అంతు చిక్కని చావులెన్నో!.. దేశంలో 77.5% మరణాలకు కారణాలు తెలియడం లేదు

25 Aug, 2022 13:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాగించాలంటే క్రమ పద్ధతితో కూడిన దినచర్య, మెరుగైన ఆహారపు అలవాట్లు ఉండాలి. గాడితప్పితే రోగాల బారినపడి ముందస్తుగానే మృత్యు ఒడికి చేరడం ఖాయం. ఇలాంటి ముందస్తు మరణాలకు సరైన కారణాలు తెలిస్తే వాటిని తగ్గించడానికి మార్గాలు అన్వేషించడం సులభమవుతుంది. కానీ దేశంలో 77.5 శాతం మరణాలకు కారణాలు తెలియడం లేదు. అంటే వాటికి సంబంధించిన వివరాలు కేవలం ఆయా కుటుంబసభ్యుల వరకే పరిమితమవుతున్నాయి.  

ఉత్తరాది వైద్యులు, నిపుణుల అధ్యయనం 
ముందస్తు మరణాలను తగ్గించి, మనుషులు దీర్ఘాయుష్షుతో జీవించేందుకు సరైన వ్యూహాన్ని రూపొందించాలంటే ప్రతి మరణాన్ని నమోదు చేయడంతో పాటు సరైన కారణం తెలుసుకోవాలని ఉత్తరాది రాష్ట్రాల వైద్య, ఆరోగ్య శాఖలకు చెందిన కొందరు వైద్యుల అధ్యయనం స్పష్టం చేస్తోంది. దేశంలో సంభవిస్తున్న మరణాలకు సంబంధించి ప్రభుత్వాల వద్ద ఏమేరకు సమాచారముందనే కోణంలో కొందరు వైద్యులు, ఇతర నిపుణులతో కూడిన బృందం పరిశీలన జరిపింది.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ గణాంకాల ఆధారంగా 2018 నుంచి 2020 మధ్య కాలంలో చోటు చేసుకున్న మరణాలు ఎందువల్ల సంభవించాయో తెలుసుకునేందుకు సంబంధిత పత్రాలను (మెడికల్‌ సర్టిఫికేషన్‌ ఆఫ్‌ కాజ్‌ ఆఫ్‌ డెత్‌(ఎంసీసీడీ) పరిశీలించింది. అయితే చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వాల వద్ద నమోదైన అనేక మరణాలకు కారణాలు లేకపోవడం గమనార్హం. చాలావాటికి అనారోగ్య సమస్యల పేరిట మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నప్పటికీ.. లోతైన పరిశీలనను, కారణాలను నమోదు చేయడం లేదు. 

గోవా బెస్ట్‌ .. బిహార్‌ లీస్ట్‌  
మరణాలకు సంబంధించి ఎంసీసీడీ రికార్డు జాతీయ సగటు 22.5 శాతంగా ఉంది. 2020లో దేశవ్యాప్తంగా 80.62 లక్షల మరణాలు నమోదయ్యాయి. అయితే వీటిల్లో 18.11లక్షల మరణాలకు మాత్రమే మెడికల్‌ సర్టిఫికేషన్‌ దక్కింది. మిగతా 77.5 శాతం మరణాలకు రోగ నిర్ధారణ కాకపోవడం గమనార్హం. వాస్తవానికి జరుగుతున్న మరణాల్లో అతి తక్కువ మాత్రమే ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయి. అలా రికార్డయిన వాటిలోనూ మూడోవంతుకు పైగా మరణాలకు కారణాలు రికార్డు కావడం లేదు. ఇక ఎంసీసీడీ రికార్డులో గోవా ప్రథమ స్థానంలో, అట్టడుగు స్థానంలో బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, కేరళ ఉన్నాయి. తెలంగాణ 30.9 శాతంతో 15వ స్థానంలో ఉంది. 

మరిన్ని వార్తలు