దేశ వ్యతిరేకి ఆర్‌ఎస్‌ఎస్‌ 

8 Jan, 2022 04:06 IST|Sakshi
కార్యక్రమంలో డి.రాజా, చాడ వెంకట్‌ రెడ్డి

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా విమర్శ 

హైదరాబాద్‌లో ఏఐవైఎఫ్‌ 16వ జాతీయ మహాసభలు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: దేశ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ అసలైన దేశ వ్యతిరేకి అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. కేంద్రం రిమోట్‌ కంట్రోల్‌ తమ చేతిలో లేదని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారని, కానీ రిమోట్‌ అవసరం లేకుండా ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ నడుపుతోందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ అధికారంలో కొనసాగితే దేశాన్ని ఫాసిస్టు దేశంగా, మతరాజ్యంగా మార్చే ప్రమాదముందని హెచ్చరించారు.

బీజేపీ రాజ్‌ నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు యువత భగత్‌సింగ్, చేగువేరా లాంటి విప్లవ కిశోరాల్లాగా మారి పోరాడాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) 16వ జాతీయ మహాసభలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఖైరతాబాద్‌లో జరిగిన బహిరంగ సభకు రాజా ప్రత్యేక అతిథిగా హాజరై మాట్లాడారు.  

స్వాతంత్య్రోద్యమంలో ఎక్కడున్నాయ్‌?  
బ్రిటిష్‌ పాలనను కూలదోసేందుకు స్వాతంత్య్ర ఉద్యమంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు పోరాడారని రాజా గుర్తు చేశారు. ఇప్పుడు గొప్ప దేశభక్తులమని చెప్పుకునే ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు నాటి స్వాతంత్య్ర పోరాటంలో ఎక్కడ ఉన్నారని నిలదీశారు. బ్రిటిష్‌ వారితో చేతులు కలిపిన ఆర్‌ఎస్‌ఎస్‌కు అసలు దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాత్రే లేదన్నారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ బడా కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తున్నారని.. అచ్చే దిన్‌ అదానీ, అంబానీలకే వచ్చాయని విమర్శించారు.

ప్రభుత్వ రంగ సంస్థలన్నీ వారికే కట్టబెడుతున్నారని.. దేశ సంపద, ఆస్తులను ప్రైవేటీకరిస్తే ప్రజలకు ఏం మిగలుతుందని ప్రశ్నించారు. సభలో సీపీఐ రాజ్యసభ సభ్యులు బినొయ్‌ విశ్వం, మాజీ ఎంపీ సయ్యద్‌ అజీజ్‌ పాషా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హాజరయ్యారు.  

మరిన్ని వార్తలు