భళా చిత్రం.. కళా యజ్ఞం!

1 Jan, 2023 02:04 IST|Sakshi
‘కళాయజ్ఞ’ ఆన్‌లైన్‌ చాలెంజ్‌లో కళాకారులు గీసిన చిత్రాలు

సోషల్‌ మీడియాలో ఆకట్టుకుంటున్న ‘ఆర్ట్‌ చాలెంజ్‌’ 

21 రోజుల పాటు 21 అంశాలపై చిత్రాలు 

పాల్గొంటున్న వందల మంది చిత్రకారులు 

ఇందులో వచ్చిన ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ పెడతామన్న నిర్వాహకులు 

సాక్షి, హైదరాబాద్‌:  అప్పుడే కుంచె పట్టడం మొదలుపెట్టినవారి నుంచి అలవోకగా కళాకృతులను సృష్టించే చిత్రకారులు. చూడగానే ఆకట్టుకునే, ఆలోచింపజేసే చిత్రాలు. ఓ సరికొత్త కళాయజ్ఞం. 21 రోజులపాటు రోజూ ఒక చిత్రాన్ని గీయాలంటూ ప్రముఖ చిత్రకారుడు యేలూరి శేషబ్రహ్మం ఇచ్చిన పిలుపునకు స్పందన ఇది.

దేశంలోనే తొలిసారిగా ఫేస్‌బుక్‌ వేదికగా డిసెంబర్‌ 11న మొదలైన ఈ ‘చాలెంజ్‌’శనివారం (31వ తేదీ)తో ముగిసింది. 400 మందికిపైగా చిత్రకారులు, వేలకొద్దీ చిత్రాలను గీసి ఈ ‘కళాయజ్ఞం’లో పాల్గొన్నారు. ఇందులో పదుల సంఖ్యలో విదేశీ చిత్రకారులూ ఉండటం గమనార్హం. 

ఆర్ట్‌ చాలెంజ్‌ లాంటిదే.. 
దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఈ ‘21 రోజుల కళాయజ్ఞ’.. సోషల్‌ మీడియా వేదికగా నడుస్తున్న పలు చాలెంజ్‌ల తరహాలో ఒక ఆర్ట్‌ చాలెంజ్‌ అని చెప్పొచ్చు. అయితే దాన్ని ‘కళాయజ్ఞ’గా పేర్కొనడంతో మరింత భారతీయతను సంతరించుకుంది. నిర్వాహకులు ముందే ప్రకటించిన 21 అంశాలలో రోజుకొక అంశం చొప్పున సింగిల్‌ కలర్‌ లేక మోనోక్రోమ్‌ విధానంలో 21 రోజుల పాటు చిత్రాలు గీయడమే దీని లక్ష్యం.

ప్రకటిత అంశాలన్నీ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, సామాన్య జనజీవన విధానాన్ని తెలిపేలా రూపొందించారు. దీనికోసం ‘ఫేస్‌బుక్‌’లో ప్రత్యేకంగా ఒక గ్రూపును ఏర్పాటు చేశారు. అప్పుడప్పుడే కుంచె పట్టిన చేతుల నుంచి కళాత్మకంగా కుంచెను నాట్యమాడించే వారి వరకు ప్రతిఒక్కరూ అద్భుత కళాఖండాలను సృష్టిస్తున్నారు.

ప్రొఫెషనల్‌ చిత్రకారులే కాక ఇల్లస్ట్రేటర్స్, కార్టూనిస్ట్‌లు, స్థపతులు, డిజైనర్లు ఇంకా అనేక రంగాలలో ఉండి అభిరుచితో చిత్రాలు గీసేవారు కూడా ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. డ్రాయింగ్స్, పెయింటింగ్స్, శాండ్‌ ఆర్ట్, ప్రింట్‌ మేకింగ్, గ్రానైట్‌ ఎచింగ్స్‌ ద్వారా కూడా చిత్రాలకు ప్రాణం పోస్తున్నారు. 

హైదరాబాద్‌లో చిత్ర ప్రదర్శన 
నిబంధనల మేరకు కళాయజ్ఞంలో పాల్గొన్న కళాకారుల నుంచి మంచి కౌశలం చూపిన 21 మందిని ఎంపిక చేయనున్నారు. జాతీయ స్థాయిలో పేరొందిన ప్రముఖ చిత్రకారులు ఐదుగురు న్యాయ నిర్ణేతలుగా ఉంటారు. ఎంపిక చేసిన అద్భుత చిత్రాలతో హైదరాబాద్‌లో 3 రోజులపాటు చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. కళాయజ్ఞంలో పూర్తిస్థాయిలో పాలుపంచుకోలేని ఔత్సాహిక కళాకారులకు గెస్ట్‌ ఆర్టిస్ట్‌గా కొన్ని చిత్రాలు గీసే అవకాశం కూడా కల్పిస్తున్నారు. 

అనూహ్య స్పందన వస్తోంది 
విదేశాలతో పోలిస్తే మన దగ్గర ఆర్ట్‌ చాలెంజ్‌లు అరుదు. అందుకే భారతీయ సంస్కృతి, సంప్రదాయాల థీమ్‌తో దీన్ని డిజైన్‌ చేశాం. పదుల సంఖ్యలో వస్తారనుకున్నాం. కానీ అనుకోని విధంగా భారీ స్పందన లభించింది. వందలాది మంది వర్క్స్‌ ఒకేరోజు చూసే అవకాశం కళాభిమానులకు కనువిందు చేస్తుంది. చిత్రకారులకు ఒక చక్కని సాధనలా కూడా ఉపకరిస్తుంది. ఇప్పటికే వేలాది చిత్రాలతో ఈ కార్యక్రమం కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వీటిని ’'BrahmamKalaYajna' ఫేస్‌బుక్‌ పేజీలో వీక్షించవచ్చు.     
–శేషబ్రహ్మం, ప్రముఖ చిత్రకారుడు  

మరిన్ని వార్తలు