వాడిన పూలే.. సువాసనలు వెదజల్లునే..

19 Sep, 2022 03:26 IST|Sakshi
ఆరబెట్టిన పూలను పరిశీలిస్తున్న మహిళలు

తిరుమల తరహాలో అగరుబత్తుల తయారీ

యాదాద్రీశుడికి వినియోగించిన పూలతోనే.. 

పైలట్‌ ప్రాజెక్టుగా యాదగిరిగుట్ట ఎంపిక 

యాదగిరిగుట్ట: తిరుమలలో మాదిరిగానే యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ స్వామి, అమ్మవారికి వినియోగించిన పూలతో అగరుబత్తులను తయారు చేయనున్నారు. ఈ మేరకు యాదగిరిగుట్టలో పరిశ్రమ ఏర్పాటుకు అధికారులు సన్నాహా­లు చేస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు లక్నోలోని సెం­ట­ర్‌ ఫర్‌ మెడిసినల్‌ అండ్‌ అరోమాటిక్‌ ప్లాంట్స్‌ (సీ­మ్యాప్‌), సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్స్‌ కౌన్సిల్‌(సీఎస్‌ఐఆర్‌) సంస్థల సహకారం తీసుకోనున్నారు.

ఇటీవల యాదాద్రి ఆలయ అధికారులతో రాష్ట్ర మున్సిపల్‌ శాఖ, యాదగిరిగుట్ట మున్సిపల్‌ అధికారులు చర్చించారు. యాదగిరిగుట్ట, ధర్మపురి, వేములవాడలో ఈ తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి యాదగిరిగుట్టను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అగరుబత్తుల తయారీకి ఇప్పటికే స్వ­యం సహాయక సంఘాల సభ్యులకు, సిబ్బందికి శిక్షణనిచ్చారు. యాదగిరిగుట్టలో ప్రస్తుతం శాంపిల్‌గా చేతులతో అగరుబత్తులను తయారు చేస్తున్నారు. 

తయారీ విధానమిదే..
రోజూ ఆలయంలో వాడిన పూలను మున్సిపల్‌ సిబ్బంది మహిళా సంఘాల సభ్యులకు అందజేస్తారు. ఈ పూలను వేరుచేసి నీడలో ఆరబెడతారు. అనంతరం ఒక్కోరకం పువ్వులను వేర్వేరుగా యంత్రంలో వేసి పౌడర్‌ తయారు చేస్తారు. పువ్వు పౌడర్, జిగట్‌ పౌడర్‌ను కలుపుతారు. దాన్ని సన్నని స్టిక్స్‌కు పెట్టి రోల్‌ చేస్తారు.

ఆరబెట్టాక సువాసన వెదజల్లేలా తులసీపత్రాల నూనెను అగరుబత్తులకు అద్దుతారు. కిలోపువ్వుల పౌడర్‌తో 2,500 అగరుబత్తులు తయారవుతాయి. ప్రస్తుతం ఆలయం నుంచి రోజూ 6 నుంచి 8 కిలోల వరకు పూలు వస్తున్నాయి. పట్టణంలో 2,700 మంది మహిళాస్వయం సహాయక సంఘాల సభ్యులున్నారు. వీరితో అగరుబత్తులు తయారు చేయించి, వారినే సొంతంగా మార్కెటింగ్‌ చేసుకునేలా వీలు కల్పించనున్నారు.  

మహిళల ఉపాధికి శిక్షణ  
వాడిన పూలతో అగరుబత్తుల తయారీకి మహిళాసంఘాల సభ్యులకు మొ­ద­­టి విడత శిక్షణ పూర్తయింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఈ బాధ్యత తీసుకుంది.  
– శ్రవణ్‌ కుమార్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌

యాదాద్రి బ్రాండ్‌ పేరిట అమ్మకాలు 
పూలతో తయారు చేసిన అగరుబత్తులను భక్తులు స్థానిక దుకాణాల్లో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం. యాదాద్రి బ్రాండ్‌ పేరుతో అమ్మకాలు చేపడతాం. 
– ఎరుకల సుధాహేమేందర్‌ గౌడ్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌   

మరిన్ని వార్తలు