేవలం నామమాత్రపు సొమ్ము మాత్రమే. నిజానికి అడ్డగోలుగా వసూలు చేస్తున్నది, రిజిస్ట్రేషన్‌ సిబ్బంది వాటా కింద వసూలు చేస్తున్నది కలిపితే.. రూ.వెయ్యి కోట్లకుపైనే అవుతుందని అంచనా. ఏటా ఇంత సొమ్ము దళారుల పాలవుతోంది.

ఎక్కడ చూసినా అదే దందా!
– రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన యాదగిరిగుట్ట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డాక్యుమెంట్‌ రైటర్లు పెద్ద ఎత్తున కమీషన్లు్ల వసూలు చేస్తున్నారు. వైటీడీఏ పరిధిలో ఉన్న ప్లాట్లకు సంబంధించి డాక్యుమెంట్‌ చార్జ్, చలానా, మ్యూటేషన్‌ కలిపి రూ.18,800 తీసుకుంటున్నారు. మిగతా ప్లాట్లకు కూడా రూ.15వేల దాకా తీసుకుంటున్నారు. డాక్యుమెంట్‌ తయారుచేయడం నుంచి రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యేదాకా తాము చూసుకుంటామని చెప్తున్నారు. నేరుగా సబ్‌ రిజిస్ట్రార్ల వద్దకు వెళితే.. ఏదో ఓ కొర్రీ పెడుతున్నారని, అక్కడి సిబ్బంది కూడా రూ.1,500 నుంచి రూ.2 వేలదాకా వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

– నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజుకు సగటున 40 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్‌ చేయించుకునే వ్యక్తుల వద్ద డాక్యుమెంట్‌ రైటర్లు తమ ఫీజు కింద రూ.1,000, రిజిస్ట్రేషన్‌ ఆఫీసులో ఇచ్చేందుకని మరో వెయ్యి, రెండు వేలదాకా వసూలు చేస్తున్నారు. పని త్వరగా పూర్తవుతుందని చెబుతున్నారు. వివాదాలున్న డాక్యుమెంట్లను రిజిస్టర్‌ చేసేందుకైతే.. రూ.5వేల నుంచి రూ.10వేల దాకా తీసుకుని ‘పని’ చక్కబెడుతున్నట్టు ఆరోపణలున్నాయి.

– సంగారెడ్డి జిల్లా పరిధిలోని సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట, నారాయణఖేడ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్‌ రైటర్లు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్లకు అయ్యే ఖర్చుపై అదనంగా ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు చెల్లించక తప్పని పరిస్థితి. వారు అడిగినంత ముట్టజెప్పకపోతే ఏదో ఓ లిటిగేషన్‌ పేరిట రిజిస్ట్రేషన్లు వాయిదా పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వివాదాలున్న ప్లాట్లు, ఇండ్ల రిజిస్ట్రేషన్ల కోసమైతే.. పది వేల వరకు ముట్టజెప్పాల్సిందే. ఇదంతా రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సిబ్బందికి వాటా ఇవ్వడం కోసమేనని రైటర్లు చెప్తుండటం గమనార్హం.

– రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ కోసం డాక్యుమెంట్‌ రైటర్లు రూ.2,500 దాకా వసూలు చేస్తున్నారు. ఇందులో రిజిస్ట్రేషన్‌ సిబ్బందికి సగం వాటా ఇవ్వాలని ఓపెన్‌గానే చెప్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఇక్కడ డబ్బుల వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు ఓ ప్రైవేట్‌ వ్యక్తిని పెట్టుకోవడం గమనార్హం.

– గిరిజనులు అధికంగా ఉండే మహబూబాబాద్‌ జిల్లాలో కూడా డాక్యుమెంట్‌ రైటర్ల దందా సాగుతోంది. ఇక్కడి ప్రజలకు పెద్దగా అవగాహన లేకపోవడంతో డాక్యుమెంట్‌ ప్రిపరేషన్‌ పేరుతో రూ.3–4 వేల వరకు తీసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్‌ సిబ్బందికి ఇవ్వాలంటూ మరికొంత వసూలు చేస్తున్నారు.
(చదవండి: వెంట్రుకలపై క్రేజ్‌: చైనాకు జుట్టు అక్రమ రవాణా)

మరిన్ని వార్తలు