కొలువుల పట్టిక తారుమారు!

13 Feb, 2024 02:14 IST|Sakshi

హారిజాంటల్‌ పద్ధతిలో మహిళా రిజర్వేషన్ల అమలు ఫలితం 

ఉద్యోగ నోటిఫికేషన్లలో పేర్కొన్న పోస్టుల క్రమంలో మహిళా రిజర్వేషన్‌ ఇక మాయం 

ప్రభుత్వ శాఖల నుంచి సవరణ ప్రతిపాదనలు కోరిన నియామక సంస్థలు 

కొత్త ప్రతిపాదనల తర్వాతే కొలువుల భర్తీ

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లలో కొలువుల పట్టిక తారుమారు కానుంది. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లలో నిర్దేశించిన పోస్టుల క్రమంలో మహిళా రిజర్వేషన్‌ మాయం కానుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా హారిజాంటల్‌ పద్ధతిలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో హారిజాంటల్‌ రిజర్వేషన్ల అమలుకు నియామక సంస్థలు కసరత్తు వేగవంతం చేశాయి. ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసి, ఉద్యోగాలను భర్తీ చేయని వాటిల్లో హారిజాంటల్‌ రిజర్వేషన్లతో ఉద్యోగాల భర్తీకి నియామక సంస్థలు సన్నద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఆయా ప్రభుత్వ శాఖలు సవరణ ప్రతిపాదనలు సమర్పించాలని సూచిస్తూ నియామక సంస్థలైన తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ)లు నోటీసులు ఇచ్చాయి. వీలైనంత వేగంగా పోస్టుల క్రమాన్ని మార్చి పంపించాలని స్పష్టం చేశాయి. 

ప్రభుత్వ శాఖలు ఉరుకులు, పరుగులు 
కొత్తగా ప్రతిపాదనలు సమర్పించిన తర్వాతే తదుపరి చర్యలకు దిగనున్నట్లు స్పష్టం చేయడంతో ప్రభుత్వ శాఖలు ఉరుకులు, పరుగులు పెడుతున్నాయి. గ్రూప్‌–1, గ్రూప్‌–2, గ్రూప్‌–3, గ్రూప్‌–4, గురుకుల కొలువులు, సంక్షేమ శాఖల్లో హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు, గురుకుల టీచర్‌ ఉద్యోగాలకు సంబంధించి సవరణ ప్రతిపాదనల తయారీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు అనుసరించిన వంద పాయింట్ల రోస్టర్‌ పట్టికలో మహిళలకు 33 1/3 శాతం పోస్టులను ఆయా వరుస క్రమంలో రిజర్వ్‌ చేసి (నిర్దిష్ట పాయింట్‌ కింద ఉన్న పోస్టును మహిళలకని ప్రత్యేకంగా మార్క్‌ చేసి) చూపించేవారు.

కానీ తాజా హారిజాంటల్‌ విధానంలో మహిళలకు ఎక్కడా పోస్టులను రిజర్వ్‌ చేయరు (ఎలాంటి మార్కింగ్‌ ఉండదు). భర్తీ సమయంలోనే ప్రతి మూడింటా ఒక్క పోస్టు ఫార్ములాతో నేరుగా నియామకాలు చేపడతారు. అందువల్ల సంబంధిత శాఖలన్నీ మహిళా రిజర్వేషన్‌తో కూడిన కొలువుల పట్టికను సవరించి కేవలం పోస్టుల వారీగా కొత్త పట్టిక తయారు చేసి నియామక సంస్థలకు సమర్పించాల్సి ఉంది. ఉదాహరణకు గతంలో ఓ శాఖలో పది ఉద్యోగాలకు సంబంధించి 3 పోస్టులను మహిళలకు రిజర్వ్‌ చేసి పంపినట్లైౖతే, తాజా నిబంధనల ప్రకారం ఆ రిజర్వేషన్‌ను తొలగించి పది పోస్టులను జనరల్‌కు కేటాయిస్తూ కొత్త పట్టిక తయారు చేయాలి. అయితే ఇక్కడ కమ్యూనిటీ రిజర్వేషన్లు మారవు. కేవలం మహిళలకు రిజర్వ్‌ చేసిన స్థానం సంబంధిత వర్గ జనరల్‌ కేటగిరీకి మారుస్తారు. ఇలా శాఖలన్నీ హారిజాంటల్‌ విధానంలో కొత్తగా ప్రతిపాదనలు సమర్పించిన తర్వాతే కొలువుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగనుంది.

whatsapp channel

మరిన్ని వార్తలు