జనవరి 26 నుంచి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌

24 Jan, 2023 19:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలను చలి పులి గజ గజ వణికిస్తోంది. పలు చోట్ల ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు పడిపోతున్నాయి. రోజు రోజుకూ రాత్రి , పగలు తేడా లేకుండా దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొండ ప్రాంతాల్లో విపరీతమైన మంచు కురుస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వాసులకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 26 నుంచి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. సుమారు 11 డిగ్రీల సెంటిగ్రేడ్‌ కనిష్ట ఉష్ణోగ్రతకు పడిపోయే అవకాశం ఉందని తెలిపింది.

ఈ మేరకు హైదరాబాద్‌ వాసులకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఈ నెల 26 నుంచి విపరీతమైన పొగమంచు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే హైదరాబాద్‌లోని  సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, చార్మినార్‌, ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి, వంటి ఐదు జోన్లలో విపరితమైన మంచు కురిసే అవకాశ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

పొగమంచు వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున్న వాహనదారులను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతేనే ఉదయం వేళ బయటకు వెళ్లాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ వెల్లడించింది. 

(చదవండి: డెక్కన్‌ మాల్‌ కూల్చివేతకు జీహెచ్‌ఎంసీ గ్రీన్‌ సిగ్నల్‌)

మరిన్ని వార్తలు