IND VS AUS 3rd T20 Tickets: జింఖానా గ్రౌండ్‌ వద్ద తొక్కిసలాట.. ఏడుగురికి గాయాలు

23 Sep, 2022 03:43 IST|Sakshi

మరికొందరికి స్వల్పగాయాలు 

ఊపిరాడక ఇబ్బందిపడిన క్రికెట్‌ అభిమానులు 

కింద పడిపోవడంతో కాళ్ల కింద నలిగిన కొందరు  

భారత్‌–ఆస్ట్రేలియా టీ20 కోసం టికెట్లు విక్రయించిన హెచ్‌సీఏ 

కి.మీ. పొడవు క్యూలైన్లలో ఫ్యాన్స్‌.. వర్షం రావడంతో పరుగులు 

అదుపు తప్పిన పరిస్థితి.. పోలీసుల లాఠీచార్జి

హెచ్‌సీఏ వైఫల్యం కారణమనే విమర్శలు

అజారుద్దీన్‌ సహా నిర్వాహకులపై 3 కేసులు! 

సాక్షి, హైదరాబాద్‌/ రాంగోపాల్‌పేట్‌: గురువారం ఉదయం 11.30 గంటల ప్రాంతం. ఒక్కసారిగా వర్షం. జింఖానా గ్రౌండ్స్‌ వద్ద అప్పటివరకు కిలోమీటర్‌ పొడవు క్యూ లైన్లలో ఉన్నవారు, చుట్టుపక్కల ఉన్నవారు ఒకేసారి మైదానం ప్రధాన గేటు వైపు దూసుకువచ్చారు. లోపలకు వెళ్లడానికి ప్రయత్నించారు. ఫలితం.. తీవ్రమైన తొక్కిసలాట. ఊపిరే అందని పరిస్థితి. కొందరు కింద పడిపోయారు. కాళ్ల కింద నలిగిపోయారు.

గుమిగూడిన వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఈ క్రమంలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు గాయపడ్డారు. మరికొందరికి స్వల్పగాయాలయ్యా­యి. ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం జరిగే భారత్‌–ఆ్రస్టేలియా టీ20 క్రికెట్‌ మ్యాచ్‌ కోసం జింఖానా మైదానంలో నేరుగా (ఆఫ్‌లైన్‌) టికెట్లు విక్రయించాలని నిర్ణయించిన హెచ్‌సీఏ ఆ మేరకు సరైన ఏర్పాట్లు, బందోబస్తు చేయలేదని, అభిమానులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.   

మూడేళ్ల తర్వాత మ్యాచ్‌తో.. 
మూడేళ్ల విరామం తర్వాత హైదరాబాద్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. బుధవారం వరకు ఆన్‌లైన్‌లోనే టికెట్ల అమ్మకాలు అంటూ చెప్పిన హెచ్‌సీఏ.. గురువారం మాత్రం కౌంటర్‌ ద్వారా టికెట్లు అమ్మాలని నిర్ణయించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మకాలు జరుగుతాయని ప్రకటించింది. మైదానంలోని హెచ్‌సీఏ కార్యాలయానికి దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్న ప్రధాన గేట్‌ వద్ద కుడివైపు పురుషులు, ఎడమవైపు మహిళలకు లైన్లు కేటాయించారు.

గేటు దాటి లోపలకు వచ్చిన తర్వాత మాత్రం ఒకే లైన్‌లో టిక్కెట్‌ కౌంటర్‌ వరకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టికెట్ల కోసం బుధవారం రాత్రి నుంచే అభిమానులు గ్రౌండ్స్‌ వద్దకు చేరుకోవడం ప్రారంభించారు. గురువారం తెల్లవారుజాముకే వీరి సంఖ్య పది వేలు దాటింది. ఒక్కోటి దాదాపు కి.మీ. మేర క్యూలైన్లు ఏర్పడ్డాయి. ప్రధాన గేట్‌ను మూసి ఉంచిన పోలీసులు విడతల వారీగా కొందరి చొప్పున లోపలి క్యూ లైన్‌లోకి పంపిస్తున్నారు. 

వర్షంతో పరుగులు 
ఉదయం 11.30 గంటల ప్రాంతంలో వర్షం కురిసింది. దీంతో తలదాచుకునేందుకు మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్‌లకు ఇదే గేటు కావడంతో లోపల నుంచి వచ్చే వారి కోసం పోలీసులు కొద్దిగా దాన్ని తెరిచారు. అదే సమయంలో బయట ఉన్న దాదాపు 1,000 మంది ఒకేసారి లోపలకు దూసుకురావడానికి ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. పోలీసులు అదుపు చేయలేకపోవడంతో ముందు వరుసల్లో ఉన్న వాళ్లు కింద పడిపోయారు. అదే అదనుగా కొందరు పోకిరీలు.. మహిళలు, యువతులపై పడుతూ అసభ్యంగా ప్రవర్తించారు.

ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జీకి దిగారు. తొక్కిసలాట, లాఠీచార్జిలో ఒక కానిస్టేబుల్, ఒక అగ్నిమాపక సిబ్బందితో పాటు ఏడుగురికి గాయాలయ్యాయి. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఉదంతంతో గ్రౌండ్స్‌ వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. టిక్కెట్ల విక్రయానికి మరో కౌంటర్‌ ఏర్పాటు చేయించారు. సాయంత్రం టిక్కెట్ల విక్రయం పూర్తయ్యే వరకు భారీ బందోబçస్తు ఏర్పాటు చేశారు. లాఠీచార్జీ తర్వాత బయట ఉన్నవారిని పోలీసులు పంపేయగా.. సాయంత్రం వరకు ఉండి టిక్కెట్ల దొరకని వారు నిరసనకు ప్రయత్నించడంతో అధికారులు నచ్చజెప్పి పంపేశారు.  

యశోద ఆస్పత్రిలో చికిత్స 
 తొక్కిసలాటలో గాయపడిన ఏడుగురిని సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో జింఖానా మైదానంలో స్వీపర్‌గా పనిచేసే బోరబండకు చెందిన రంజిత, బేగంపేట పోలీస్‌ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ శ్రీకాంత్, కవాడీగూడకు చెందిన విద్యార్థి ఆదిత్యనాథ్, తిరుమలగిరి ఇందిరానగర్‌కు చెందిన విద్యారి్థని సయ్యదా ఆలియా, కొంపల్లి బహుదూర్‌పల్లికి చెందిన సాయి కిశోర్, సికింద్రాబాద్‌ కంట్రోల్‌ రూమ్‌కు చెందిన అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్‌ శ్రీనాథ్‌ యాదవ్, కేపీహెచ్‌బీ (జేఎన్‌టీయూ)కి చెందిన సుజాత ఉన్నారు. వీరిలో సాయి కిశోర్, సుజాతలను ప్రా£ýథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ చేశామని, చికిత్స పొందుతున్న వారు కోలుకుంటున్నారని ఆస్పత్రి వైద్యులు చెప్పారు.  

బాధితుల ఫిర్యాదుతో మూడు కేసులు 
 హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌తో పాటు నిర్వాహకులపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. జింఖానా వద్ద జరిగిన తొక్కిసలాటకు  హెచ్‌సీఏ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని చికిత్స పొందుతున్న వారు ఫిర్యాదు చేయడంతో, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌తో పాటు నిర్వాహకులపై బేగంపేట పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌ యాక్ట్, 420,  21,22/76 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. టికెట్లు బ్లాక్‌లో అమ్ముకున్నట్లు ఫిర్యాదులందాయి.  హెచ్‌సీఏ నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని, వారిపై చర్యలు ఉంటాయని, నోటీసులు జారీ చేస్తామని అదనపు సీపీ (శాంతిభద్రతలు) డీఎస్‌ చౌహాన్‌ చెప్పారు. 
 
కనీస ఏర్పాట్లు లేకపోవడం వల్లే.. 
ఉప్పల్‌ స్టేడియం సామర్థ్యం సుమారు 39,800లో అన్నిరకాల పాస్‌ల సంఖ్య 20 శాతానికి మించదు. మిగిలిన వాటిని ప్రేక్షకులకు అందుబాటులో ఉంచే విషయంలో హెచ్‌సీఏలో నెలకొన్న గందరగోళం తాజా పరిస్థితికి దారి తీసినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లోనా లేక ఆఫ్‌లైన్‌లోనా అనే విషయంలో బుధవారం వరకు స్పష్టత లేకుండా పోయింది. హెచ్‌సీఏలో చాలా కాలంగా ఉన్న విభేదాల కారణంగా గతంలో టికెట్ల విషయంలో కీలకంగా, చురుగ్గా వ్యవహరించినవారు అధ్యక్షుడు అజారుద్దీన్‌కు సహకరించలేదని సమాచారం.

దీంతో ఆయన పూర్తిగా దిగువ స్థాయి ఉద్యోగులపై ఆధారపడ్డారు. బుధవారం జింఖానా మైదానం వద్దకు ఫ్యాన్స్‌ పెద్దసంఖ్యలో వచ్చి హడావుడి చేసిన నేపథ్యంలో.. ఆఫ్‌లైన్‌లో టికెట్లు అమ్ముదామని అజహర్‌ చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద కనీస ఏర్పాట్లు, బందోబస్తు లేకపోవడం, వర్షం నేపథ్యంలో తొక్కిసలాట జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

మ్యాచ్‌ నిర్వహణ సులువు కాదు: అజారుద్దీన్‌ 
గురువారం చోటు చేసుకున్న ఘటనలో తన తప్పేమీ లేదని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ చెప్పారు. క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహణ అంత సులువు కాదని పేర్కొన్నారు. పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అనుకోని ఘటనలు జరిగినప్పుడు ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. ఘటనపై ప్రభుత్వానికి నివేదిక సమరి్పస్తామని, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మ్యాచ్‌ల నిర్వహణ ఉంటుందని చెప్పారు. అందరం క్రికెట్‌ అభివృద్ధి కోసమే కష్టపడుతున్నామని అన్నారు. మ్యాచ్‌ టికెట్లు అన్నీ అమ్ముడుబోయినట్లు తెలిపారు. 

తెలంగాణ ప్రతిష్టకు భంగం కలిగితే సహించం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 
క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్ల విక్రయం సందర్భంగా జింఖానా గ్రౌండ్స్‌ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో టీ20 క్రికెట్‌ మ్యాచ్‌ ఏర్పాట్లపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర పేరు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. దళారులు టికెట్లు అమ్మే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

హెచ్‌సీఏ పాలకమండలి ఏకపక్షంగా వ్యవహరించకుండా ప్రభుత్వ సహకారాన్ని కోరిఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని మంత్రి చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 25న జరిగే మ్యాచ్‌ను విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేసి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని విజ్ఞప్తి చేశారు. జింఖానా వద్ద గాయపడిన వారికి హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్యసేవలు అందజేస్తామన్నారు. సమావేశంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్, టీఎస్‌పీడీసీఎల్‌ ఎండీ రఘుమా రెడ్డి, జీహెచ్‌ఎంసీ, మెట్రో వాటర్‌ వర్క్స్‌ అధికారులు పాల్గొన్నారు. 

ఒక కౌంటర్‌ నుంచే టికెట్లు అమ్మారు 
నాలుగు కౌంటర్లు అని చెప్పినా డిజిటల్‌ పేమెంట్లు పని చేయలేదు. మధ్యాహ్నం వరకు ఒక కౌంటర్‌ నుంచే టికెట్లు అమ్మారు. మరో కౌంటర్‌ కేవలం పోలీసుల కోసమే కేటాయించినట్టుంది. చాలామంది అడ్డదారిలో అక్కడకు వెళ్లి కొనుక్కున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి వేచి చూసినా నాకు టికెట్‌ దొరకలేదు. 
– సాయి ప్రవీణ్, గాజులరామారం 

మరిన్ని వార్తలు