సికింద్రాబాద్‌ మిలటరీ స్టేషన్‌ వద్ద హై అలర్ట్‌

12 Aug, 2021 13:57 IST|Sakshi
గోల్కొండ కోటలో పోలీస్‌ పరేడ్‌ రిహార్సల్స్‌

ఈ రూట్లో రహదారులు మూసివేత శుక్రవారం నుంచి సోమవారం వరకు అమలు

పంద్రాగస్టు వేడుకలకు పటిష్ట భద్రత: సీపీ అంజనీకుమార్‌ 

సాక్షి, హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కేంద్ర నిఘా వర్గాలు కొన్ని హెచ్చరికలు జారీ చేశాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న రక్షణాధికారులు సికింద్రాబాద్‌ మిలటరీ స్టేషన్‌ పరిధిలో హై అలర్ట్‌ ప్రకటించారు. ఈ మేరకు దాని పరిధిలో ఉన్న కంటోన్మెంట్‌ (డిఫెన్స్‌) రహదారుల్లోకి రాకపోకల్ని నియంత్రిస్తున్నారు.


ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ పరిధిలోని రోడ్లను శుక్రవారం రాత్రి 12 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు మూసేస్తున్నారు. ఈ సమయంలో సాధారణ వాహనాలను వాటిలోకి అనుమతించరు. ఈ మేరకు రక్షణ శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అసాంఘిక శక్తులకు అడ్డకట్ట వేసేలా తీసుకున్న ఈ చర్యలను సమర్థిస్తూ ప్రజలు తమకు సహకరించాలని అందులో కోరింది.   

పంద్రాగస్టు వేడుకలకు పటిష్ట భద్రత: సీపీ అంజనీకుమార్‌ 
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం గోల్కొండ కోటలో జరగనున్న పంద్రాగస్టు వేడుకలకు పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ బుధవారం పేర్కొన్నారు. వివిధ విభాగాలతో సమన్వయం ఏర్పాటు చేసుకుని పనిచేస్తున్నామని అన్నారు. ఎప్పటికప్పుడు రిహార్సల్స్‌ జరుగుతున్నాయని, బుధవారం జీహెచ్‌ఎంసీ, పోలీసు, ఆర్‌ అండ్‌ బీ అధికారులు ఫీల్డ్‌ విజిట్‌ చేశారని తెలిపారు. సాధారణ ప్రజలు సహా ఎవరికీ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని, కోట చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లి స్తామని అన్నారు.


మరోపక్క నగరంలో ఉన్న గస్తీ బృందాలకు సమకాలీన అంశాలపై ప్రత్యే క శిక్షణ ఇస్తున్నామని, ఈ స్పెషల్‌ డ్రైవ్‌ రెండు రోజుల క్రితం ప్రారంభమైందని సీపీ తెలిపారు. ఒక్కో బ్యాచ్‌లో 200 మంది చొప్పున 15 రోజుల్లో 2 వేల మందికి దీన్ని ఇస్తామన్నారు. గస్తీ నిర్వహణలో మార్పు చేర్పులు, ప్రజలతో మమేకమై, మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ పనిచేసే విధానాలు నేర్పుతున్నామన్నారు. ఈ గస్తీ బృందాలకు సంబంధించి ప్రజలు ఎవరైనా ఫిర్యాదులు, సలహాలు, సూచనలు ఇవ్వాలని భావిస్తే 9490616555 నెంబర్‌ లేదా స్థానిక పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ను సంప్రదించాలని సూచించారు. 

మరిన్ని వార్తలు