డిసెంబర్‌ చివరికల్లా అందరికీ టీకా!

7 Aug, 2021 01:51 IST|Sakshi

18 ఏళ్లు పైబడినవారికి ఇచ్చేలా వైద్యారోగ్య శాఖ ప్రణాళిక

కరోనా మూడో వేవ్‌ రాకుండా నియంత్రణ చర్యలపై దృష్టి

12–18 ఏళ్ల మధ్య వయసు వారికి అక్టోబర్‌ నుంచి టీకాలు?  

ఈ వయసు వారు రాష్ట్రంలో దాదాపు 45 లక్షల మంది 

సంపూర్ణ వ్యాక్సినేషన్‌తోనే కరోనాకు చెక్‌: అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన అందరికీ ఈ ఏడాది చివరికల్లా కరోనా టీకాలు వేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ చేపట్టడం ద్వారా మూడో వేవ్‌ను అడ్డుకోవచ్చని భావిస్తోంది. ఈ మేరకు త్వరలో టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయనున్నట్టు ఉన్నతాధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడినవారు 2.20 కోట్ల మంది ఉన్నారు. అందులో ఇప్పటివరకు 1.15 కోట్ల మందికి టీకాలు వేశారు. వీరిలో 38.21 లక్షల మందికి రెండో డోసు కూడా పూర్తయింది. మిగతా వారికి రెండో డోసు టీకాను.. అదనంగా 1.05 కోట్ల మందికి రెండు డోసుల టీకాలను వేయాల్సి ఉంది. మరోవైపు 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసువారికి అక్టోబర్‌ నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో ఈ వయసు వారు 45 లక్షల మందివరకు ఉంటారని పేర్కొంటున్నారు. 

హైదరాబాద్‌లో 24.63 లక్షలు.. రంగారెడ్డిలో 15.53 లక్షలు 
రాష్ట్రంలో ఇప్పటివరకు అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 24.63 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్‌ వేసినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. అందులో 8.32 లక్షల మందికి రెండో డోస్‌ వేశారు. తర్వాత రంగారెడ్డి జిల్లాలో 15.53 లక్షల మందికి టీకాలు (ఇందులో 4.85 లక్షల మందికి రెండో డోస్‌) వేశారు. అత్యంత తక్కువగా నారాయణపేట జిల్లాలో 59,873 మందికి (ఇందులో 16,364 మందికి రెండు డోసులు) టీకాలు వేశారు. ఇప్పటికే మొదటి డోస్‌ తీసుకున్నవారికి రెండో డోస్‌ వేసే ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని భావిస్తున్నారు. అయితే కోవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య 84 రోజుల గడువు విధించడంతో ప్రక్రియ ఆలస్యమవుతోంది. 

ఏడాది చివరిదాకామూడోవేవ్‌ రాదు 
రాష్ట్రంలో ఈ ఏడాది చివరినాటికి 18 ఏళ్లు పైబడిన అందరికీ కరోనా వ్యాక్సిన్‌ అందించేలా ప్రణాళిక రూపొందించాం. కేంద్ర ప్రభుత్వం కూడా డిసెంబర్‌ నాటికి అందరికీ టీకా వేసేలా కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాది చివరివరకు మూడో వేవ్‌ వచ్చే అవకాశమే లేదు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగం దాకా ఒక్క కేరళలోనే ఉంటున్నాయి. ప్రస్తుతం రోజుకు 42 వేల కరోనా కేసులు నమోదైతే.. కేరళలో 22 వేలు, మహారాష్ట్రలో 10 వేలు ఉంటున్నాయి. మిగతా అన్ని రాష్ట్రాల్లో కలిపి పది వేల కేసులే నమోదవుతున్నాయి. అంటే ఆ రెండు రాష్ట్రాలను మినహాయిస్తే.. మిగతా రాష్ట్రాల్లో సాధారణ కేసులే నమోదవుతున్నాయి. 
– డాక్టర్‌ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు.

మరిన్ని వార్తలు