మళ్లీ ‘భువికి’ రామానుజులు!

13 Jan, 2022 05:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  జాతులు.. వర్గాలు.. ఆడ.. మగ.. మనిషి.. జంతువు.. అంతా సమానమే.. పరమాత్మ దృష్టి అన్నీ ఒకటే అంటూ సమానత్వాన్ని చాటిన సమతా మూర్తి శ్రీరామానుజాచార్యులు మరోసారి మనముందు వెలుస్తున్నారు. ఓవైపు భారీ రామానుజుడి విగ్రహం.. మరోవైపు ఆధ్యాత్మిక పరిమళాలు, సంభ్రమాశ్చర్యాలను కలిగించే సాంకేతిక విన్యాసాలు.. అబ్బురపరిచే రాతి శిల్పాలతో శ్రీరామానుజ సహస్రాబ్ధి ప్రాంగణం సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌ శివార్లలోని శంషాబాద్‌ శ్రీరామనగరంలో నిర్మించిన ఈ మహా ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెలా 2 నుంచి 14 వరకు ‘శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం’పేరిట ప్రారంభ వేడుకలు జరుగనున్నాయి.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పెద్ద సంఖ్యలో కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, పలు రంగాల ప్రముఖులు అందులో పాల్గొననున్నారు. 216 అడుగుల ఎత్తయిన రామానుజుల విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ప్రధాని ప్రారంభించనుండగా.. ప్రధాన మందిరంలో 120 కిలోల బంగారంతో రూపొందిన 54 అంగుళాల రామానుజుల నిత్యపూజామూర్తిని 13న రాష్ట్రప్రతి తొలి దర్శనంతో ప్రారంభిస్తారు. సీఎం కె.చంద్రశేఖరరావు ఈ వేడుకలను దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. 
ఎన్నో ప్రత్యేకతలతో.. 

♦    రామానుజుల ప్రాంగణం ఎన్నో ప్రత్యేకతలకు నెలవుగా నిలుస్తోంది. చినజీయర్‌ స్వామి చిరకాల వాంఛను నిజం చేస్తూ 2016లో దాదాపు రూ.వెయ్యి కోట్లతో ఈ ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర నిర్మాణ శైలులను మేళవించి 2,700 శిల్పులు ఈ రాతి కట్టడాన్ని సిద్ధం చేశారు. 
♦    ప్రపంచంలోనే కూర్చున్న భంగిమలో ఉన్న అతి ఎత్తయిన లోహ విగ్రహంగా శ్రీరామానుజుల విగ్రహం నిలవనుంది. ఇందులో పద్మాసనంలో ఉన్న రామానుజుల విగ్రహం 108 అడుగులుండగా.. దిగువన భద్రవేదిక 54 అడుగులు, పద్మపీఠం 27 అడుగులు, స్వామి చేతిలోని త్రిదండం 27 అడుగుల ఎత్తు ఉన్నాయి. స్వామివారి పాదుకలతో ఉండే శఠారి 18 అడుగులు ఉంది. ఈ లోహ విగ్రహం బరువు 1,800 టన్నులు. దీన్ని చైనాకు చెందిన ఏరోసన్‌ కార్పొరేషన్‌ సంస్థ ఆధ్వర్యంలో.. చినజీయర్‌ స్వామి సూచనల ప్రకారం రూపొందించారు. 200 మం ది చైనా నిపుణులు 9 నెలల పాటు శ్రమించి.. 1,600 భాగాలుగా విగ్రహాన్ని తయారు (క్యాస్టింగ్‌)‡ చేశారు. వాటిని ఇండియాకు తీసుకొచ్చాక 60మంది చైనా నిపుణులు కలిపి తుదిరూపు ఇచ్చారు. వాతావరణంలో ఏర్పడే మార్పులు, పరిణామాలను తట్టుకుని వెయ్యేళ్లు నిలిచేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 
108 పుణ్యక్షేత్రాల దర్శన అనుభూతితో.. 
♦   ఈ క్షేత్రంలో రామానుజుల మహా విగ్రహం చుట్టూ.. శ్రీవైష్ణవంలో దివ్యదేశాలుగా భావించే 108 పుణ్యక్షేత్రాల గర్భాలయాల ఆకృతిలో 108 ఆలయాలను నిర్మించారు. శ్రీరంగం, తిరుమల, కంచి, అహోబిలం, భద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, కుంభకోణం.. ఇలా ప్రధాన వైష్ణవాలయాలు ఇందులో ఉన్నాయి. వీటిని అనుసంధానిస్తూ మధ్యలో 468 స్తంభాలతో భారీ దివ్యదేశ మండపాన్ని నిర్మించారు. 
♦    ఈ క్షేత్రంలో ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించగానే ఎదురుగా 45 అడుగుల ఎత్తుతో ఉండే డైనమిక్‌ ఫౌంటెయిన్‌ స్వాగతం పలుకుతుంది. అష్టదశ పద్మాకృతిలో ఉండే ఈ ఫౌంటెయిన్‌లో పద్మపత్రాలు విచ్చుకునేలా ఏర్పాటు చేశారు. ఎనిమిది రకాల జీవరాశులు నీటిని విరజిమ్ముతుండగా.. పద్మపత్రాల మధ్య నుంచి రామానుజుల ఆకృతిపైకి వచ్చి అభిషేకం జరుగుతున్న భావన కలుగుతుంది. అదే సమయంలో రామానుజుల కీర్తనలు శ్రావ్యంగా వినిపిస్తుంటాయి.

♦ రామానుజుల సమతామూర్తి, పక్కనే ఉన్న ఫౌంటెయిన్, ఇతర భవనాలపైన కనువిందు చేసేలా.. ప్రత్యేక కాంతిపుంజాల విన్యాసాలతో జరిగే ఏఆర్‌ (అగుమెంటెడ్‌ రియాలిటీ) షో మంత్రముగ్ధులను చేస్తుంది. రోజూ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత 18 నిమిషాల పాటు ఈ 3డీ షో నిర్వహిస్తారు. ఇందులో రామానుజులు ప్రబోధించిన సమానత్వాన్ని చాటే ఘట్టాలు కనివిందు చేస్తాయి. ఏకకాలంలో 3,600 మంది తిలకించొచ్చు. ఇక రెండు లక్షల మొక్కలతో ఉద్యానవనాన్ని తీర్చిదిద్దుతున్నారు. 

మరిన్ని వార్తలు