ఇండియాలోనే బిగ్గెస్ట్‌ బిర్యానీ ప్లేట్‌.. ఒకేసారి 15-20 మంది తినేయొచ్చు

19 Feb, 2023 08:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాకాహారం మాత్రమే తినే తనపేరిట మాంసాహార బిర్యానీ రావడం సంతోషంగా ఉందని నటుడు సోనూసూద్‌ పేర్కొన్నారు. కొండాపూర్‌లోని జిస్మత్‌ జైల్‌ మండి రెస్టారెంట్‌లో శనివారం సోనూసూద్‌ ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ బిర్యానీ ప్లేట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిది అడుగుల విస్తీర్ణంలో ఉండే బిగ్గెస్ట్‌ ప్లేట్‌ బిర్యానీని ఒకేసారి 15 నుంచి 20 మంది తినవచ్చన్నారు.

ఈ సందర్భంగా జిస్మత్‌ మండి నిర్వాహకులు గౌతమి, ధర్మ, గౌతమ్‌లను ఆయన అభినందించారు. త్వరలో విజయవాడ, గుంటూరు, నెల్లూరు, బెంగళూరులో బిగ్గెస్ట్‌ బిర్యానీ ప్లేట్‌ను సోనూసూద్‌తో అందుబాటులోకి తెస్తామని నిర్వాహకులు తెలిపారు.

వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తా..
రాష్ట్రంలో ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తానని సినీ/చారిటీ స్టార్‌ సోనూసూద్‌ వెల్లడించారు. హైదరాబాద్‌తో తనకు దగ్గర అను­బంధం ఉందనీ, తన భార్య తెలుగు మహిళని తెలి­పారు. నగరానికి చెందిన ఫిక్కీ లేడీస్‌ క్లబ్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఓ) ఆధ్వర్యంలో సోమాజి­గూడలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన ముఖా­ము­ఖిలో ఆయన మహిళా వ్యాపారవేత్తలతో మాట్లాడా­రు. ఆయనేమన్నారంటే.. 

‘కరోనా తీవ్రత తగ్గిపోయినా సమస్యలతో మమ్మల్ని సంప్రదించేవారు తగ్గలేదు. ప్రస్తుతం షిరి­డీలో ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే  తెలంగాణలో మరొకటి రానుంది. పంజాబ్‌లో దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి సమీప భవిష్యత్తులో ప్రతి రాష్ట్రంలోనూ వృద్ధాశ్ర­మం, ఓ ఉచిత పాఠశాల ఉండేలా చూడాలనేది మా కోరిక. చాలా రాజకీయ పార్టీలు నన్ను తమవైపు తిప్పుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించిన మాట వాస్తవమే. ఇప్పటి­కిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి నాకు లేదు. చిత్ర పరిశ్రమలో ఇంకా చాలా చేయాల్సి ఉంది.

చెక్‌లు అందించి సాయం చేయడం మాత్రమే కాదు.. 
చెక్‌లు అందించి, చారిటీలు చేసే వారు చాలా మంది ఉన్నారు. అయితే పర్సనల్‌ టచ్‌ చాలా ముఖ్యం. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న బాలికను నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తరలించాం. ఆమె సోదరుడు తోడుగా వచ్చాడు. కానీ, దురదృష్టవశాత్తూ ఆమెను రక్షించలేకపో­యాం. ఆ తర్వాత ఆమె సోదరుడు కూడా మృతి చెందాడు. ఆమె తల్లిదండ్రులు తమ ఇద్దర్నీ కోల్పో­యారు. దీంతో వీలైనప్పుడల్లా నాగ్‌పూర్‌లోని వారి తల్లిదండ్రులను కలవడం అలవాటు చేసుకున్నా. ఇదే నేను ఇష్టపడే పర్సనల్‌ టచ్‌.. అని సోనూసూద్‌ చెప్పారు. 
చదవండి: పబ్‌లు, ఫామ్‌హౌజ్‌లపై పోలీస్‌ రైడ్స్‌

మరిన్ని వార్తలు