బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం

14 Sep, 2021 07:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో కొన సాగుతున్న వాయుగుండం సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తీవ్ర వాయుగుండం రానున్న 48 గంటల్లో పశ్చిమ– వాయవ్య దిశగా ఉత్తర కోస్తా, ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ మీదుగా ప్రయాణించే అవకాశముందని తెలిపింది. వచ్చే 24 గంటల్లో తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశముందని పేర్కొంది. తీవ్ర వాయుగుండం, వాయు గుండం ప్రభావంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాల పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రానికి తక్కువ ఎత్తు నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని, నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతు న్నాయని, మేఘాల కదలికలను బట్టి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

చదవండి: గ్రేటర్‌ చెరువుల పరిరక్షణకు స్పెషల్‌ కమిషనర్‌: కేటీఆర్‌

మరిన్ని వార్తలు