యూఏఈ వెళ్లే వారికి ఊరట 

25 Jun, 2021 08:32 IST|Sakshi

జూలై 7 నుంచి విమానాలు ప్రారంభం 

2 డోస్‌ల టీకా, ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌లో నెగెటివ్‌ రిపోర్ట్‌ తప్పనిసరి

మోర్తాడ్‌ (బాల్కొండ): యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో ఉపాధి కోసం వెళ్లే కార్మికులకు శుభవార్త. జూలై 7వ తేదీ నుంచి యూఏఈకి భారత్‌ నుంచి విమానాలు ప్రారంభం కానున్నాయి. కరోనా తీవ్రత కారణంగా ఏప్రిల్‌ 25 నుంచి మన దేశ విమానాల రాకపోకలపై యూఏఈ విధించిన నిషేధం జూలై 6వ తేదీ వరకు అమలులో ఉంటుంది. ఈ మేరకు యూఏఈ ప్రభుత్వం భారత్‌ నుంచి వచ్చే విమానాలకు 7వ తేదీ నుంచి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ విషయంలో కొన్ని షరతులను విధించింది.

భారత్‌ నుంచి యూఏఈకి వెళ్లే వలస కార్మికులు రెండు డోస్‌ల కోవిషీల్డు టీకా తీసుకుని ఉండాలి. అలాగే ప్రయాణానికి మూడు రోజుల ముందు ఆర్‌టీపీసీఆర్‌ టెస్టు చేయించుకుని నెగెటివ్‌గా నిర్ధారించిన సర్టిఫికెట్‌ను చూపాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 25కు ముందు కరోనా సెకండ్‌ వేవ్‌ సందర్భంగా అనేక మందిని యూఏఈ కంపెనీలు సెలవులపై ఇంటికి పంపించాయి. మరి కొందరు సుదీర్ఘ విరామం తరువాత సెలవులపై ఇంటికి వచ్చారు. అలా వచ్చిన వారికి యూఏఈ కంపెనీలు పనిలో చేరాలని పిలుపునిచ్చాయి. మన దేశ విమానాలపై యూఏఈ ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేయడంతో వలస కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పూర్తిస్థాయిలో పాస్‌పోర్టు సేవలు 
నగర ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య వెల్లడి 
రాంగోపాల్‌పేట్‌ (హైదరాబాద్‌): తెలంగాణలో లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, పాస్‌పోర్టు సేవా లఘు కేంద్రాల్లో పూర్తిస్థాయిల్లో సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పలు పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో ఈ నెల10 నుంచి సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.  
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు