ఆదాయం తగ్గింది.. అప్పులు పెరిగాయ్‌!

29 Jul, 2020 02:06 IST|Sakshi

కరోనా దెబ్బకు తారుమారైన ప్రభుత్వ ఆదాయ, వ్యయ గణాంకాలు

మూడొంతులు తగ్గిన పన్ను ఆదాయం.. 

అదే స్థాయిలో పెరిగిన రెవెన్యూ ఖర్చు

గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏప్రిల్‌ లెక్క ఇది
2019 ఏప్రిల్‌ పన్నుల రాబడి:    రూ.5,226 కోట్లు
ఈ ఏప్రిల్‌ లో వచ్చింది:            రూ.1,700 కోట్లు
గత ఏప్రిల్‌ రెవెన్యూ ఖర్చు:     రూ.1,585 కోట్లు
ఈ ఏడాది:                                 రూ. 4,602 కోట్లు 
2019 ఏప్రిల్‌ అప్పులు:             రూ.1,561 కోట్లు 
2020 ఏప్రిల్‌లో:                        రూ. 5,709 కోట్లు 
గత ఏప్రిల్‌ మొత్తం ఖర్చు:      రూ. 6,646 కోట్లు 
ఈ ఏప్రిల్‌ ఖర్చు:                      రూ.9,018 కోట్లు 

అన్ని ఆదాయ వనరులూ ’లాక్‌’
లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో అన్నిరకాల ఆదాయ వనరులూ మూసుకుపోయాయని ‘కాగ్‌’ ఈ ఏడాది ఏప్రిల్‌ నెలకు విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ప్రతినెలా రూ.500 కోట్లకు తగ్గని రిజిస్ట్రేషన్ల రాబడులు కేవలం రూ.20 కోట్లకు, అదే స్థాయిలో వచ్చే ఎక్సైజ్‌ ఆదాయం రూ.8 కోట్లకు పడిపోయిందంటే పరిస్థి తి అర్థం చేసుకోవచ్చు. జీఎస్టీ కింద గత ఏప్రిల్‌లో రూ.1,600 కోట్లు వస్తే అందులో సగం కూడా ఈ ఏప్రిల్‌లో రాలేదు. పెట్రోల్, డీజిల్, జీఎస్టీ పరిధిలోనికి రాని ఇతర అమ్మకాల ద్వారా వచ్చే అమ్మకపు పన్ను గత ఏప్రిల్‌తో పోలిస్తే రూ.1,200 కోట్లు తగ్గింది. మొత్తం మీద ఏప్రిల్‌–2019లో రూ.5,226 కోట్లు పన్న ఆదాయం రాగా, అదే 2020 ఏప్రిల్‌లో రూ.1,700.04 కోట్లే వచ్చాయి.

సాక్షి, హైదరాబాద్‌
కరోనా మహమ్మారి దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయ గణాంకాలు తారుమారైపోయాయి. కరోనా ప్రభావం బాగా ఉన్న 2020–21 ఆర్థిక సంవత్సరంలోని మొదటి నెల ఏప్రిల్‌–2020లో రాబడులు పూర్తిగా పడిపోగా, ఖర్చులు పెరిగిపోయాయి. అదే సాధారణ పరిస్థితులు నెలకొన్న ఏప్రిల్‌–2019లో మాత్రం ఆదాయం ఎక్కువగా, ఖర్చు తక్కువగా నమోదైంది.

ఇక అప్పులతో పాటు రెవెన్యూ పద్దు కింద అయిన ఖర్చుకు ఈ రెండు నెలల్లో పొంతనే లేదని గణాంకాలు చెబుతున్నాయి. సాధారణ పరిస్థితులు ఉన్న ఏప్రిల్‌–2019లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చిన మొత్తంలో మూడో వంతు మాత్రమే లాక్‌డౌన్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న ఏప్రిల్‌–2020లో ఖజానాకు సమకూరడం గమనార్హం. అప్పులు, గ్రాంట్లు ఆదుకున్నాయ్‌ ఆదాయం తగ్గిపోయిన పరిస్థితుల్లో ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో అప్పులు ఆదుకున్నాయి. కేంద్రం ఇచ్చే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కూడా కొంత గట్టెక్కించింది. గత ఏప్రిల్‌లో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద కేంద్రం నుంచి రూపాయి రాలేదు. కానీ ఈ ఏప్రిల్‌లో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.1,402 కోట్లు వచ్చాయి. అప్పుల విషయానికి వస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 5,700 కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది. 

ఖర్చు పెరిగింది... ఖాతా సమమైంది 
ఈ ఏడాది ఏప్రిల్‌లో పన్ను ఆదాయం తగ్గినా పద్దు మాత్రం పెరిగింది. అప్పులు అధికంగా తీసుకోవడంతో ఏప్రిల్‌–2020లో రాష్ట్ర ఖజానాకు రూ. 9,088.23 కోట్లు సమకూరాయి. అదే ఏప్రిల్‌–2019లో వచ్చింది రూ. 7,181.95 కోట్లు మాత్రమే. అయితే, గత ఏడాది ఏప్రిల్‌లో మొత్తం కలిపి రూ.6,646 కోట్లు ఖర్చు కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ. 9,018 కోట్లు ఖర్చయింది. మిగిలిన అన్ని ఖర్చులు ఈ రెండు నెలల్లో అటూ ఇటూ ఉండగా, రెవెన్యూ పద్దు కింద ఖర్చు మాత్రం భారీగా పెరిగింది. నెలవారీ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ కార్యకలాపాలకు ఈ పద్దు కిందే ఖర్చు జరుగుతుంది. ఈ పద్దు కింద గత ఏప్రిల్‌లో రూ. 1,585 కోట్లు ఖర్చయింది. కానీ ఈ ఏప్రిల్‌ లో మాత్రం రూ.4,602 కోట్లు ప్రభుత్వం వెచ్చించినట్టు కాగ్‌ లెక్కలు వెల్లడిస్తున్నాయి. కాగా, గత ఏడాదితో పోలిస్తే పెరిగిన దాదాపు రూ. 3 వేల కోట్ల రెవెన్యూ ఖర్చు కరోనా వైరస్‌ నియంత్రణ, వైద్య ఖర్చుల కోసం చేసినవేనని ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది.

2019, 20 ఏప్రిల్‌ నెలల్లో తెలంగాణ ప్రభుత్వ రాబడులు ఇవి:
ఆదాయ వనరు  2019  2020 (రూ. కోట్లలో)
జీఎస్టీ  1573.95  776.75
రిజిస్ట్రేషన్లు 525.94 21.40
ఎక్సైజ్  575.59     8.09
సేల్స్‌ ట్యాక్స్ 1,399.81 193.87
కేంద్ర పన్నుల్లో వాటా  762.41  620.38
గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్ ––– 1,402.22
అప్పులు 1,561.73 5,709.23
పన్నేతర ఆదాయం 388.30 275.36
ఇతర ఆదాయం 389.13  79.54
మొత్తం          7,181.95 9,088.23

       
            

2019, 20 ఏప్రిల్‌ నెలల్లో తెలంగాణ ప్రభుత్వ ఖర్చులు ఇవి:
ఖర్చు పద్దు 2019 2020 (రూ. కోట్లలో)
రెవెన్యూ 1,585.73  4,602.80
వడ్డీ చెల్లింపులు 760.98 1109.71
జీతాలు 1,896.39 1,580.39
పింఛన్లు 917.73 444.45
సబ్సిడీలు 317.92 819.22
మొత్తం 6,646.01 9,108.74

మరిన్ని వార్తలు