‘వర్క్‌ ఫ్రం హోం’ కోసం తెగ సెర్చింగ్‌!

9 Aug, 2020 08:14 IST|Sakshi

భారత్‌లోనే అత్యధికం.. కోవిడ్‌తో అనేక రంగాల్లో రిమోట్‌ వర్కింగ్‌కే మొగ్గు

ప్రధానంగా సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ, హెల్త్‌ కేర్, మార్కెటింగ్‌ రంగాల్లో పెరిగిన అవకాశాలు 

ఫిబ్రవరి నుంచి జూలై మధ్యలో ఆన్‌లైన్‌లో జరిపిన అన్ని సెర్చ్‌లపై ‘ఇండీడ్‌’ నివేదిక

సాక్షి, హైదరాబాద్ ‌: వర్క్‌ ఫ్రం హోం లేదా రిమోట్‌ వర్కింగ్‌.. ఇప్పుడు ఎవరు కలుసుకున్నా, ఫోన్లో పలకరించుకున్నా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆన్‌లైన్‌లోనూ అత్యధికంగా వీటి గురించే మనోళ్లు తెగ వెతికేస్తున్నారు. ఎంతగా అంటే గతంతో పోల్చితే 442 శాతమంతా..! ‘రిమోట్‌’, ‘వర్క్‌ ఫ్రం హోం’ఇంకా ఈ అర్థం వచ్చేలా పదాలతో ఇండియన్లు అధికంగా ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. గతంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఒకట్రెండు ఇతర రంగాల్లోని ఉన్నతోద్యోగులకు మాత్రమే అనువుగా అందుబాటులో ఉన్న ఇంటి నుంచి పని చేసే పద్ధతి కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు వివిధ రంగాల్లోని ఉద్యోగులకు కూడా విస్తరించింది.

ప్రస్తుత అనిశ్చితి ఎంతకాలం ఉంటుందో అంచనా వేయడం కష్టం కావడంతో తాత్కాలికంగా పరిమిత కాలానికైనా ఈ పని విధానానికి అనేక సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ‘వర్క్‌ ఫ్రం హోం’ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్‌లైన్‌లో సెర్చింగ్‌ 442 శాతం పెరిగినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే అత్యధికమని కూడా తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాల సంబంధిత సెర్చ్‌ ఇంజిన్‌ ‘ఇండీడ్‌’ప్లాట్‌ ఫాం ద్వారా సేకరించిన డేటా ఆధారంగా రూపొందించిన నివేదికలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. గత ఫిబ్రవరి నుంచి గత నెల జూలై మధ్యకాలంలో ఇంటి నుంచి చేసే ఉద్యోగాల కోసం భారతీయులు భారీ స్థాయిలో ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేసినట్టు ఈ అధ్యయనం తేల్చింది.

‘వర్క్‌ ఫ్రం హోం’పద్ధతి వల్ల మంచి ఫలితాలు రావడం, ఉత్పాదకత పెరగటం, ఉద్యోగులు కూడా క్రియాశీలంగా వ్యవహరిస్తుండటంతో కంపెనీల యజమానులు, సంస్థల ఉన్నతోద్యోగులు.. మరిన్ని అవకాశాలు పెంచుతున్నట్టుగా ఈ నివేదిక పేర్కొంది. దీంతో ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ, హెల్త్‌కేర్, మార్కెటింగ్‌ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరిగినట్టు, ముఖ్యంగా డెలివరీ పర్సన్లు, ఐటీ మేనేజర్లకు అవకాశాలు మరింతగా డిమాండ్‌ ఉన్నట్టుగా వెల్లడించింది.

జూలైలో కొన్ని రంగాల్లో కొత్త ప్రకటనలు
కరోనా వైరస్‌ వ్యాప్తి, కోవిడ్‌ మహమ్మారి విస్తరణ, ప్రభావం ఒక్కో రంగంపై ఒక్కో రకంగా పడింది. అయితే సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ, మెడికల్‌/డాక్టర్, మార్కెటింగ్‌ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా గత కొన్ని నెలలతో పోల్చితే ఇండియాలో జూలైలో కొన్ని రంగాల్లో ఉద్యోగాల కోసం కొత్త ప్రకటనలు పెరిగాయి. ఇదే ట్రెండ్‌ ఇకముందూ కొనసాగిన పక్షంలో ఇతర రంగాల్లోనూ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ‘ఇండీడ్‌’అంచనా వేస్తోంది. దీంతో పాటు పాత పద్ధతుల్లో కాకుండా వెబ్‌సైట్ల ద్వారానే ఎక్కువగా ‘జాబ్‌ పోస్టింగ్‌’లు పడతాయని పేర్కొంది. ఇటు వ్యక్తులు, సంస్థలు లక్ష్యంగా చేసుకుని సైబర్‌ దాడులూ పెరగటంతో ‘స్కిల్డ్‌ సైబర్‌ సెక్యూరిటీ ప్రొఫెషన్ల’కు డిమాండ్‌ అమాంతంగా పెరిగింది. దీంతో సైబర్‌ సెక్యూరిటీ ఆధారిత ఉద్యోగాల కోసం ప్రకటనలు కొంత పెరగ్గా, దీనికి సంబంధించిన సెర్చ్‌లు కూడా 30 శాతం పెరిగాయి.

మరిన్ని వార్తలు