న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి పేర్లు సిఫార్సు చేశాం

16 Aug, 2021 01:22 IST|Sakshi

ఈ ఏడాది దాఖలైన 22,098 కేసులు పరిష్కరించాం 

కరోనాతో చనిపోయిన ఉద్యోగులను ఆదుకుంటాం 

స్వాతంత్య్ర దినోత్సవంలో హైకోర్టు సీజే జస్టిస్‌ హిమాకోహ్లీ

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టు న్యాయమూర్తుల ఖాళీల భర్తీ కోసం ఇటీవల కొందరు న్యాయవాదుల పేర్లను హైకోర్టు కొలీజియం సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ చెప్పారు. కరోనాను ఎదుర్కొంటూనే ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 13 వరకు దాఖలైన 31,160 కొత్త కేసుల్లో 22,098 కేసులను పరిష్కరించామన్నారు. ఆదివారం హైకోర్టు ఆవరణలో జరిగిన 75వ స్వాతంత్య్ర దినోత్సవంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జస్టిస్‌ కోహ్లీ ప్రసంగించారు. ‘కరోనా మొదటి, రెండో దశలో ఎందరో ఉద్యోగులను కోల్పోయాం. వారి కుటుంబాలను ఆదుకుంటాం. హైకోర్టు ఉద్యోగులు ప్రమాదకరమైన పరిస్థితుల్లోనూ విధులు నిర్వహించారు. వారి సహకారంతోనే కేసుల విచారణ చేపట్టగలిగాం.

రాష్ట్ర ప్రభుత్వం 46 కొత్త కోర్టులను మంజూరు చేయగా...ఈ కోర్టుల్లో పని చేసేందుకు 2,117 కొత్త పోస్టులను కూడా మంజూరు చేసింది. అలాగే హైకోర్టు కోసం 213 సూపర్‌ న్యూమరీ పోస్టులను మంజూరు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 33 జ్యుడీషి యల్‌ జిల్లా అంశం పరిశీలనలో ఉంది. హైకోర్టులో 2.32 లక్షల పెండింగ్‌ కేసులు ఉన్నాయి. హైకోర్టులో న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ సహరించారు. హైకోర్టుతోపాటు జిల్లా కోర్టుల్లో ప్రత్యక్ష విచారణను ఇప్పటికే ప్రారంభించాం. పరిస్థితులకు అనుగుణంగా పూర్తిస్థాయి ప్రత్యక్ష కేసుల విచారణను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇటీవల 27 మంది న్యాయవాదులను సీనియర్‌ న్యాయవాదులుగా గుర్తించాం. అక్రిడేటెడ్‌ జర్నలిస్టులకు కోర్టు విచారణను మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా వీక్షించే అవకాశం కల్పించాం. తదుపరి విచారణ తేదీలు లేని 1.20 లక్షల కేసులకు తదు పరి విచారణ తేదీలను ఇచ్చాం’’అని జస్టిస్‌ కోహ్లీ చెప్పారు.

జూనియర్లకు ఆర్థిక సాయం
ఈ సందర్భంగా సీనియర్‌ న్యాయవాదులు ఎల్‌.రవిచందర్‌ నేతృత్వంలో సమకూర్చిన నిధి నుంచి ఇబ్బందులు పడుతున్న జూనియర్‌ న్యాయవాదులకు ఆర్థికసాయం అందించారు. అలాగే సీనియర్‌ న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌రావు ఇటీవల మృతి చెందిన తన భార్య స్మారకంగా బార్‌ కౌన్సిల్‌కు అందించిన అంబులెన్స్‌ను జస్టిస్‌ కోహ్లీ ప్రారంభించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ నవీన్‌రావు, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావలీ, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌ గౌడ్, జస్టిస్‌ జి.శ్రీదేవి, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి, జస్టిస్‌ కె.లక్ష్మణ్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతోపాటు బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

హైకోర్టు ఆవరణలో  జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రసంగిస్తున్న హైకోర్టు సీజే జస్టిస్‌ హిమాకోహ్లీ 

మరిన్ని వార్తలు