3 వైన్స్‌లు.. 30 ‘బెల్ట్‌’లు: మామూళ్ల మత్తులో ఎక్సైజ్‌ శాఖ..

30 Jun, 2021 10:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లాలో అనధికారిక మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్క జిల్లా కేంద్రంలోని లైసెన్స్‌ వైన్‌ షాపుల నుంచే బెల్ట్‌ షాపులకు ప్రతినెలా కోట్ల రూపాయల విలువైన మద్యం తరలిపోతోంది. బెల్ట్‌ షాపుల నిర్వాహకులు అధిక ధరల కు మద్యం విక్రయిస్తూ వచ్చిన లాభాల్లో మద్యం షా పులు యజమానులకు వాటా పంచుతున్నారు. అనధికారిక విక్రయాలతో వచ్చే లాభం బాగుండడంతో వైన్‌ షాపుల యజమానులు కూడా బెల్ట్‌ షాపులను మరింత ప్రోత్సహిస్తున్నారు. దీంతో అనధికారిక దందా మూడు వైన్‌ షాపులు.. ముప్పై బెల్ట్‌ షాపులు అన్న చందంగా సాగుతోంది.  

ఆదిలాబాద్‌ పట్టణంలో తొమ్మిది లైసెన్స్‌ మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ షాపుల యజమానులంతా సిండికేటుగా ఏర్పడి అనధికారిక విక్రయాలను ప్రోత్సహిస్తున్నారు. ప్రతీనెల మూడు షాపుల నుంచి మద్యం పట్టణంతోపాటు, సమీపంలోని బెల్ట్‌ షాపులకు తరలించేలా ఒప్పందం చేసుకున్నారు. నెలకు ఒక్కో షాపు నుంచి రూ.75 లక్షల విలువైన మద్యాన్ని నేరుగా బెల్ట్‌ షాపులకే విక్రయిస్తున్నారు.

మూడు షాపుల నుంచి రూ.2.25 కోట్ల విలువైన సరుకు అనధికారిక విక్రయ షాపులకు తరలిస్తున్నా రు. ఈ మద్యాన్ని బెల్ట్‌ షాపుల నిర్వాహకులు అధిక ధరకు మందుబాబులకు విక్రయించి లాభాలు గడిస్తున్నారు. ఇందులో మద్యం షాపులకు వచ్చే వాటా ను తొమ్మిది షాపుల యజమానులు పంచుకుంటున్నారు. విక్రయాలు, లాభాలు, వాటా లెక్కల కోసం వీరు ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారంటే లాభాలు ఏమేరకు ఉన్నాయో ఊహించుకోవచ్చు. 

జిల్లాలో వెయ్యికిపైగా బెల్ట్‌ షాపులు.. 
బెల్ట్‌ షాపుల్లో మద్యం విక్రయాలు అనధికారికం. ఎక్సైజ్‌ అధికారుల భాషలో చెప్పాలంటే అన్‌ ఆథరైజ్డ్‌ ఔ ట్‌లెట్‌. ప్రభుత్వ లైసెన్స్‌ పొందిన వైన్స్‌లు, బార్లు మద్యం విక్రయిస్తుండగా.. ఈ వైన్స్‌ల నుంచి వచ్చే సరుకును బెల్ట్‌ షాపుల్లో విక్రయిస్తున్నారు. జిల్లాలో 31 మద్యం షాపులు ఉన్నాయి. వీటి ద్వారా మద్యం కొనుగోలు చేసి అనధికారికంగా విక్రయించే బెల్ట్‌ షాపులు మాత్రం వెయ్యి నుంచి 1,200 వరకు ఉన్నాయి.

వీటి నిర్వాహకులు 31 లైసెన్స్‌ మద్యం షాపుల నుంచి ఎమ్మార్పీ ధరకు మద్యం కొనుగోలు చేసి తీసుకెళ్లారు. అనధికారిక షాపుల్లో అధిక ధరతోపాటు, కల్తీ చేసి విక్రయిస్తున్నారు. మద్యం సీసాల మూతలు తెరిచి అందులోని మద్యం ఖాళీ సీసాలో కొంత తీసి, ఖాళీ అయిన మద్యం స్థానంలో నీళ్లు లేదా స్పిరిట్‌ కలుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కల్తీ మద్యాన్ని లూజ్‌గా విక్రయస్తున్నారు. దీంతో రెట్టింపు లాభాలు గడిస్తున్నారు. 

మామూళ్ల మత్తులో ఎక్సైజ్‌ శాఖ..
అనధికారిక మద్యం విక్రయ దందా జిల్లాలో జోరుగా సాగుతున్నా ఎక్సైజ్‌ శాఖ మాత్రం మామూళ్ల మత్తులో జోగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోనే సిండికేట్‌ దందా సాగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం విమర్శలకు బలం చేకూరుస్తోంది. అనధికారిక దందా, కొన్ని బ్రాడ్ల విక్రయాలు బహిరంగంగా జరుగుతున్నా ఎవరైనా ఫిర్యాదు చేస్తే ‘మా దృష్టికి రాలేదు.. తనిఖీలు చేస్తాం.. అక్రమ మద్యం విక్రయాలను అరికడతాం’ అని చెప్పి తప్పించుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. పత్రికల్లో, టీవీ చానెళ్లలో వార్తలు వచ్చినప్పుడు మాత్రం దాడుల పేరుతో రెండు మూడు రోజులు హడావుడి చేస్తారనే అపవాదు ఉంది.  

లాభాల కోసం ‘చీప్‌’ ట్రిక్స్‌..
జిల్లాలో మద్యం షాపుల యజమానులు అదనపు లాభాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొన్నిరకాల బ్రాండ్ల(ఎక్కువ కమీషన్‌ ఇచ్చే కంపెనీల) మద్యాన్ని మాత్రమే షాపుల్లో విక్రయిస్తున్నారు. తక్కువ కమీషన్‌ ఇచ్చే బ్రాండ్ల మద్యాన్ని అందుబాటులో ఉంచడం లేదు. ఓ బ్రాండ్‌ చీప్‌ లిక్కర్‌ మాత్రం బెల్ట్‌ షాపుల్లో విరివిగా లభిస్తుండడం ఇందుకు నిదర్శనం. దానికి పోటీగా ఉన్న మరో బ్రాండ్‌ లిక్కర్‌ ఇటు వైన్‌ షాపులు, అటు బెల్ట్‌ షాపుల్లో దొరకదు.

కమీషన్‌ రూపంలో లాభం పొందడమే కాకుండా అదే మద్యాన్ని బెల్ట్‌ షాపులకు సరఫరా చేస్తూ వారి నుంచి కూడా లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. కొన్ని మద్యం కంపెనీలు ఎమ్మార్పీపై ఇచ్చే కమీషన్‌తో పాటు ప్రతీ కాటన్‌పై అదనంగా కమీషన్‌ ఇస్తున్నాయి. మద్యం షాపుల యజమానులు అలాంటి బ్రాండ్ల మద్యాన్నే ఎక్కువగా ప్రమోట్‌ చేస్తున్నారు. తమ లాభాల కోసం ఇలాంటి ట్రిక్స్‌ చేయడంలో జిల్లాలోని మద్యం షాపుల యజమానులు సిద్ధహస్తులు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు