రూ.30 లక్షల బిల్లులు రాక.. ఇన్‌చార్జ్‌ సర్పంచ్‌ భిక్షాటన

20 Dec, 2022 08:06 IST|Sakshi

కౌడిపల్లి (నర్సాపూర్‌): గ్రామాభివృద్ధి కోసం చేసిన పనులకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో ఓ ఇన్‌చార్జి సర్పంచ్‌ భిక్షాటన చేశారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెల్మకన్నలో సోమవారం చోటు చేసుకుంది. వెల్మకన్న గ్రామ ఇన్‌చార్జ్‌ సర్పంచ్‌ కాజిపేట రాజేందర్‌ మాట్లాడుతూ.. గతేడాది మార్చి నుంచి సుమారు రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు చేశామన్నారు.

సీసీ రోడ్లు, మురికి కాల్వలు, క్రీడాప్రాంగణం, పారిశుధ్యం పనులు, హరితహారం, వీధి దీపాలు తదితర పనులు పూర్తి చేశామని తెలిపారు. అప్పులు తెచ్చి పనులు చేస్తే, ఇంత వరకు బిల్లులు రాలేదని, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చేసేది లేక గ్రామంలో పంచాయతీ కారి్మకులతో కలిసి భిక్షాటన చేస్తున్నట్లు తెలిపారు.

రెండున్నర నెలల క్రితం రూ.ఆరు లక్షలకు సంబంధించి ఎంబీలు పూర్తి చేయగా చెక్కులు ఇచ్చారని, అయినా డబ్బులు మాత్రం రాలేదని తెలిపారు. అధికారులను ఎన్నిసార్లు అడిగిన ఫ్రీజింగ్‌లో ఉందని, వచ్చాక ఇస్తామని చెబుతున్నారని అన్నారు.
చదవండి: కరీంనగర్‌లో వింతవ్యాధి కలకలం..! ఉన్నట్టుండి వాంతులు విరేచనాలు, ఆపై

మరిన్ని వార్తలు