రాజీకి రాచబాట

19 Dec, 2021 03:27 IST|Sakshi
ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్‌. చిత్రంలో జస్టిస్‌ జి. చంద్రయ్య, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్రన్, సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావు, తెలంగాణ హైకోర్టు  సీజే జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, మంత్రి ఇంద్రకరణ్‌  

ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో జస్టిస్‌ ఎన్వీ రమణ

సీఎం కేసీఆర్‌తో కలసి ప్రారంభించిన సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌

హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటు సంతోషకరమని వెల్లడి

ఐఏఎంసీ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి

సాక్షి, హైదరాబాద్‌: రాజీ, మధ్యవర్తిత్వం ద్వారా వ్యాపారుల మధ్య వివాదాలను పరిష్కరించడంలో ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ) కీలకపాత్ర పోషిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు. దేశంలో ఆర్బిట్రేషన్, మీడియేషన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని వీకే టవర్స్‌లో ఏర్పాటు చేసిన దేశ తొలి ఐఏఎంసీని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో కలసి సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల కేసుల్లో మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్‌ను ఏఐఎంసీ ప్రోత్సహిస్తుందని, తక్కువ ఖర్చు, స్వల్ప సమయంలో వివాదాల పరిష్కారానికి ఐఏఎంసీ వేదికగా నిలుస్తుందన్నారు. ఈ ఏడాది జూన్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు సూచించగా ఆరు నెలల్లోనే ఈ కేంద్రం ప్రారంభానికి అడుగులు పడ్డాయన్నారు.

ఐఏఎంసీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, అన్ని రకాలుగా ఈ ప్రదేశం అనువైన వేదికన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో స్వల్ప వ్యవధిలోనే వసతి కల్పించిందని, శాశ్వత భవన నిర్మాణం కోసం భూమిని కూడా కేటాయించిందని సీజేఐ ప్రశంసించారు. దేశ, విదేశాలకు చెందిన అనేక వివాదాలు ఈ కేంద్రానికి రానున్నాయని తెలిపారు. 

ప్రారంభానికి ముందే పెద్ద కేసు: సీఎం కేసీఆర్‌ 
ఐఏఎంసీ ప్రారంభానికి ముందే లలిత్‌ మోదీ కుటుంబ వివాదానికి సంబంధించిన పెద్ద కేసు పరిష్కారం కోసం ఈ సంస్థకు వచ్చిందని, ఈ కేంద్రం విజయవంతం అవుతుందనడానికి ఇదే శుభసూచకమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌ అంతర్జాతీయంగా పురోగమిస్తోందని, అన్ని రంగాలకు చిరునామాగా మారనుందన్నారు. కోర్టుల్లో పరిష్కారానికి నోచుకోని కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు.

ఐఏఎంసీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని, రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగే ఒప్పందాల్లో వివాదాల పరిష్కారానికి ఈ కేంద్రాన్ని ఆశ్రయించేలా చట్టానికి సవరణలు తెస్తామని కేసీఆర్‌ తెలిపారు. ఐఏఎంసీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన భారత న్యాయ శిఖరం జస్టిస్‌ రమణకు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఐఏఎంసీ వెబ్‌సైట్‌ను కేసీఆర్‌ ప్రారంభించారు.

కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావు, జస్టిస్‌ హిమాకోహ్లి, పూర్వ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్రన్, ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, న్యాయమూర్తులు, మానవహక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ డాక్టర్‌ నాగార్జున, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్‌ అలీ, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు