ఇండయన్‌ ఆర్మీ డే! సెల్యూట్‌..సైనికుడా..!

15 Jan, 2023 09:56 IST|Sakshi

తమ బతుకునే ఫణంగా పెట్టి తన కోసం, తన కుటుంబం కోసం కాకుండా దేశం కోసం ఉద్యోగం చేస్తుంటారు కొందరు. పుట్టిన ఊరికి దూరంగా, కన్నవారికి, కట్టుకున్న వారికి కనపడకుండా ఎండా, వానను లెక్క చేయకుండా చలికి వణుకుతూ అనుక్షణం ఎదురయ్యే ప్రమాదాలతో సహజీవనం చేస్తూ దేశసేవకు తమ జీవితాలను అంకితం చేస్తుంటారు. వారే మన భారత సైనికులు. త్యాగానికి నిదర్శనంగా నిలుస్తున్న నిజమైన దేశ భక్తులు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ఏటా జనవరి 15వ తేదీన ఆర్మీ డే జరుపుకుంటాం. పోరాటాల పురిటిగడ్డగా పేరొందిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎందరో యువకులు ఆర్మీలో పనిచేస్తున్నారు. అనేక మంది రిటైర్డ్‌ అయి సమాజ సేవలో ఉన్నారు. నేడు సైనిక దినోత్సవం సందర్భంగా.. వారిపై ప్రత్యేక కథనం.  

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 1300 మంది వరకు త్రివిధ దళాల్లో పనిచేశారు. వీరిలో ఎయిర్‌ఫోర్స్‌లో 50 మంది, నేవీలో 20 మంది వరకు పని చేశారు. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారు దాదాపు 400 మంది వరకు జవాన్‌ స్థాయి నుంచి కల్నల్‌ హోదా వరకు సైన్యంలో పనిచేస్తున్నారు. సైనిక సంక్షేమ శాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం 1300 మందిలో కొంతమంది యుద్ధంలో వీరమరణం పొందారు. వివిధ కారణాలతో మరో 350 చనిపోయారు.

మన జిల్లాకు చెందిన పలువురు సైనికులు 1965లో జరిగిన పాకిస్తాన్‌ యుద్ధంలో, 1977లో జరిగిన బంగ్లాదేశ్‌ విభజన సమయంలో, 1999 కార్గిల్‌ యుద్ధంలో,  2021లో చైనా బలగాలను నిలువరించిన ఘటనలో పాల్గొన్నారు. నల్లగొండ, సూర్యాపేట ప్రాంతానికన్నా భువనగిరి ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో సైన్యంలో చేరుతున్నారు. వలిగొండ మండలం ఎదుళ్లగూడెంలో 15 మంది మాజీ సైనికులు ఉన్నారు. ముగ్గురు ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్నారు.  

ప్రజాప్రతినిధులుగా..
త్రివిధ దళాల్లో పనిచేసిన పలువురు రిటైర్డ్‌ అయిన తరువాత ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవలందిస్తున్నారు. కోదాడ, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా, ప్రస్తుతం నల్లగొండ ఎంపీగా పనిచేస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భారత వాయుసేనలో మిగ్‌ యుద్ధవిమానం ఫైలెట్‌గా పనిచేశారు. శాలిగౌరారం మండలం ఇటుకులపహాడ్‌ సర్పంచ్‌ సైదులు సైన్యంలో పనిచేసినవాడే. హాలియా మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌ కూడా సైన్యంలో పనిచేశారు. ఇలా చాలా మంది ఉన్నారు. 


అల్లి గంగరాజు, అల్లి సైదులు, అల్లి వెంకటేశ్వర్లు

దేశసేవకు ఆ కుటుంబం అంకితం
ఆర్మీలో ఉద్యోగం అంటేనే బయపడే కాలంలో దాదాపు మూడు దశాబ్దాల క్రితం మారుమూల గ్రామంలో పుట్టిపెరిగి, ఒకే ఇంటి నుంచి ముగ్గురు అన్నదమ్ములు దేశసేవ కోసం సైన్యంలో చేరి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరిలో ఇద్దరు ఉద్యోగ విరమణ పొందగా మరొకరు దేశమాత సేవలోనే ఉన్నారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకులపçహాడ్‌ గ్రామానికి చెందిన అల్లి రామచంద్రయ్య– లక్ష్మి దంపతులకు నలుగురు కుమారులు సైదులు, వెంకటేశ్వర్లు, గంగరాజు, సురేష్‌  ఉన్నారు. పెద్ద కుమారుడు సైదులు 1998లో తొలిప్రయత్నంలోనే ఆర్మీలో ఉద్యోగం సాధించాడు.

అన్నను స్పూర్తిగా తీసుకొని తమ్ముళ్లు వెంకటేశ్వర్లు 2005లో గంగరాజు 2011లో సైన్యంలో చేరారు. నాలుగవవాడైన సురేష్‌ అన్ని రకాల పరీక్షలు పాసై  ఆర్మీలో చేరుదామనుకొనే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఉద్యోగంలో చేరలేకపోయాడు. అతను ఇంటి వద్ద ఉండి వ్యవసాయం చేసుకుంటున్నాడు. 1998లో ఉద్యోగంలో చేరిన సైదులు 2014లో నాయక్‌ హోదాలో ఉద్యోగ విరమణ పొందాడు.

గత స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై సేవలందిస్తున్నాడు. వెంకటేశ్వర్లు 2022లో లాన్స్‌నాయక్‌ హోదాలో రిటైర్‌ అయ్యాడు. గ్రామంలోనే ఉండి సైన్యంలో చేరాలనుకుంటున్న వారికి శిక్షణ ఇస్తున్నాడు. గంగరాజు ప్రస్తుతం హవాల్దార్‌ హోదాలో జమూకశ్మీర్‌లో పనిచేస్తున్నాడు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని గ్రామానికి చెందిన మరో ఐదుగురు యువకులు సైన్యంలో చేరారు.  

క్రమశిక్షణ అలవడుతుంది 
ఆర్మీ ఉద్యోగం అంటేనే క్రమశిక్షణ, నీతి నిజాయితీలకు మారుపేరు. సైన్యంలో చేరిన ప్రతి ఒక్కరూ కఠోర శిక్షణతో పాటు శరీరదారుఢ్యం, మానసికస్థైర్యం, ఆత్మరక్షణలో రాటుదేలుతారు. నేడు సైన్యంలో చేరేందుకు యువత ఎంతో ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. ఇది దేశరక్షణకు మంచి పరిణామంగానే భావించవచ్చు. నాడు సైన్యంలో చేరేందుకు ఒక్క ఉద్యోగానికి 10 మంది పోటీపడితే నేడు సైన్యంలో ఒక్క ఉద్యోగానికి వందల సంఖ్యలో పోటీపడుతున్నారు.     
– అల్లి సైదులు, మాజీ సైనికుడు, ఇటుకులపహాడ్‌ సర్పంచ్‌ 

సైనిక నియామకాల కోసం ప్రభుత్వం ఇటీవల కొత్తగా ‘అగ్నిపథ్‌’ విధానాన్ని తీసుకొచ్చింది. దీనిలో చేరడానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి దాదాపు 7000 మంది యువకులు ముందుకొచ్చారు. వీరికి  ఫిజికల్, మెడికల్‌ టెస్ట్‌లు పూర్తి కాగా త్వరలో రాత పరీక్ష జరుగుతుంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం విజయరాఘవాపురానికి చెందిన మాజీ సైనికుడు కల్నల్‌ డాక్టర్‌ సుంకర శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘ది షోల్జర్‌ ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో వివిధ అంశాలలో ఉచితంగా శిక్షణ ఇచ్చారు.   

2020 సంవత్సరం జూన్‌లో చైనా సరిహద్దులోని గాల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు అర్పించిన సూర్యాపేటకు చెందిన కల్నల్‌ సంతోష్‌బాబు 


ఆదుకుంటున్నామా..
యుక్త వయస్సులో అన్నీ వదులుకొని దేశసేవ కోసం పనిచేసిన సైనికులు రిటైర్డ్‌ అయిన తరువాత వారికి అందాల్సిన సౌకర్యాలు సక్రమంగా అందడం లేదనే విమర్శలున్నాయి. మాజీ సైనికుల డిమాండ్‌లు అపరిష్కృతంగా ఉన్నాయి. చాలా మంది తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

మాజీ సైనికుల డిమాండ్స్‌ ఇవీ..

  • ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు 2 శాతం నుంచి 5 శాతానికి పెంచాలి.
  • మాజీ సైనికులకు కేటాయించిన ఉద్యోగాలు ఒకసారి భర్తీ కాకుంటే వాటిని బ్యాక్‌లాగ్‌ చేసి మళ్లీ మాజీ సైనికులకే కేటాయించాలి.
  •  మాజీ సైనికుల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందించాలి.
  • ఉచితంగా ఇంటి స్థలాలు కేటాయించాలి.
  • రాయితీ మీద మాజీ సైనికులకు ఇచ్చే సరుకుల కోసం ఉమ్మడి జిల్లాలో క్యాంటీన్‌ ఏర్పాటు చేయాలి. సరుకుల కోసం హైదరాబాద్‌కు వెళ్లి రావడం ఇబ్బందిగా ఉంది.
  • ఉమ్మడి జిల్లాలో మాజీ సైనికులకు స్మారక చిహ్నం నిర్మించాలి.
  • మాజీ సైనికులకు జీఓ నంబర్‌ 69 ప్రకారం సత్వరమే అన్ని సౌకర్యాలు కల్పించాలి.

దేశసేవకు మించిన తృప్తి మరొకటి లేదు
దేశం కోసం పనిచేయడానికి మించిన తృప్తి దేనిలోనూ ఉండదు. ఇటీవల ఆగ్నిపథ్‌ నియామకాల కోసం సూర్యాపేట జిల్లా నుంచి నేను ఏర్పాటు చేసిన ‘ది షోల్జర్‌ ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో జిల్లా అధికారుల సహకారంతో 225 మందికి శిక్షణ ఇవ్వగా తుది రాత పరీక్షకు 167 మంది ఎంపికయ్యారు. ఇది ఆనందించదగ్గ విషయం. యువత ఇంకా ముందుకు రావాలి.
– రిటైర్డ్‌ కల్నల్‌ సుంకర శ్రీనివాసరావు, విజయరాఘవాపురం, మునగాల 

దేశం రుణం తీర్చుకున్నా
సైన్యంలో పనిచేసి దేశం రుణం తీర్చుకున్న తృప్తి మిగిలింది. నేను చదువుకునే రోజుల్లో సికింద్రాబాద్‌ వెళ్లాను. అక్కడ మిలటరీ వారిని చూసి నేను కూడా సైన్యంలో చేరాలనుకున్నాను. 20 సంవత్సరాల వయస్సులో 1962లో సైన్యంలో చేరాను. 1965లో పాకిస్తాన్‌ యుద్ధంలో, 1971లో బంగ్లాదేశ్‌ యుద్ధంలో పాల్గొన్నా. 1977లో రిటైర్డ్‌ అయ్యాను. తరువాత ఫైర్‌ ఆఫీసర్‌గా పనిచేశాను. రెండు యుద్ధాల్లో పాల్గొని దేశం కోసం పనిచేసిన తృప్తి ఎప్పటికీ ఉంటుంది. యువత కూడా దేశం కోసం పనిచేయడానికి ముందుకు రావాలి.
– సంధి పాపిరెడ్డి, అయిటిపాముల, కట్టంగూర్‌ మండలం 

(చదవండి: టోల్‌ ప్లాజాకు ‘పండుగ’)

మరిన్ని వార్తలు